Featuredస్టేట్ న్యూస్

కాళేశ్వరం కష్టజీవి.. హరీష్‌ స్థానమెక్కడ…

ప్రాజెక్ట్‌ ప్రారంభానికి సన్నాహాలు…
కెసిఆర్‌ వెంట కనబడని హరీష్‌రావు…
అందరిని ఆహ్వనిస్తున్న సిఎం…


రాళ్లు మోసే కూలిలోకరు… ప్రాజెక్టు నిర్మించే మేస్త్రీలు ఇంకొరు… దగ్గరుండీ సలహాలు, సూచనలు ఇచ్చే నాయకుడొకరు… అంతా కష్టపడి పనంతా పూర్తిచేసి కలల ప్రాజెక్టు కర్తవ్యాన్ని బాధ్యతగా, తన ఇంటి సొంతపనిగా భావించినా నాయకుడు నేడు ప్రాజెక్టు ప్రారంభానికి కానరావడం లేదు.. ఆ ప్రాజెక్టు దరిదాపుల కూడా కనిపించడం లేదు.. ఆహ్వానాలలో ఆగుపడడం లేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు కష్టజీవిగా, ఇరవైనాలుగు గంటలు అక్కడ ఉండి పనులను పర్యవేక్షిస్తూ చేదోడు వాదోడుగా నిలిచినా హరీష్‌రావు ఎక్కడనేది అందరూ అడుగుతున్న ప్రశ్న.. గత భ్రుత్వంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించినా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాని బరువు బాధ్యతలు మొత్తం హరీష్‌రావుకే అప్పగించింది.. తాను ఆ శాఖ మంత్రిగానే కాకుండా స్వరాష్ట్రం తెలంగాణలో నిర్మిస్తున్న కోట్లాది మంది రైతులకు లబ్ది చేకూర్చే ప్రాజెక్టు కావడం వలన ఎక్కడ నాణ్యతా లోపం రాకుండా, ఆలస్యం కాకుండా అన్నీ తానై ముందుండి నడిపించినా తన్నీరు జాడ మాత్రం ఇప్పటివరకు కనిపించడమే లేదు. వారం రోజుల్లో ప్రారంభం కానున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రాష్ట్రాల పర్యటనకు మిగతా వారందరిని వెంటబెట్టుకొని పోతున్నా కెసిఆర్‌ హరీశ్‌రావును మాత్రం ఎందుకు తీసుకెళ్లడం లేదనేది ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న ప్రధాన చర్చ.. మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన హరీశ్‌రావుకు మళ్లీ మంత్రి స్థానాన్నే కట్టబెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాలని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు.. హరీశ్‌ లేని ప్రాజెక్టును, తెలంగాణ పార్టీని ఊహించడం సాధ్యకాదంటున్నారు ఆయన సన్నిహితులు.. ఇప్పుడు కెసిఆర్‌ హరీశ్‌రావుకు మంత్రి పదవి కట్టబెట్టి ప్రాజెక్టు ప్రారంభిస్తారా.. అసలు ప్రారంభోత్సవానికే హరీశ్‌రావుకు మొండిచెయ్యి చూపుతారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైనా అంశంగా మారిపోయింది…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

కాళేశ్వరం తెలంగాణ కలల ప్రాజెక్ట్‌.. ఆరునూరైనా ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రాజెక్టును పూర్తి చేయడమే తెలంగాణ ప్రభుత్వం కర్తవ్యంగా భావించి ఎట్టకేలకు ప్రారంభానికి సిద్దంచేశారు.. లక్షలాది మంది తెలంగాణ రైతులకు ఇబ్బంది లేకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సిద్దమయింది. గత ప్రభుత్వంలో దానికి అంకురార్పణ చేసిన ప్రభుత్వం అప్పటి భారీనీటిపారుదల శాఖామంత్రి హరీశ్‌రావుకు పర్యవేక్షణలో పనులన్నీ చకచకా పూర్తయ్యి అనుకున్న సమయానికి ప్రాజెక్టు కూడా పూర్తైయిందని తెలుస్తోంది. అన్ని బాగానే ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు అంత పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మాణానికి దగ్గరుండీ నడిపించినా హరీశ్‌రావుకు ఇప్పటికి మంత్రి పదవి లేదు. ప్రత్యేకమైన గుర్తింపు లేదని తెలుస్తోంది. ఒక భారీ ప్రాజెక్టును నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అందునా సమయాన్ని చేతిలో పట్టుకొని పనులు పరుగులు పెట్టించడం అంటే మాములైన విషయమే కాదు. పని ఏదైనా సరే తనకు అప్పగించగానే మారు మాట్లాడకుండా విజయవంతంగా పూర్తిచేయడమే ఆయన కర్తవ్యంగా ముందుకు సాగుతున్న హరీశ్‌రావుకు ఇప్పుడు స్థానం ఏంటనేదే అర్ధంకాని విషయంగా మారిపోయింది. ట్రబుల్‌ షూటర్‌ మాదిరిగా దూసుకెళ్లే తన్నీరు నైపుణ్యం, పనితనం, నాయకత్వం గురించి అందరికి తెలిసిన విషయమే. అలాంటి ఆయనున్న మడతపెట్టి పక్కన పెట్టేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీరుపై హరీశ్‌రావు అభిమానులు తెలంగాణ రాష్ట్రమంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన కలల ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ మరికొద్ది రోజుల్లోనే అత్యంత వైభవంగా ప్రారంభించబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తానే చేసినట్లు, తానే పర్యవేక్షించినట్లు ముఖ్యమంత్రి వ్యవహరించడంపై పలువురు రాజకీయవాదులు తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. కష్టం ఒకరిదైతే, దాని అనుభవించే ఫలితం మరొకరు అంతా తామే నడిపినట్లు తమ ఖాతాలో వేసుకుంటారా అంటూ గులాబీ బాస్‌ తీరును తీవ్రంగా ఎండపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా అందంగా, అనుకున్న సమయానికి పూర్తి కావడానికి ప్రధాన కారణం తన్నీరేనని చెపుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇరవైనాలుగు గంటలు పనిచేసేలా పక్కా ప్రణాళిక ద్వారా ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఇతర సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించిన హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్నట్లుగానే పూర్తి చేశారు. ఆయన రెక్కల కష్టంగా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పాలి కాని పని పూర్తవుతున్న చివర్లో ఆకస్మాత్తుగా ఆయన పోర్ట్‌ ఫోలియోను లాగేసుకున్న కెసిఆర్‌, కాళేశ్వరం ప్రాజెక్టును తానే చూసుకుంటున్నట్లుగా చెప్పుకోవడాన్ని తన్నీరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

హరీష్‌ రెక్కల కష్టమే కాళేశ్వరం..

తెలంగాణ ప్రభుత్వంలో హరీష్‌కు తప్ప వేరే ఏ ఇతర మంత్రికి కాని, నాయకుడికి కాని ఆ ప్రాజెక్టు బధ్యతలు అప్పగిస్తే పనులన్నీ మధ్యలోనే ఆగిపోవడమే కాకుండా అంతా నాణ్యతగా ఉండేది కాదని చెపతున్నారు. మామ అప్పగించిన పనిని ఎంతో నమ్మకంతో పూర్తి చేసిన హరీశ్‌కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఇప్పటికే ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఇది సరిపోదన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు రెక్కల కష్టాన్ని హరీశ్‌కు చెందకుండా చేస్తూ మొత్తం క్రెడిట్‌ అంతా కెసిఆర్‌ సారూ తీసుకోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో హరీశ్‌ పక్షాన గళం విప్పుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు క్రెడిట్‌లో సింహభాగంగా హరీశ్‌కే చెందుతుందని అందుకు భిన్నంగా ప్రాజెక్టు మొత్తాన్ని తానే నడిపించినట్లుగా కెసిఆర్‌ చెప్పుకోవటం తప్పు అనే మాట పలువురు నోట వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాన్ని మొత్తంగా తన సొంతం చేసుకున్న కెసిఆర్‌ అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి వస్తోందన్న మాటలు కూడా వైరల్‌ అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కెసిఆర్‌ తన రాజకీయ బలగంతో ప్రధాని పిలవడానికి డిల్లీ వెళ్లినా కొన్ని కారణాల వలన కలవలేకపోయారు. తిరుగు ప్రయాణంలో మహరాష్ట్ర ముఖ్యమంత్రి పఢ్నవిస్‌ను ప్రత్యేకంగా కలిసి ఆహ్వనించారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌ సిఎంను కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వనిస్తున్నట్లు సమాచారం. ఇంతమందిని పిలవడానికి వెళుతున్న కెసిఆర్‌ బలగంలో ట్రబుల్‌ షూటర్‌ కనిపించడమే లేదు. ప్రాజెక్టు పని అంతా పూర్తయ్యాక హరీశ్‌ను పక్కన పెట్టారనే వార్తలు ప్రారంభం నుంచే వచ్చాయి. రెండవసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌ మంత్రి వర్గ విస్తరణలో కెసిఆర్‌ తర్వాత రెండవ నాయకుడిగా పేరుగాంచిన హరీశ్‌రావుకు స్థానం కల్పించకపోవడంతో ఆయన సన్నిహితులు, అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఆయన చేసిన ఉద్యమం మరిచిపోలేనిదని ఆయనను కావాలనే రోజురోజుకు పక్కనపెడుతూ తెలంగాణ వాదాన్ని తొక్కిన పెడుతున్నారనే ఆరోఫణలు వెల్లువెత్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు చూశాక మళ్లీ హరీశ్‌రావును దగ్గరకు తీసుకున్నారని స్థానిక సంస్థల ఫలితాలు వచ్చాక మళ్లీ పట్టించుకోవడమే మానేశారని ఆరోఫణలు వస్తున్నాయి. కెసిఆర్‌ చెప్పగానే ఏమి ఆలోచించకుండా రంగంలోకి దిగి విజయాన్ని చేజిక్కించుకునే హరీశ్‌రావును పక్కన పెట్టడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. కారణాలు ఏమైనా కాని తెలంగాణకు వన్నెతెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు హరీశ్‌రావు లేకుండా ఆయనకు మంత్రి బాధ్యతలు అప్పగించడం ప్రారంభిస్తే మాత్రం టిఆర్‌ఎస్‌ పార్టీ పతనమవడం ఖాయమని వాదన వినిపిస్తోంది. ఈ నెల ఇరవైఒక్కటిన ప్రారంభం కాబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు హరీశ్‌రావును పిలుపు ఉంటుందా, లేదా అనేదే ఇప్పుడు అసలు సమస్యగా మారిపోయింది. ప్రాజెక్టుకు ముందే మంత్రి వర్గ విస్తరణ చేపట్టి ఆయనకు తగిన స్థానం కల్పించి ఆహ్వానిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఏలా స్పందిస్తారో, ఏలా ముందడుగు వేస్తారో వేచి చూడాల్సిందే..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close