కాషాయమయమైన కాశీ

0
  • వారణాసిలో నామినేషన్‌ వేసిన ప్రధాని మోడీ
  • ప్రధాని వెంట అతిరథ మహారథులు
  • ఓటు హక్కును వినియోగించుకోవాలి
  • కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ప్రభంజనం
  • కార్యకర్తల సమావేశంలో మోడీ ఉద్వేగ ప్రసంగం

”కాశీ.. కాషాయమయం అయ్యింది. వారణాసి వీధులు లక్షలాదిగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. బెనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి దశాశ్వమేథ్‌ ఘాట్‌ వరకు నిర్వహించిన ప్రధాని రోడ్‌ షో ప్రత్యర్థులకు సమాధానంగా సాగింది. దారి పొడవునా నిలబడ్డ ప్రజలు జయ జయ ధ్వానాలతో ఘన స్వాగతం పలికారు. ఐదేళ్లలో ఎలాంటి అవినీతి లేని పాలనను అందించామని ప్రధాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రో ఇన్‌ కంబెన్సీ వేవ్‌ ఉందన్నారు.మొదటిసారి ఓటు వేస్తున్న వారి నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు అవసరం లేదని మోడీ తెలిపారు.ప్రజల ప్రేమే తన బలమన్నారు. బీజేపీ కార్యకర్తలు ఓడిపోతే తనకు బాధగా ఉంటుందన్నారు. ప్రజల హృదయాలను గెలిస్తే.. విజయం అదే వస్తుందన్నారు. మోడీజీ ఇప్పటికే గెలిచేశారని.. ఇక ఓటు వేయకపోయినా ఫరవాలేదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి ఉచ్చులో పడొద్దు. ఓటు విూ హక్కు. ప్రతిఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలి. పోలింగ్‌ రోజు భారీ ఎత్తున తరలి రావాలి” అని ప్రజల్ని కోరారు.

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్‌ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. వారణాసిలోని కాలభైరవుడికి పూజలు చేసిన అనంతరం ఆయన కలెక్టరు కార్యాలయానికి చేరుకొని నామపత్రాలు సమర్పించారు. లక్షలాదిగా తరలివచ్చిన జనం మధ్య నిర్వహించిన రోడ్‌ షో అద్భుతంగా సాగింది. తొలుత బెనారస్‌ హిందూ యూనివర్శిటీ ఎదుట ఉన్న మదన్‌ మోహన్‌ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఓపెన్‌ టాప్‌ జీప్‌లో రోడ్‌ షో చేపట్టారు. 6 కిలోవిూటర్ల మేర సాగిన రోడ్‌ షోలో సుమారు ఆరున్నర లక్షల మంది జనం పాల్గొన్నారు. వారణాసి నుంచే కాకుండా చుట్టుపక్కల నగరాల నుంచి ద్వితీయశ్రేణి నాయకులు భారీగా కదలివచ్చారు. దారి పొడవునా కాషాయ జెండాలతో నింపేశారు. మోడీ రాకకోసం ఇరువైపులా వేచి ఉన్న జనం పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. హర్‌ హర్‌ మోడీ అంటూ నినాదాలతో ¬రెత్తించారు. 3 గంటల పాటు సాగిన రోడ్‌ షో దశాశ్వమేథ్‌ ఘాట్‌ దగ్గర ముగిసింది. అదే ఘాట్‌లో గంగామాతకు మోడీ హారతి ఇచ్చారు. తానే సొంతంగా మంత్రాలు చుదువుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథుడి సేవలో పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. వారణాసి కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న మోడీ.. తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే, శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, రాజ్యసభ సభ్యుడు అమర్‌ సింగ్‌, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నామినేషన్‌ దాఖలు చేసే కంటే ముందు.. మోడీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మోడీ స్పష్టం చేశారు. మళ్లీ మోడీ సర్కార్‌ను గెలిపించాలన్న గట్టి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని మోడీ తెలిపారు. వారణాసి లోక్‌ సభ నియోజకవర్గంలో మోడీపై కాంగ్రెస్‌ పార్టీ తరపున అజయ్‌ రాయ్‌ పోటీ చేస్తున్నారు. ఎస్పీ – బీఎస్పీ కూటమి నుంచి షాలినీ యాదవ్‌ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మే 19న ఎన్నికలు జరగనున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసి నుంచి గెలుపొందిన మోడీకి 5,81,022 ఓట్లు రాగా, ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌ కు 2,09,238 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అజయ్‌ రాయ్‌ కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో వారణాసితో పాటు వడోదర(గుజరాత్‌) నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే వడోదర నుంచి తప్పుకున్న మోడీ.. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..’రోడ్‌షోకు ఎంతటి ఆదరణ లభించిందో అందరూ చూశారు. ప్రజల్లో నావిూద ఎంతటి అభిమానం ఉందో మరోసారి రుజువైంది. ఎప్పటికయినా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. వారణాసిలో పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారు. మన కష్టానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. కాశీలోని ప్రతి ఒక్క పౌరుడు నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భాజపా అంటే ఒక నమ్మకం ఏర్పడింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ గొప్పలు పోతోంది. కానీ నేను చెబుతున్నా.. ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ప్రజలే. మోడీ గెలిచినా గెలవకపోయినా ప్రజాస్వామ్యం తప్పక గెలుస్తుంది. ఈ సారి ఓటింగ్‌తో రికార్డు సృష్టించాలి. మహిళా ఓటింగ్‌ శాతం కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా విూరంతావారికి అవగాహన కల్పించాలి. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో మన కార్యకర్తలు భయభ్రాంతులకు గురువుతున్నారు. వారిని అక్కడి ప్రభుత్వాలు సురక్షితంగా ఉండనివ్వడం లేదు. భాజపా కార్యకర్తలు ఎవరయినా బయటకు వెళ్తుంటే ఇంట్లో అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లాల్సి వస్తోంది. వారు మళ్లీ ఇంటికి చేరుకునే వరకు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు’ అని ఆరోపించారు. మోడీ ప్రసంగంతో కార్యకర్తల్లో జోష్‌ నిండింది.

ప్రజల ఆదరాభిమానాలే ఇంతదూరం రప్పించాయి

తాను ఇప్పటికే గెలిచిన్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచార ఉచ్చులో పడొద్దని ప్రధాని మోడీ ప్రజలను కోరారు. భారీ సంఖ్యలో తరలివెళ్లి ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వారణాసిలో శుక్రవారం నామినేషన్‌ వేసిన ఆయన అనంతరం విూడియాతో మాట్లాడారు. మోడీజీ ఇప్పటికే గెలిచేశారని.. ఇక ఓటు వేయకపోయినా ఫరవాలేదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి ఉచ్చులో పడొద్దు. ఓటు విూ హక్కు. ప్రతిఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలి. పోలింగ్‌ రోజు భారీ ఎత్తున తరలి రావాలని ప్రజల్ని మోడీ కోరారు. అలాగే గురువారం జరిగిన భారీ రోడ్‌షోలో ప్రజలు చూపిన ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతటి భారీ ర్యాలీ కేవలం వారణాసిలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. వారి ఆశీర్వాదంతోనే అధికారంలోకి రాగలిగానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాను కూడా ప్రశంసించారు. మండుటెండలో కష్టపడుతున్న వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న మోడీ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట ఎన్డీయేపక్ష నేతలు, భాజపా సీనియర్‌ నాయకులు ఉన్నారు. ఈసారి ఆయనను ప్రతిపాదించిన వారిలో ఓ భాజపా సీనియర్‌ నాయకుడితో పాటు ఓ చౌకీదార్‌, ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, వారణాసి మణికర్ణిక ఘాట్‌లో దహనసంస్కారాలు నిర్వహించే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఉండడం గమనార్హం. అంతకు ముందు ఆయన కాలభైరవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందరర్భంగా ఎన్డీయేలో సీనియర్‌ నాయకుడు ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌.. మోడీని ప్రశంసల్లో ముంచెత్తారు. తదుపరి ప్రధాని మోడీయే అని.. ఆయనతో ఎవరూ పోటీ పడలేరని అభిప్రాయపడ్డారు.

వారణాసి ప్రజలు అదృష్టవంతులు: సుష్మా

ప్రధాని మోడీ నామినేషన్‌ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు అన్నారు. దేశంలోని మిగతా లోక్‌సభ నియోజకవర్గాల ప్రజలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటే.. వారణాసికి ప్రధానిని ఎన్నుకునే అదృష్టం లభించిందన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏకు నాలుగింట మూడొంతుల మెజారిటీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు సుష్మాస్వరాజ్‌.

ప్రధాని మోడీ ఆస్తులివే..

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు 2014 నుంచి 2019 వరకూ 52 శాతం పెరిగాయి. వారణాసిలో మోడీ శుక్రవారం నామినేషన్‌ వేసిన సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తులను వెల్లడించారు. చరాస్తుల్లో అధిక భాగం ఎస్‌బీఐలోని రూ 1.27 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ మొత్తం రూ 2.51 కోట్లుగా ప్రధాని వెల్లడించారు. వీటిలో చరాస్తులు రూ 1.41 కోట్లు కాగా, స్ధిరాస్తులను రూ 1.10 కోట్లుగా చూపారు. మోడీ చరాస్తులు 2014తో పోలిస్తే 114 శాతం పెరిగాయి. 2014లో ఆయన తన చరాస్తుల విలువ రూ 65.91 లక్షలుగా చూపారు. ప్రధాని ప్రధాన ఆదాయ వనరు వేతనం కాగా, పొదుపు ఖాతాపై వడ్డీల నుంచి ఆదాయం సమకూరుతోంది. ఇక తనపై ఎలాంటి క్రిమినల్‌ ఆరోపణలు లేవని, అప్పులు కూడా లేవని అఫిడవిల్‌లో పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ 38,750 చేతిలో నగదు కాగా, బ్యాంకులో కేవలం రూ 4,143 బ్యాలెన్స్‌ ఉన్నట్టు చూపారు. ఎస్‌బీఐలో రూ 1.27 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇక 2014లో చేతిలో నగదు రూ 32,700, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ 26.05 లక్షలు, రూ 32.48 లక్షల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో మోడీ చూపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here