Featuredజాతీయ వార్తలు

వారికో న్యాయం.. మాకో న్యాయమా..?

  • నిందితులను వెంటనే ఉరితీయాలి
  • బాధితురాలి కుటుంబ సభ్యుల డిమాండ్‌
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి
  • ఉన్నావ్‌ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు బదిలీ
  • అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగిన మాజీ సీఎం అఖిలేష్‌
  • నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

లక్నో

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మరణం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. ఢిల్లీలోని స్లదార్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఉన్నావ్‌ బాధితురాలు తుదిశ్వాస విడిచింది. శనివారం ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా ఉన్నావ్‌ సోదరుడు మాట్లాడుతూ.. దోషులకు వీలైనంత త్వరగా శిక్షపడేలా చేయాలని డిమాండ్‌ చేశారు. వారికి మరణ శిక్షే సరైనదని ఆమె సోదరుడు అభిప్రాయపడ్డారు. మా సోదరి ఇక మాతో లేదని, ఈ ఘోరానికి కారణమైన ఐదుగురి నిందితులకు మరణ శిక్ష విధించాలన్నదే నా ఏకైక డిమాండ్‌ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి మాట్లాడుతూ.. నా కూతురు మరణానికి కారణమైన వారిని పోలీసులు కాల్చి చంపితేనే నాకు నిజమైన ఓదార్పు అన్నారు. మమ్మల్ని వారు రోజూ వేధిస్తూనే ఉన్నారని, వారిని ఎదిరించే ధైర్యం గ్రామంలో ఎవరికీ లేదని, పైగా వారిబెదిరింపులను ప్రజలే వచ్చి మాకు చెబుతున్నారంటూ వాపోయారు. మరో సమీప బంధువుకుసైతం దోషుల కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన ఆవేదన చెందాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన యువతి గత ఏడాది డిసెంబరులో అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో ఆమెను నమ్మించి మోసం చేసిన ఓ నిందితుడు అప్పట్లో అరెస్టై, గత నెల 25నే విడుదలయ్యాడు. అనంతరం మరికొందరితో కలిసి ఆమెను హత్య చేసేందుకు పన్నాగం పన్నాడు. అత్యాచార కేసు విచారణలో భాగంగా రాయ్‌బరేలీలోని కోర్టుకు హాజరయ్యేందుకుగాను గురువారం ఉదయం బాధితురాలు బయలుదేరగా.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై దాడి చేశారు. కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేది కూడా సజీవదహనానికి యత్నించినవారిలో ఉన్నారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం వాయుమార్గంలో గురువారం ఢిల్లీకి తరలించినా ఫలితం లేకపోయింది.

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు ఉన్నావ్‌ కేసు..

ఉన్నావ్‌ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఉన్నావ్‌ రేప్‌ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని గుర్తుచేశారు. మరోవైపు యూపీ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ కేశవ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నిందితులుగా ఉన్న ఐదుగురికి శిక్ష పడుతుందని, బాధితురాలి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోగలనని, నిందితులను వదలబోమని వారికి హామీనిస్తున్నట్లు వెల్లడించారు. తొందరలో వారికి శిక్ష పడే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్‌ పాఠక్‌ స్పందించారు. గత 11 నెలల్లో 86 అత్యాచారాల నివేదికలపై రాజకీయం చేయకూడదని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా సరే.. విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తాము కఠిన చర్యలు తీసుకుంటామన్నారాయన. బాధితురాలు మృతి చెందడం బాధాకరమన్నారు. కేసును ఫాస్ట్‌ ట్రాక్‌కు తీసుకెళుతామని, రోజువారీగా విచారించాలని తాము కోరుతామన్నారు. 

అసెంబ్లీ ఎదుట మాజీ సీఎం అఖిలేష్‌ ధర్నా..

ఉన్నావ్‌ ఘటనపై యావత్‌ ఉత్తరప్రదేశ్‌ అట్టుడుకిపోతోంది. నిందితులు కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్‌ ఆధ్వర్యంలో సమాజ్‌వాది పార్టీ నేతలు అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. అసెంబ్లీ గేటు వద్ద అఖిలేష్‌ బైఠాయించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఉన్నావ్‌ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు అఖిలేష్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. హత్యకు ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని విమర్శించారు. ఉన్నావ్‌ బాధితురాలి హత్యకు కారణమైన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని అఖిలేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు యోగి సర్కారే ప్రథమ దోషి అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ చరిత్రలో ఈరోజు బ్లాక్‌ డే అని అఖిలేష్‌ విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై వివిధ వర్గాల చెందిన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే శిక్షించాలని మహిళలు ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు పెరిగాయన్నారు. ఆడపిల్ల జీవితాన్ని ప్రభుత్వం రక్షించలేకపోయిందని ఆరోపించారు. యూపీ డీజీపీ రాజీనామా చేయాలన్నారు. ఉన్నావ్‌ ఘటనకు నిరసనగా రేపు రాష్ట్రమంతా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close