స్వగ్రామానికి కేసీఆర్‌

0

నేడు చింతమడకకు ముఖ్యమంతి

  • ఊరంతా పండుగ వాతావరణం
  • రోజంతా గ్రామప్రజలతో..
  • వేయి కళ్లతో ఎదురుచూపు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మరోసారి తన స్వగ్రామానికి వెళ్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన.. చింతమడకలో పర్యటించనున్నారు. సోమవారం అక్కడికి వెళ్లనున్న కేసీఆర్‌..రోజంతా గ్రామస్తులతో గడపనున్నారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. దీంతో సీఎం రాకకోసం చింతమడక గ్రామస్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఘనస్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చాలా రోజుల తరువాత ఆయన గ్రామస్తులతో ఆత్మీయ మిలాఖత్‌ కానుండటంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్తులతో గడపనున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో 3 వేల 200 మంది జనాభా, 580 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో మొత్తం 900 రేషన్‌ కార్డు లబ్ధిదారులున్నారు. సీఎం పర్యటనతో గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికతో కూడిన నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశించడంతో గత వారం రోజులుగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు అధికారులు. చింతమడకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా చింతమడకలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే హరీష్‌రావు.. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేశారు. శాఖల వారీగా చేపట్టాల్సిన విధులు, విధానాల గురించి జిల్లా అధికారిక యంత్రాంగంతో ఇప్పటికే హరీష్‌ రావు, జిల్లా కలెక్టర్‌ సుదీర్ఘంగా చర్చించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు, రెవెన్యూ భూమి ఉన్నవారు, అసైన్డు భూమి కలిగివున్న ఎస్సీ, బీసీల జాబితాతోపాటు.. జాబ్‌ కార్డులు ఎంతమంది కలిగివున్నారన్న వివరాలు సేకరించారు. గ్రామంలో తాగునీటి సరఫరా, ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు, విస్తరణ, వ్యవసాయం, ఉపాధి హామీ పథకం పని దినాల సమాచారాన్ని కూడా సేకరించారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్‌ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here