Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

ముగిసిన జైట్లీ అంత్యక్రియలు

భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

  • శోకసంద్రమైన బోధ్‌ ఘాట్‌

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డునున్న బోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనంతరం జైట్లీ చితికి కుమారుడు రోహన్‌ నిప్పంటించారు. జైట్లీ కడసారి చూపుల కోసం పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అంత్యక్రియలకు తరలివచ్చారు. ఉపరాష్త్రపతి వెంకయ్య నాయుడు, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫడ్నవీస్‌, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌ వంటి ప్రముఖ నేతలంతా అంత్యక్రియలు పూర్తయ్యేవరకు నిగంబోధ్‌ ఘాట్‌లోనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలు జైట్లీకి చివరి సారిగా నివాళులు అర్పించారు.. జైట్లీకి తుది వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఉండటంతో అంత్యక్రియలకు రాలేకపోయారు. ఆదివారం ఉదయం నివాసం నుంచి ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు జైట్లీ భౌతికకాయన్ని తరలించారు. అక్కడ నేతలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం పార్టీ కార్యాలయం నుంచి అంతిమ యాత్ర జరిగింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నేతకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు. అధికార పార్టీతో పాటు… కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మోతీలాల్‌ వోహ్రా, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆర్‌ఎల్డీ నేత అజీత్‌ సింగ్‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. యమునా నది ఒడ్డువరకూ అంతిమయాత్ర కొనసాగింది. అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 9న ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. 15 రోజులపాటు చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. జైట్లీ ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు శతథా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డయాబెటిస్‌ కారణంగా బాగా బరువు పెరిగిపోయిన జైట్లీ 2014లో బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నారు. 66 ఏళ్ల జైట్లీ గత ఏడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. ఆయనకు క్యాన్సర్‌ రావడంతోనే చికిత్స కోసం జనవరిలో అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది.

అరుణ్‌ జైట్లీ 1952 నవంబరు 28న న్యూఢిల్లీలో జన్మించారు. జైట్లీకి భార్య సంగీత, కుమారుడు రోహన్‌, కూతురు సొనాలి ఉన్నారు. అరుణ్‌ జైట్లీ ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థి నేతగా పనిచేశారు. 1974లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్‌ నారాయణ్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేకగా ఉద్యమంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కీలక భూమిక పోషించారు జైట్లీ. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్‌ పార్టీ లో చేరారు. 1987 నుంచి పలురాష్ట్రాల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. వీపీ సింగ్‌ హయాంలో అడిషనల్‌ సాలిసిటర్‌ జనరల్‌గానూ సేవలందించారు జైట్లీ.
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close