కేసీఆర్‌.. రాజకీయాల నుంచి తప్పుకో!

0

దేవేందర్‌ గౌడ్‌ ఘాటు లేఖ!

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో అధికార పగ్గాలను యువతకు అప్పగించి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ సూచించారు. శనివారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు దేవేందర్‌గౌడ్‌ బహిరంగ లేఖ రాశారు. ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే నాలుగున్నరేళ్ల కాలాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వృథా చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయ జీవితాన్ని వదిలేసి వ్యక్తిగత జీవితం చూసుకోవాలని హితవు పలికారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం అనైతిక కార్యక్రమాలకు పాల్పడిందని దుయ్యబట్టారు. గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ కేసీఆర్‌ చేతిలో బందీగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలన రాచరికాన్ని గుర్తుచేస్తోందన్నారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. కనీసం మంత్రులకు సైతం కేసీఆర్‌ దర్శన భాగ్యం లభించడంలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ భాష, ప్రవర్తనతో తెలంగాణకు మాయని మచ్చ తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే తగినగుణపాఠం చెబుతారని దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. పెరుగుతున్న ఆదాయాన్ని తిరిగి తాత్కాలిక, దీర్ఘకాలిక పథకాల విూద ఖర్చు పెట్టి దాంతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ నాలుగున్నరేళ్లలో గణనీయమైన ప్రగతిని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలను సాధించి ఉండాల్సిందని, విూ అహంకారంతో బంగారం లాంటి అవకాశాలను కాలదన్నారని లేఖలో పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, సమర్థమైన యువత అందుబాటులో ఉన్నా పెట్టుబడులు సాధించలేకపోయారన్నారు. మనం ప్రజస్వామ్యంలో ఉన్నామా?, రాచరికంలో ఉన్నామా? అర్థం కావట్లేదన్నారు. ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కులాల పేరుతో విభజించు- పాలించు సూత్రాన్ని అమలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదని కేసీఆర్‌కు దేవేందర్‌గౌడ్‌ హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here