పేదల మనిషి కేసీఆర్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి నూతన సంకల్పానికి శ్రీకారం చుట్టింది. అవయవ దానం ద్వారా ఊపిరి ఆగిపోయే వారికి కొత్త ఊపిరినివ్వాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం వైద్యసంస్థ అయిన నిమ్స్‌ జీవన్‌ దాన్‌ తో తెలంగాణ జాగృతి ఒప్పందం చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. మనోహర్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వైద్య విద్య సంచాలకులు రమేశ్‌ రెడ్డి కార్యక్రమంను

దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కశ్మీర్లో అమరులయిన జవాన్ల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు సారే జహాసే అచ్చా పాటను బ్యాండ్తో ఆలపించారు. సభకు హాజరయిన నేతలు, ఇతరులు అవయవ దానం పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రతిన పూనారు. అనంతరం ఎంపి కవిత మాట్లాడుతూ కశ్మీర్లో సైనికులపై జరిగిన దాడి పట్ల కెసిఆర్‌ కలత చెంది తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవద్దని నిర్ణయించారని తెలిపారు. సిఎం కెసిఆర్‌ పుట్టిన రోజును రెండు విషయాలను కోరుకుందాం…కెసిఆర్కు మంచి ఆయుష్సును ఇవ్వమని దేవున్ని ప్రార్థించడం, ఆయన పుట్టిన రోజు ప్రారంభించిన అవయవదానం వల్ల వేలాది మంది ఊపిరి పోసుకుని మంచిగా ఉండాలని కోరుకుందామన్నారు ఎంపి కవిత. కెసిఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దామని ఆమె పిలుపునిచ్చారు.

ఆయన సొంత బిడ్డగా...తెలంగాణ బిడ్డగా కెసిఆర్‌కు ఆయన జన్మదినం రోజున  ఏమివ్వాలనేది అర్థం కాని పరిస్థితిలో కొద్ది రోజులు ఆలోచించానన్నారు. కోట్లాది మంది ప్రజలను పరాయి పాలన నుంచి విముక్తి చేసిన గొప్ప నాయకుడు కెసిఆర్‌ అన్నారు.  దేశంలోనే తెలంగాణను ముందంజలో పెట్టిన కెసిఆర్‌ మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్ననాయకుడు అడక్కుండానే అన్నీ ఇస్తున్నారని కవిత వివరించారు. ఎక్కడో మారు మూల గ్రామంలోని  పేద అవ్వకు కష్టం వస్తే ఏవిధంగా సాయం చేయాలని ఆలోచించే గొప్ప మనిషి కేసిఆర్‌ అన్నారు. చంద్రునికో నూలు పోగు లా...తెలంగాణ జాగృతి అవయవ దానం కార్యక్రమం చేపట్టాలని ఈ మహా సంకల్పానికి శ్రీకారం చుట్టామని కవిత తెలిపారు. 
బతికున్నప్పుడు గుడికి, బడికి పది వేలు ఇస్తాము..పార్కుల్లో బెంచీలు ఇస్తాం. ప్రార్థనా స్థలాల్లో మొక్కలు నాటుతాం.. ఇవన్నీ మనం పోయాక కూడా మనం జనాలకు గుర్తుండాలని ఇలా చేస్తుంటాం అని కవిత చెప్పారు. అవయవాలను దానం చేయడం ద్వారా మనిషి చనిపోయినా కూడా బతికి ఉన్న వాళ్లను చూసే అవకాశం కలుగుతుందని తెలిపారు. అవయవ దానం పట్ల ప్రజల్లో చైతన్యం కారణం అయితే. రెండోది పేదలు  ప్రయివేటు ఆసుపత్రిలో లక్షలు పెట్టి అవయవాలను మార్పిడి చేసుకోలేరని భావించిన కెసిఆర్‌ అవయవ దానంను ఆరోగ్య శ్రీ కిందకు  చేర్చినట్లు ఎంపి కవిత తెలిపారు. అవయవ దానంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. నిమ్స్‌ లో  పోస్ట్‌ ఆపరేటివ్‌ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఇంటికి వెళ్లేంత వరకు ఆయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని కవిత తెలిపారు. ప్రభుత్వ డాక్టర్లను ఈ సందర్భంగా ఎంపి కవిత ప్రశంసించారు. 
 

నిమ్స్‌లో చేసిన అవయవ మార్పిడి కేసు ఒక్కటి కూడా ఫెయిల్‌ కాలేదన్నారు. జాగృతి, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆర్గాన్స్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ కో ఆర్డినేటర్లుగా మారాలని కోరారు. నిమ్స్‌ నిర్వహిస్తున్న ఆన్లైన్‌ కోర్సులో వారంతా జాయిన్‌ అవుతారని, ఫలితంగా అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించవచ్చన్నారు. నిమ్స్‌ ఏర్పాటు చేసిన జీవన్‌ దాన్‌ సంస్థతో తెలంగాణ జాగృతి ఒప్పందం చేసుకున్న దృష్ట్యా అపోహలు, అనుమానాలు అక్కర్లేదన్నారు.

మన దేశంలో అసలే డాక్టర్లు తక్కువగా ఉన్నారని, 120 మంది కొత్త మెడికల్‌ స్టుడెంట్స్కు ఒక్క డెడ్‌ బాడీ కూడా దొరకని పరిస్థితి ఉంది. విదేశాల్లో ప్రతి ఐదుగురు స్టుడెంట్స్కు ఒక డెడ్‌ బాడీ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రాణం లేని భౌతికఖాయంతో ప్రాణాలు పోసే వైద్యం నేర్చుకునేందుకు స్టుడెంట్స్‌ ప్రాక్టికల్స్‌ చేయాల్సి ఉంటుందని, దీని కోసం మెడికల్‌ కాలేజీలకు డెడ్‌ బాడీలను దానం చేయాలని ఎంపి కవిత కోరారు.

వచ్చే పుట్టిన రోజు వరకు ఇదే స్పూర్తితో 50 వేల అవయవ దానం పత్రాలను నిమ్స్‌ కు అంద జేస్తామన్నారు ఎంపి కవిత.

తెలంగాణ జాగృతి అవయవ దానం మహా సంకల్పానికి  తెలంగాణ వైశ్య సంఘం, అగర్వాల్‌, జైన సమాజ్‌, పిలిం జెఎసి, యువశక్తి స్టుడెంట్‌ వెల్ఫెర్‌, తెలంగాణ బాడీ బిల్డింగ్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ ఆర్‌ ఎంపి, పిఎంపి సంఘం, ఐఎంఏ, ప్రయివేటు ఉద్యోగ సంఘం, వైటుకె, ట్రస్మా, టిఆర్‌ఎస్‌ ఎన్నారై యుఎస్‌ఎ , టిఆర్‌ఎస్‌ కార్మిక విభాగం మద్ధతు తెలిపాయి. తామూ అవయవదానం పత్రాలపై సంతకాలు చేసిస్తామని ఆయా సంఘాల నేతలు ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, జహీరాబాద్‌ ఎంపి బిబి పాటిల్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, ఎమ్మెల్సీ జనార్ధన్‌ రెడ్డి, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి, బెవరేజేస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీ ప్రసాదరావు, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ చైర్మన్‌ రాకేష్‌, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవ రెడ్డి, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేష్‌ రెడ్డి, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.మనోహర్‌, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ప్రతాప్‌ రెడ్డి, గ్లోబల్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌ , సన్‌ షైన్‌ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ గురువా రెడ్డి, టి న్యూస్‌ సిఈఓ నారాయణ రెడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, ఉపాధ్యక్షులు మేడే రాజీవ్‌ సాగర్‌, వైద్య విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ ప్రీతి రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here