కర్నాటక స్పీకర్‌ కొత్త ట్విస్ట్‌

0

రాజీనామా ఎమ్మెల్యేలు ఎవరూ కలవలేదు

గవర్నర్‌కు లేఖ రాసిన రమేశ్‌ కుమార్‌

అపాయింట్‌మెంట్‌ కోరితే రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా

బెంగళూరు

కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. కర్ణాటక గవర్నర్‌కు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కేఆర్‌ రమేష్‌ కుమార్‌ లేఖ రాశారు. ఆ లేఖలో రాజీనామా చేసినట్లు చెబుతున్న ఎమ్మెల్యేలు ఎవరూ తనను కలవలేదని పేర్కొన్నారు. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని అంత అనుకుంటుండగా స్పీకర్‌ మరో ట్విస్ట్‌కు తెరలేపారు. తాను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్‌కు నివేదించారు. ఎమ్మెల్యేల రాజీనామాపై గవర్నర్‌ విజూభాయ్‌కు లేఖ రాశాను. నేను రాజ్యాంగ నియమాళకు అనుగుణంగా నడుచుకుంటాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ ఇంత వరకు నన్ను కలవలేదు. మొత్తం 13 మందిలో 8 మంది రాజీనామాలు చట్ట ప్రకారం సమ్మతం కావు. నాముందు హాజరు కావడానికి వారికి కావాల్సినంత సమయం ఇచ్చానని స్పీకర్‌ కేఆర్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. ఇదిలావుంటే అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబోనని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. వారంతా వ్యక్తిగతంగా తనను కలిసి రాజీనామాలపై వివరణ ఇస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగేతనను కలవాలని ఎవరుకూడా అపాయింట్‌మెంట్‌ కోరలేదన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ మంగళవారం స్పందించారు. ఇంతవరకూ ఏ ఎమ్మెల్యే తన అపాయింట్‌మెంట్‌ కోరలేదని చెప్పారు. అయితే తనకు ఎవరిపైనా వివక్ష లేదని చట్టానికి అనుగుణంగానే నడుచుకుంటానన్నారు. ‘నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ప్రజల వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నాను. అందువల్ల నాకు ఏదీ కష్టంగా అన్పించట్లేదు. తాజా రాజకీయ పరిస్థితులతో నాకు సంబంధం లేదు. చట్టం, రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తాను. అసమ్మతి ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు. వారు నాకు బంధువులు కాదు. స్పీకర్‌ ఛాంబర్‌లోకి రాగానే నేను కాంగ్రెస్‌ వ్యక్తినన్న విషయం మర్చిపోతాను. న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను. నా ప్రజలు, నా తండ్రి తప్ప ఇంకెవరూ నా మీద ఒత్తిడి తీసుకురాలేరంటూ వివరణిచ్చారు. స్పీకర్‌గా నేను కొన్ని నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను స్పీకర్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను. ఎమ్మెల్యేలు కలిసి రాజీనామాలపై వివరణ ఇస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటానని రమేశ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు.

తాజా పరిణామాలపై కాంగ్రెస్‌ శాసనసభా పక్షం మంగళవారం భేటీ అయ్యింది. కాగా.. ఈ భేటీకి అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి హాజరయ్యారు. తొలుత ఈమె కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే గత రాత్రి సోనియాగాంధీతో భేటీ అయిన సౌమ్య.. నేడు సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా.. శాసనసభా పక్ష సమావేశానికి కాంగ్రెస్‌ నేత ఎంటీబీ నటరాజన్‌ గైర్హాజయ్యారు. దీంతో ఆయన కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అనారోగ్యం వల్లే తాను భేటీకి రాలేదని నటరాజన్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here