యూపీలో కాంగ్రెస్‌కు జలక్‌!

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): యూపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఝలక్‌ ఇచ్చినట్లే కనిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి కూటమిగా పోటీ చేసేందుకు ప్రయత్నా లు ముమ్మరమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగినట్లు తెలుస్తుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కేవలం 5లోక్‌సభ సీట్లకే పరిమితమైంది. దీంతో ఈ సారి భాజపాను ఓడించేందుకు ఎస్పీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందుకోసం చాలా కాలంగా ప్రత్యర్థిగా ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. అయితే భాజపాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలతో కూటమికి రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్‌కు మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎస్పీ-బీఎస్పీ కూటమిలో ఆశించిన స్థానం దక్కేలా కన్పించట్లేదు. యూపీలో మహాకూటమిపై చర్చించేందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఢిల్లీలో సమావేశమైన విషయం విధితమే. ఈ చర్చతో రెండు పార్టీల మధ్య దాదాపు సీట్ల సర్దుబాటు ఖరారైనట్లే కన్పిస్తోంది. యూపీలో మొత్తం 80 లోక్‌సభ నియోజక వర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ 37, బీఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మిగతా ఆరు సీట్లను చిన్న పార్టీలకు వదిలేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీపై అఖిలేశ్‌, మాయావతి అసంతృప్తిగా ఉన్నారని, దీంతో యూపీ మహాకూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోవాలని వారు భావించట్లేదని సదరు వర్గాలు చెబుతున్నాయి. కాగా.. సీట్ల పంపకాలపై ఎస్పీ, బీఎస్పీలు జవనరి15 తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఒకవేళ మహాకూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోకపోతే అమేథీ, రాయ్‌బరేలీలో ఎవర్నీ బరిలోకి దించాలన్నది ఎస్పీ, బీఎస్పీలకు కాస్త కష్టమైన విషయమే. ఇటీవల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజార్టీ దక్కలేదు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ మద్దతులో కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే సీఎం కమల్‌నాథ్‌ మంత్రివర్గంలో సమాజ్‌వాదీ పార్టీకి చోటు దక్కకపోవడంపై అఖిలేశ్‌ యాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతవారం అఖిలేశ్‌ విూడియాతో మాట్లాడుతూ.. ‘మా ఎమ్మెల్యేను మంత్రిని చేయలేదు. కాంగ్రెస్‌కు ధన్యవాదాలు’ అంటూ చురకలంటించారు. అటు మాయావతి కూడా కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అంశాన్ని పునఃపరిశీలిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో యూపీ లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమిలో కాంగ్రెస్‌కు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here