FeaturedUncategorizedఇతర వార్తలు

కపోతాల కాలం ముగిసినట్టేనా..?

  • మేత వేయొద్దంటున్న జీహెచ్‌ఎంసీ..!!
  • పావురాల ప్రమాదం పొంచివుంది..
  • అడవిదారి పట్టనున్న కపోతాలు..

హైదరాబాద్‌కి కొత్తగా వచ్చినవారికి అక్కడి పావురాలు బాగా నచ్చేస్తాయి. కానీ… అక్కడే ఉంటున్న హైదరాబాదీలకు మాత్రం పావురాలతో ఎదురయ్యే సమస్యలు గుర్తుకొస్తాయి. ప్రతీ వీధిలో, అపార్ట్‌మెంట్లపై, ఇళ్ల కన్నాల్లో ఇలా ఎక్కడ చూసినా పావురాలే. వాటి సంఖ్య ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. అవి చూడటానికి బానే ఉంటాయి గానీ… వాటి వల్ల వచ్చే వ్యాధులు, వ్యాపించే వైరస్‌లను అడ్డుకోవడం మన వల్ల కావట్లేదు. పైగా వాటి వల్ల చారిత్రక కట్టడాలు పాడైపోతున్నాయి. ఆ కట్టడాల్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు… అసహ్యంగా ఉంటున్నాయని ఫీలవుతున్నారు. అందుకే… ఎలాగైనా ఈ సమస్యలకు చెక్‌ పెట్టాలనుకున్న జీహెచ్‌ఎంసీ అదనపు పావురాల్ని శ్రీశైలం అడవుల్లోకి తరలించాలని డిసైడైంది. ముందుగా 500 పావురాల్ని మొజాంజాహీ మార్కెట్‌ ప్రాంతంలో పట్టుకొని… శ్రీశైలం అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేసింది. పావురాల్ని అంత దూరంలో వదిలేశాం కదా అని ప్రశాంతంగా ఉండే ఛాన్స్‌ లేదు. ఎందుకంటే పావురాలకు… ఈ భూమిపై ఎక్కడ వదిలినా… తిరిగి వాటి గమ్యస్థానానికి వచ్చేయగలిగే గ్రాహక శక్తి ఉంటుంది. అందువల్ల అవి తిరిగి మొజాంజాహీ మార్కెట్‌కి వచ్చేసే అవకాశాలున్నాయి. నిజానికి పావురాలకు మనుషుల మధ్య ఉండటం చాలా ఇష్టం. ఎందుకంటే… ఇవి ఆహారం కోసం వేటాడేందుకు ఏమాత్రం ఇష్టపడవు. ఎక్కడైనా ఫ్రీగా ఆహారం దొరికితే చాలని ఎదురుచూసే రకం. పైగా వీటి శరీర బరువు ఎక్కువ కాబట్టి… ఎక్కువ సేపు ఎగరలేవు. అందుకే… ప్రజల మధ్యే ఉంటూ… వాళ్లు వేసే గింజలు తింటూ… హాయిగా ఉంటున్నాయి. కానీ… ఇబ్బంది పడుతున్నది ప్రజలే.

పావురాల వల్ల ప్రమాదం..

ఠప ఠప మంటూ రెక్కలు కొట్టుకుంటూ మీ ఇంటి కిటికీ మీద వాలే సందడి చేసే కపోతాలు ఇక కాలగర్బంలో కలిసిపోనున్నాయి. ఊర పిచ్చుకల మాదిరి పావురాళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి పోనుంది. హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసిన వందల సంఖ్యలో పావురాళ్లు దర్శనం ఇస్తుంటాయి. చాలా మంది పక్షి ప్రేమికులు వాటికి మేత వేస్తుంటారు. సినిమా వాళ్లు, సీరియల్‌ వాళ్లు కూడా పావురాల గుంపును తమ చిత్రాల సన్నివేశాల్లో వాడుకుంటుంటారు.

పావురాలకు ఆహారం వేయొద్దు..

అంతే కాకుండా పక్షి ప్రేమికులు కొంత మంది హాబీగా కూడా పావురాళ్లను పెంచుకుంటుంటారు. ఇప్పుడిదంతా ఓ జ్ఞాపకంగా మిగిలిపోబోతోంది. కరెంటు తీగలమీద కనువిందుగా వాలిపోయే కపోతాలు కనుమరుగు కాబోతున్నాయి. పావురాల విసర్జన వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని ఓ సర్వేలో తేలడంతో నగర పాలక సంస్ధ అప్రమత్తమైంది. పావురాళ్లకు ఎవ్వరు కూడా మేత వేయొద్దనే ఆదేశాలు జారీ చేసారు. దశల వారీగా నగరంలో వాటి సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు చేపట్టింది నగరపాలక సంస్థ.

కనుమరుగు కానునున్న కపోతాలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లో పెరుగుతున్న పావురాల సంఖ్య ప్రజల ఆరోగ్యానికి సమస్యగా మారిందని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాటి వల్ల మనుషుల్లో శ్వాసకోస వ్యాధులు తలెత్తే అవకాశముందని, వాటికి ఆహారం వేయొద్దని సూచిస్తున్నారు. పావురాల రెట్టలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఫలితంగా మనుషుల అనారోగ్యానికి గురవుతున్నారని విశ్లేషిస్తున్నారు. పలు బహుళ అంతస్తుల భవనాల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లు, దుకాణాలు ముఖ్యంగా ఆహార పదార్థాలు అమ్మే వారు వీటికి మేత వేయవద్దని చెపుతున్నారు.

అడవి దారి పట్టనున్న పావురాలు..

ఈ మేరకు నగర పాలక సంస్థ ఓ ప్రకటన చేసింది. నగరంలో ఉన్న హార్టీ కల్చర్‌ పార్కుల్లో పావురాలకు ఆహారాన్ని వేయటాన్ని జీహెచ్‌ఎంసీ ఇప్పటికే నిషేధించింది. మరోవైపు మొజాంజాహి మార్కెట్లో పావురాలకు దాణాగా వేసే జొన్నలు, ఇతర తృణ ధాన్యాలను జీహెచ్‌ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పావురాల రెట్టలతో చారిత్రక కట్టడాలు పాడవుతుండడంతో, ఇటీవల మొజాంజాహి మార్కెట్లో 500 పావురాలను పట్టి శ్రీశైలం అడవుల్లో వాటిని విడిచిపెట్టారు. అంచెలంచెలుగా నగరంలో పావురాల సంఖ్యను తగ్గించేందకు కార్యాచరణ రూపొందిస్తున్నారు నగరపాలక సంస్థ అదికారులు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close