అంతుపట్టని కేసీఆర్‌ వ్యూహం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ సర్కారు బడ్జెట్‌ కసరత్తు ప్రారంభించింది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం…ఇచ్చిన హావిూలు అమలు చేయడానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ.. సీఎం దగ్గరే ఉండడంతో ఆయన నేతృత్వంలోనే బడ్జెట్‌ తయారవుతోంది. ఈసారి బడ్జెట్‌ ఎవరు ప్రవేశపెడతారు..? ఆర్థిక మంత్రి లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయా అనే ఆసక్తి నెలకొంది. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలకు అవసరమయ్యే నిధులపై అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. సుమారు రెండు లక్షల కోట్లకు బడ్జెట్‌ అంచనాలు రూపొందిస్తున్నారని సమాచారం. మరో వైపు లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి బడ్జెట్‌ సమావేశాలు పూర్తి చేయాలని యోచిస్తున్న సర్కార్‌ ఈ నెల 25న బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు సిద్దమవుతోంది. కేంద్రం తరహలోనే తెలంగాణలోనూ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని సర్కార్‌

భావిస్తుంది. బడ్జెట్‌ కేటాయింపులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల మూడో వారంలో జరిగే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలుండడంతో ఆదివగా కసరత్తు చేస్తున్నారు. ముందుగా మూడు నెలల కోసమే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలని భావించినా..మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాక జూన్‌ , జులైలో బడ్జెట్‌ కోసం పార్లమెంటు సమావేశమవుతుంది. అప్పుడే నిధులపై స్పష్టత వస్తుంది కాబట్టి ఆరు నెలల కోసం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ రూపొందిస్తున్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ..గత బడ్జెట్‌ కంటే 15 శాతం ఎక్కువ ఉందబోతోందని సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల మేరకు ఆసరా పెన్షన్లు, రైతుబంధు సాయం పెంపునకు అదనపు నిధులు కేటాయించాల్సి ఉంది. అలాగే మరికొన్ని కొత్త పథకాలను కూడా ప్రవేశ పెట్టతారని సమాచారం. అందుకే గత బడ్జెట్‌ను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మించిపోనుందని తెలుస్తోంది. సాధారణంగా శాసన సభలో ఆర్థిక మంత్రి, శాసన మండలిలో సీనియర్‌ మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అయితే ఆర్థిక శాఖ సీఎం దగ్గరే ఉండడంతో ఈసారి ఆయనే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెడతారా అనే సస్పెన్స్‌ నెలకొంది. ఒకవేళ బడ్జెట్‌ సమావేశాల్లోపు మంత్రి వర్గ విస్తరణ చేసి ఆర్థిక మంత్రిని నియమించకపోతే…కేసీఆరే బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ మంత్రి లేకుండా బడ్టెట్‌ సమావేశాలు జరగడం..స్వయానా ముఖ్యమంత్రే బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం రికార్డేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి మంత్రి వర్గ విస్తరణ చేసి ఆర్థిక శాఖ మంత్రిని నియమిస్తారా… లేక సీఎం కేసీఆరే బడ్జెట్‌ ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తారో వేచి చూడాలి.

గత ఏడాది బడ్జెట్‌ కంటే సుమారు 15 శాతం వృద్ధితో 2019 -20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. ఇది తాత్కాలిక బడ్జెట్‌ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నింటికీ నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని అర్ధిక శాఖ అధికారులు అంటున్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలపై దృష్టి పెట్టిన ఆర్ధిక శాఖ అధికారులు కీలకమైన పథకాలకు ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తేల్చారు. ఆసరా పెన్షన్‌ పథకానికి ఇప్పటి వరకు ఏడాదికి 6,600 కోట్లు ఖర్చవుతోంది వచ్చే ఏడాది నుంచి 13,200 కోట్లు అవుతుంది 57 ఏళ్లు నిండిన వారికి ఏప్రిల్‌ నుంచి పెన్షన్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసరా పెన్షన్లకు ఏడాదికి 15 వేల కోట్లు కేటాయించాలని అంచనా వేస్తున్నారు. ఇక రైతుబంధు పథకానికి 15 వేల కోట్లు అవసరమని ఆర్ధిక శాఖ ప్రాథమిక లెక్కల్లో తేలింది. లక్ష లోపు రుణాల మాఫీకి 24 వేల కోట్లు అవసరమని గుర్తించారు. రుణమాఫీ కి అవసరమైన నిధులను గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా చెల్లించే విధంగా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నిరుద్యోగుల సంఖ్య ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో ఈ పథకానికి నిధులు కేటాయించలేమని ఆర్ధిక శాఖ చెబుతోంది. దీంతో నిరుద్యోగుల సంఖ్య తేలే వరకు నిరుద్యోగ భృతి పథకానికి నిధుల కేటాయింపు ఉండక పోవచ్చు. ప్రస్తుతం ఆర్ధిక మంత్రి లేకపోవడంతో బడ్జెట్‌ వ్యవహారాలన్ని చూస్తున్న సీఎం కేసీఆరే బడ్జెట్‌ ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించోబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here