పాత్రికేయఆత్మ ‘హత్య’

0
A Writer's Suicide

  • అటెండర్‌ ఆదాయంలో ‘బేడా’
  • గంభీరం ముసుగులో గడబిడ
  • స్వేచ్ఛ లేని రాతలు
  • బంగారు తెలంగాణలో 72 మంది బలి

(ఆదాబ్‌ హైదరాబాద్‌ విశ్లేషణ కథనం-2)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

19వ శతాబ్దం తొలినాటి లాగే నేటి జర్నలిజం ఉందా..? నేటి జర్నలిస్టులు అదే నీతి, నియమాలతో ఉన్నారా..? జర్నలిస్టుల రూపంలో దోపిడీ దొంగలు ఆ స్థానాలను ఆక్రమించారా..? ‘కవర్‌’ జర్నలిస్టులే రాజ్యం ఏలుతున్నారా..? విషయం లేదు. విషయ అవగాహన లేదు. అయినా… ‘ఎత్తిపోతల’ పథకాలతో పైరవీలతో సహజీవనం చేస్తున్న ఈతరంలో నిజాయితీ పాత్రికేయం ఎక్కడ..? జర్నలిస్టులంటే సమాజంలో చులకన భావం ఎందుకు వచ్చింది.? మార్పు తప్పక రావల్సిందే.

19వ శతాబ్దంలో..: స్వాతంత్య్ర పోరాటంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. అదో పవిత్ర కార్యం. కాలక్రమేణా పాత్రికేయంలో రంగు రుచి మారింది. దానికి తోడు పార్టీలకు అనుగుణంగా వార్తలు మోసే కొరియర్లుగా మారటం. అడపాదడపా బలహీనులపై అస్త్రాలు సంధించడం జరుగుతోంది. ‘స్ట్రింగర్‌’ రూపంలో మండలస్థాయిలో విస్తరింపజేసిన ఖ్యాతి ‘ఈనాడు’ దే. అందులో సందేహం లేదు. అదే స్థాయిలో మూస వార్తల విషయంలోనూ దాని తప్పు లేదు. జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే… ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే అటెండర్‌ జీతంలో ‘బేడా’ (12 శాతం)గా మారింది.

ఇది అవాంఛనీయం: సాధారణంగా ప్రతిరోజు సంభవించే (అ)సహజ మరణాల లాగానే జర్నలిస్టుల మరణాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాడిన తర్వాత 72 మంది జర్నలిస్టులను అకాల మృత్యువు కాటేసింది. ఎన్నో చావు కబుర్లు రాసే జర్నలిస్టులు తమ కుటుంబాలలో పేదరికంతో ఆకలికి తట్టుకోలేని అసహజ మరణాలు ఉన్నాయని రాయలేని పరిస్థితి. అందులో బలవన్మరణాలు ఉన్నాయి. ఇదీ మరీ ఆందోళన కరం. ఇందులో.. మెదక్‌ లో జరిగిన సంఘటన పెను విషాదం. హన్మంతరావు అనే జర్నలిస్ట్‌ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉండగా… సీనియర్‌ జర్నలిస్ట్‌ అర్జున్‌ సింగ్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ… సమాజంలో నేడు రౌడీలు, గుండాలు, దౌర్జనకారులు లేరు. వాళ్ళందరూ మారిపోలేదు. ఫీల్డ్‌ మారారు. అదీ వివిధ పార్టీల ముసుగులో ఉన్న పత్రికలలో చేరారని గంభీరంగా చెప్పటం ఒక రకంగా పెను విషాదం.

ఇళ్ళ స్థలాలు..? : ఇళ్ళ స్థలాల కోసం కొందరు జర్నలిస్టులు గత మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారంటే ఆశ్చర్యమే. సంఘాలు ఎప్పటికప్పుడు వాయిదాల పద్దతిలో దాటవేత ధోరణిలో మనుగడ సిగిస్తున్నాయి. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన పనిలేదు. ఏవరి స్వకార్యాలు వారికున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులతో పని లేనట్లు.. యాజమాన్యాలతో సఖ్యత కొనసాగిస్తోంది. ఇదీ అడిగే నాథుడే లేడు.

కిందస్థాయి ‘జర్నలిస్టు’లే..: హైదరాబాద్‌ లాంటి పట్టణాలలో పాత్రికేయుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా.. జిల్లా స్థాయిలో ద్వితీయ, తృతీయ శ్రేణి రిపోర్టర్ల పరిస్థితి దయనీయం. అటు యాజమాన్యం ఆదరించక ఇటు చోటామోటా దందాలతో పరువు బయటపడే పరిస్థితులున్నాయి.

స్వేచ్ఛ ఎక్కడ..?: పత్రికలలో యాజమాన్య మనసెరిగి రాసే రోజులు ఇవి. కొద్దికాలం ‘ఉదయం’ దిన పత్రిక, విజయవిహారం మాస పత్రికలు పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చాయి. స్వేచ్చ లేని రాతలతో తమ.తలరాతలు మారతాయని సగటు పాత్రికేయులు భ్రమలో ఉన్నారు

ప్రభుత్వం చేయాల్సింది: గంభీరంగా వార్తలు రాసే జర్నలిస్ట్‌ కుటుంబాలలో అంతా పైకి తెలియని ఆందోళన దాగిఉంది. కొందరు ‘సుబేమే కబర్‌ దాలో… శ్యాంకో కవర్‌ లేలో’ అనే దుస్థితి వచ్చారు.ఈ పరిస్థితి మారకపోతే జర్నలిజం నైతిక పతనం దగ్గరలో ఉన్నట్లే. నిజాయితీగా పనిచేసే వారెందరో ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి పైకి చెప్పలేడు. పక్కకు జరగలేడు. బంగారు తెలంగాణ కోసం దెబ్బలు తిన్న జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. యాజమాన్యాలతో పోరాడిన వారున్నారు. వాళ్ళు కోట్లు వస్తాయని ఈ పోరాటంలో భాగస్వామ్యులు కాలేదు. బతుకులు మారతాయని ఆశ పడ్డారు. మొదటి దఫాలో ఒరిగేదేవిూ లేదు. ఈసారైనా ప్రభుత్వం చొరవ చూపాలి. లేదంటే.. గత నాలుగు నెలల క్రితం 48 గంటల్లో గుండెపోటుతో 6గురు పాత్రికేయులు కన్నుమూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో జర్నలిస్టులకు వేతనం, ఇళ్ళ స్థలాలు, రవాణా, విద్య, వైద్యం, భీమా విషయాలపై పూర్తి ఆర్థిక వెసులుబాటు కల్పించాలి.

(రేపు: ఎవరి చేతిలో ఎవరు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here