Featuredజాతీయ వార్తలు

ఇస్రో మరో గగన విజయం

  • విజయవంతంగా రీశాట్‌2, బీఆర్‌1 ఉపగ్రహ పరీక్ష
  • కక్షలోకి పది ఉపగ్రహాలు చేరిక
  • ఇస్రో చరిత్రలో పీఎస్‌ఎల్వీ రాకెట్‌ పాత్ర
  • అత్యంత కీలకంగా వరుస ప్రయోగాలు
  • పరిశోధనలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన శివన్‌

బెంగళూరు

గగన చరిత్రలో ఇస్రో మరో మైలురాయి దాటింది. రీశాట్‌2బీఆర్‌1 ఉపగ్రహాన్ని ఇవాళ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీంతో ఇస్రో సరికొత్త మైలురాయిని అందుకున్నది. రీశాట్‌2తో పాటు మరో 9 ఉపగ్రహాలను ప్రయోగించారు. మొత్తం పది ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించాయి. పీఎస్‌ఎల్వీసీ-48 రాకెట్‌తో ఈ ఉపగ్రహాలను ప్రయోగించారు. రీశాట్‌2 సోలార్‌ ప్యానెల్స్‌ను విజయవంతంగా తెరుచుకున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. విదేశాలకు చెందిన శాటిలైట్లలో ఇజ్రాయిల్‌, ఇటలీ, జపాన్‌, అమెరికా దేశాలకు చెందినవి ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ సీ-48 రాకెట్‌ అన్ని శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యలోకి తీసుకువెళ్లింది. 576 కిలోవిూటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి రీశాట్‌ను ప్రవేశపెట్టారు. శ్రీహరికోట నుంచి రాకెట్‌ను ప్రయోగించడం ఇది 75వ సారి. దాంట్లో పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ప్రయోగించడం ఇది 50వ సారి. ఇదో కొత్త రికార్డు అని ఇస్రో చైర్మన్‌ శివన్‌ చెప్పారు. రాకెట్‌ తీసుకువెళ్లిన పేలోడ్‌లో 108 సబ్‌సిస్టమ్స్‌ ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ సక్సెస్‌ రేటు 96 శాతంగా ఉంది. తాజా రాకెట్‌ను కొత్త లాంచ్‌ ప్యాడ్‌ను ప్రయోగించారు.

ఇస్రో చరిత్రలో పీఎస్‌ఎల్వీ రాకెట్‌ పాత్ర : శివన్‌

ఇస్రో ఘనతలో పీఎస్‌ఎల్వీ రాకెట్‌ పాత్ర విశేషమైనది. రికార్డుల విూద రికార్డుల తిరగరాస్తున్న ఇస్రోలో పీఎస్‌ఎల్వీ అత్యంత కీలకంగా మారింది. ఎన్నో అనితరసాధ్య ప్రయోగాలకు ఈ రాకెట్‌ సాక్ష్యంగా నిలిచింది. శ్రీహరికోట నుంచి బుధవారం రీశాట్‌2ను కూడా పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారానే ప్రయోగించారు. పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇది 50వ సారి. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ శివన్‌ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీఎస్‌ఎల్వీ ఆధునీకరణలో కృష్టి చేసిన గత ఇస్రో శాస్త్రవేత్తల గురించి ఈ పుస్తకంలో సవివరంగా ప్రచురించారు. నేవిగేషన్‌ వ్యవస్థలో వస్తున్న మార్పులను ఇస్రో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూనే ఉన్నది. ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో పీఎస్‌ఎల్వీ ఆధునీకరణ జరిగింది. ఆ రాకెట్‌ పేలోడ్‌ సామర్థ్యాన్ని క్రమక్రమంగా పెంచుతూ వచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఇవాళ రీశాట్‌2 ప్రయోగం తర్వాత తమ అనుభవాలను పంచుకున్నారు. ఇస్రో ఘనతలో పీఎస్‌ఎల్వీ పాత్రను వారు వివరించారు. ఇస్రో మేనేజ్మెంట్‌ వల్ల ఈ రాకెట్‌ రూపాంతరం చెందిన తీరును వారు వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ప్రవేశపెట్టి 26 ఏళ్లు అవుతున్నది. రీశాట్‌ ప్రయోగం తర్వాత శివన్‌ మాట్లాడుతూ.. మాజీ శాస్త్రవేత్తలను ఆయన గుర్తు చేసుకున్నారు. అంతరిక్షంలోకి పీఎస్‌ఎల్వీ వెళ్లని చోటు లేదని ఆయన తెలిపారు. పీఎస్‌ఎల్వీ రాకెట్‌.. మూన్‌, మార్స్‌కు వెళ్లింది. ఇప్పుడు సూర్యుడి దగ్గరకు కూడా వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ఎస్‌ఎస్‌ఎల్వీ మిషన్‌ కూడా ప్రయోగించాల్సి ఉన్నదన్నారు. సీ-48 ఈ ఏడాది చివరి ప్రయోగం అని శివన్‌ తెలిపారు. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ను తొలిసారి డాక్టర్‌ శ్రీనివాసన్‌ డెవలప్‌ చేశారు. 26 ఏళ్ల క్రితం మొదలైన పీఎస్‌ఎల్వీ ప్రయాణం.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. శ్రీనివాసన్‌ ఈ రాకెట్‌ కాన్సెప్ట్‌ను తయారు చేసినట్లు శివన్‌ చెప్పారు. ఆ తర్వాత మాధవన్‌ నాయర్‌ మరింత కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఇన్నాళ్లూ అనేక మంది ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు ప్రాణం పోస్తూ వచ్చారు. ఆర్వీ పెరుమాళ్‌, రామకృష్ణన్‌, నారాయణమూర్తి, ఉన్నికృష్ణన్‌, జయకుమార్‌ లాంటి శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. అయితే పీఎస్‌ఎల్వీ తన కెరీర్‌లో ప్రధానంగా పేలోడ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నది. మొదట్లో 850 కిలోల బరువున్న పేలోడ్‌తో వెళ్లిన ఈ రాకెట్‌ ఇప్పుడు 1.9 టన్నుల బరువును కూడా మోసుకువెళ్లుతున్నది. రీశాట్‌2 చాలా సంక్లిష్టమైన ప్రయోగం అని, కానీ ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని అద్భుతంగా ప్రయోగించారని శివన్‌ తెలిపారు. మునుముందు మరిన్ని మిషన్లు చేపట్టాల్సి ఉన్నదని ఇస్రో చైర్మన్‌ తెలిపారు. ప్రతి మిషన్‌ను అత్యంత విజయవంతంగా చేపట్టాలన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close