Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

తెలంగాణపై కమలం కన్ను…

ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభం…

క్యూకట్టిన బడా నేతలు…

ఈ నెలలో పలువురు చేరిక…

అధికారమే పరమావధిగా అడుగులు…

వేయాలి.. పాగా వేయాలి.. అధికారాన్ని చేపట్టాలి.. ఇప్పుడు అధికారంలో ఉన్నపార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పోతుంది.. ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్‌ బలహీనపడింది.. టిడిపి నామరూపాల్లేకుండా పోయింది.. మరో ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.. అందుకే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ బలంగా, గ్రామగ్రామాన పటిష్టంగా నాటుకుపోయేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో భారీగా నాయకులను చేర్చుకునేందుకు సిద్దమైపోయారు.. 2023లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకొవడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పటినుంచి పావులు కదుపుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బిజెపియే.. ప్రజలకు ఇచ్చిన హమీలోకటి.. ప్రభుత్వం చేస్తున్న పనులోకటి అందుకే ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించింది.. బలమైన పునాదులతో పార్టీని పటిష్టంగా నిర్మించాలనే ఆలోచనతో కమల దళం ముందడుగు వేస్తోంది. అవకాశాలు లేని వారు, అవకాశాలు రాని వారు కమలం నీడన చేరేందుకు సిద్దమయ్యారు.. కమలం గూటికి ఎవరెవరూ చేరుతారో, ఎవరెవరూ ఆసక్తి చూపుతున్నారో వారందరికి స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు బిజెపి నేతలు.. గులాబీ జెండాను దింపేందుకు కాషాయం జెండా ఎగరేసేందుకు కేంద్ర నాయకత్వం సైతం దృష్టిసారించినట్లు తెలుస్తోంది.. నాలుగు లోక్‌సభ స్థానాలతో తెలంగాణలో తమ సత్తా చాటిన బిజెపి అధికారమే పరమావధిగా ముందడుగు వేస్తోంది.. మరీ కమలనాథుల వ్యూహాలను టిఆర్‌ఎస్‌ ఎదుర్కోంటుందా.. లేదా చతికితపడుతుందా అనేది చూడాల్సిందే..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌.. ఆదాబ్‌ ప్రత్యేక ప్రతినిధి

తెలంగాణలో కనివిని ఎరుగని పార్టీల జంపింగ్స్‌ జరగబోతున్నాయా అంటే నిజమేనని తెలిసిపోతుంది. కాంగ్రెస్‌, టీడీపీల నుంచి సీనియర్‌ నాయకులంతా పెట్టేబేడా సర్దుకుని కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. ఈనెల 27 లేదంటే 28న బీజేపీ కీలక నేతల సమక్షంలో పలువరు ఆగ్రనాయకులు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారని, ఆకర్ష్‌ ఆపరేషన్‌ ప్రారంభించిన కమలానికి ఆకర్షితులయ్యే నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉందని తెలుస్తోంది.. గత కొన్నిరోజుల ముందు వరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై టీఆర్‌ఎస్‌ ఆకర్షణ ఆపరేషన్‌ ముగిసింది. టిఆర్‌ఎస్‌ వలసలు ముగిసాయో లేదో కమలం ఆపరేషన్‌ మొదలుపెట్టింది.. కాంగ్రెస్‌, టీడీపీల నుంచి అంతో, కొంతో జనాదరణ ఉన్న లీడర్లను లాగేందుకు రంగం సిద్దం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా యుద్ధరంగాన్ని మార్చేందుకు సకల ఎత్తులూ వేస్తోంది.

తెలంగాణలో టిడిపి క్యాడరంతా జంపేనా..

రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తన ఉనికే ప్రమాదంలో పడింది. అయినా 2014 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లను కొల్లగొట్టి, బలమైన క్యాడర్‌ తనకు ఉందని నిరూపించుకుంది తెలుగుదేశం. కానీ టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో చెల్లా చెదురైంది. 2018లో కేవలం రెండే రెండు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనైతే అస్సలు పోటీ చేయలేదు. ఇప్పుడు ఏపీలో కూడా పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో తెలంగాణ టీడీపీకి ఉన్న ఒకే ఒక్క ఆశా పోయింది. అందుకే తెలంగాణలో బలం పుంజుకుంటున్న బీజేపీలోకి వెళ్లాలని తెలుగు తమ్ముళ్లు డిసైడయ్యారని, రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకులైనా పెద్దిరెడ్డి, బోడ జనార్దన్‌, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ సైతం కాషాయ కండువా కప్పుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో రాంమాధవ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ వేదికగా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయినట్టే. తన దుకాణం కూడా మూసుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.. తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ ఎంపీ అయిన మాజీ కేంద్ర మంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి కూడా బీజేపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీకి వీడనంటూనే, బీజేపీకిలోకి వెళ్తే చంద్రబాబుకు చెప్పే వెళతానని అన్నారు సుజనా. ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంలో సుజనా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఓటమిపై సుజనా చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి. ప్రత్యేక ¬దాపై వెనకడుగు వేయడం కూడా ఓటమికి దారి తీసిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏపీలో ఉనికిలోలేని పార్టీకి దగ్గరవ్వటం, అదే సమయంలో ఉనికిలోలేని మరో పార్టీతో యుద్ధం చేయటంతోనే టీడీపీ ఓటమి పాలయ్యిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కొందరు తప్పుదారి పట్టించారని అంటున్నారు సుజనా చౌదరీ. మొత్తానికి మొన్నటి వరకూ బీజేపీని సుతిమెత్తగా తిట్టిపోసిన సుజనా, తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి మొన్న ఢిల్లీ వెళ్లి సుజనా చౌదరితో సమావేశమయ్యారట. తెలంగాణ టీడీపీలో మిగిలిన నేతలను బీజేపీలోకి వెళ్లేందుకు ఒప్పించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారట సుజనా. మొత్తానికి అటు టీఆర్‌ఎస్‌లోకి పోకుండా మిగిలిపోయిన తెలంగాణ టీడీపీ నేతలు, బీజేపీలోకి వెళ్లాలరని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 27 లేదా 28 తేదీల్లో పార్టీ మారడానికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌పై కండువా కప్పనున్న కమలం..

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ కాదు బీజేపీయేనని మొన్న సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. అతిత్వరలో ఈయన కాషాయం తీర్థం పుచ్చుకోవడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఈయనతో పాటు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లాలనే డిసైడయ్యారట. కానీ టైం కోసం చూస్తున్నారట. తమ్ముడు మొదట వెళ్లిపోయినా, తర్వాత పరిస్థితులను బట్టి తానూ వెళ్లేందుకు సిద్దమవుతున్నారట. తెలంగాణ పీసీసీ చీఫ్‌ తనకిస్తే సరి, ఒకవేళ రేవంత్‌రెడ్డికి ఇస్తే మాత్రం అదే రోజు బీజేపీలోకి వెళతారని, గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి ఇంకా చాలామంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, మాజీ ఎంపీలు సైతం బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక మాజీ ఎంపీ వివేక్‌, మోత్కుపల్లి నర్సింహులు, శోభారాణి కూడా బీజేపీలో జాయిన్‌ కావడం పక్కా అన్న సమాచారం అందుతోంది. మరి అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్‌ నేతలను ఆపేందుకు పార్టీ అధిష్టానాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి అడుగులు..

తెలంగాణలో నాలుగు పార్లమెంట్‌ స్థానాలను కొల్లగొట్టిన బీజేపీకి, ఎనలేని ఆత్మవిశ్వాసం వచ్చింది. అటు కాంగ్రెస్‌లో కీలక నేతలనూ లాగుతోంది. గెలిచిన, ఓడిన కాంగ్రెస్‌ ఎంపీలనూ ఆకర్షిస్తోంది. ఊరూరా బలమైన క్యాడర్‌ ఉన్న తెలుగుదేశాన్ని, టీఆర్‌ఎస్‌తో పాటు తానూ పంచుకుంటోంది బీజేపీ. వచ్చే సార్వత్రిక ఎన్నికలను తెలంగాణలో, టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మార్చాలని తపిస్తోంది. దానికి తగ్గట్టే అస్త్రశస్త్రాలనూ ప్రయోగిస్తోంది. దీనిలో భాగంగానే అతిత్వరలో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నేతలు మూకుమ్మడిగా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. బీజేపీ కీలక నేత రాంమాధవ్‌, హైదరాబాద్‌లో మకాం వేసి అటు ఏపీలోని టీడీపీ నేతలు, ఇటు తెలంగాణలోని టీడీపీ నేతలనూ టచ్‌లోకి తెచ్చుకుంటున్నారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలతో జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. జిల్లాలో పార్టీ క్యాడర్‌కు భరోసా నిచ్చే నేతలు లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు క్రమక్రమంగా పార్టీకి దూరమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చేసరికి గణనీయంగా పెరిగింది. దీంతో జిల్లాలో బిజెపి పట్టుకు ప్రస్తుత ఎంపి ధర్మపురి అర్వింద్‌ ఆలోచన చేస్తున్నారు. పార్టీ కూడా ప్రధానంగా ఇక్కడే దృష్టి కేంద్రీకరించబోతున్నది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ కాంగ్రెస్‌ నేత కోమిటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో వాస్తవంగానే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ వైపు వెళ్లలేని కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాముఖ్యనేతలు పార్టీ మారడం జిల్లాలో పార్టీ శ్రేణులకు భరోసా నిచ్చే నేతలు లేకపోవడంతో క్రమేపి కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అయిదు నియోజకవర్గాల్లో మొత్తం బీజేపీ అభ్యర్థులు 70 వేల 475 ఓట్లు సాధించగా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్‌ అయిదు నియోజక వర్గాల్లో 3 లక్షల 33 వేల 958 ఓ ట్లు సాధించడం గమనార్హం. జిల్లాలో కొన్ని గ్రామపంచాయతీ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులను గెలుచుకున్న బీజేపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలలోనూ మెరుగైన ఫలితాలు సాధించింది. మొత్తం 299 ఎంపీటీసీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 188, కాంగ్రెస్‌ 45, బీజేపీ 34 స్థానాలను గెలువగా నందిపేట్‌, రెంజల్‌ జడ్పీటీసీ స్థానాలతో పాటు నందిపేట, రెంజల్‌ ఎంపీపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అ సెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న టీడీపీ ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికలలోనూ కనుమరుగయింది. దీంతో జిల్లాలో బలపడడం ద్వారా అధికార టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయాం కావాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఎక్కడ పోటీచేసిన దాఖలాలు లేవు. పార్లమెంట్‌ ఎన్నికలలో గెలిచిన బీజేపీ, జిల్లాపరిషత్‌, ఎంపీటీసీ ఎన్నికలలో గణనీయంగా త మ ఓట్ల శాతాన్ని పెంచుకోవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అయిన బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close