Featuredస్టేట్ న్యూస్

జరిగింది ఎన్‌కౌంటరేనా?

  • ఎన్‌హెచ్‌ఆర్‌సి ఏం చెప్పబోతోంది?
  • నిందితుల పోస్టుమార్టంలో తేలింది ఏమిటి..?

ఎన్‌కౌంటర్‌ ఏదైనా సరే.. చేసేది పోలీసులే. చేసేవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే మొదలవుతుంది వారికి టార్చర్‌. మానవ హక్కలు సంఘాల నేతల కేసులు, కోర్టుల్లో విచారణ.. ఇలా వారికి నరకమే. కేసు తెగే వరకు వాళ్లు తిరుగుతూనే ఉండాలి. తాజాగా.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల పరిస్థితిపై వార్తలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఏదైనా క్రైం జరిగిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని, నడిరోడ్డుపై కాల్చి చంపాలని భావోద్వేగంతో మాట్లాడుతారు. అయితే, ఏదైనా సందర్భంలో ఎన్‌కౌంటర్లు జరిగితే.. ప్రజలే మానవ హక్కులు అంటూ కేసులు వేస్తారు. దీంతో పోలీసులు ఆ కేసులపై కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కడ కేసు వేస్తే అక్కడి వరకు వెళ్లాల్సిందే. ఈ సందర్భంలో పోలీసులకు మద్దతు లభించదు. అయితే దిశ హత్యాచారం కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై చాలా మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంటే… మానవ హక్కుల సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు మాత్రం ఎన్‌కౌంటర్‌పై సందేహాలు వ్యక్తం చేశాయి. నిందితులు సామాన్యులు కాబట్టి పోలీసులు వాళ్లను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేశారనీ… అదే ఏ ఎమ్మెల్యే కొడుకో తప్పు చేసి ఉంటే ఇలా చేసేవారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన ఏడుగురు జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుల (వీరిలో ఒకరు ఫోరెన్సిక్‌ నిపుణుడు)పై కొందరు ప్రజల నుంచీ వ్యతిరేకత, విమర్శలు ఎదురవుతున్నాయి. ఇలాంటివి పట్టించుకోని ఎన్‌హెచ్‌ఆర్‌సి టీమ్‌… శనివారం రోజంతా… ఎన్‌కౌంటర్‌ అంశంపై దర్యాప్తు చేసింది. అంటే… హెచ్‌ఆర్‌సి సభ్యులు చటాన్‌పల్లిలో దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలాల్ని పరిశీలించారు. ‘దిశ’ మృతదేహాన్ని నిందితులు దహనం చేసిన ప్రాంతాన్ని వెళ్లి చూశారు. కొన్ని వీడియోలు తీశారు. అలాగే ఘటనకు సంబంధించి పోలీసుల దగ్గర వివరాలు తీసుకున్నారు. మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచిన నలుగురు నిందితుల మృతదేహాల్ని సభ్యుల బృందం పరిశీలించింది. పోస్ట్‌మార్టం రిపోర్టులోని అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ నిపుణుల్ని పిలిపించి మాట్లాడింది. మూడు గంటలకు పైగా ఆస్పత్రిలోనే ఉన్న బృందం… తర్వాత మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఘటనపై వారి వాంగ్మూలాలు తీసుకుంది. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సి ఎలాంటి రిపోర్ట్‌ ఇవ్వబోతోంది? జరిగింది ఎన్‌కౌంటరేనా? లేక పోలీసులు కావాలని వాళ్లను చంపేశారా? అన్న ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణాధికారిగా రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి నియమితులయ్యారు. షాద్‌నగర్‌ దగ్గర్లో నవంబర్‌ 27న వెటర్నరీ వైద్యురాలిపై నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, నవీన్‌, శివ, చెన్నకేశవులు అత్యాచారం చేసి, తర్వాత ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టి చంపేశారు. ఈ క్రమంలో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు… శుక్రవారం క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో జరిపిన కాల్పుల్లో వారు చనిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుల మృతదేహాల్ని పాలమూరు మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఐతే… ఈ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే స్పందించారు. న్యాయం ప్రతీకారం కాకూడదన్న ఆయన… ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ సరికాదన్నారు. తద్వారా ఎన్‌కౌంటర్‌ను పరోక్షంగా వ్యతిరేకించినట్లైంది.

నిందితుల పోస్టుమార్టంలో తేలింది ఏమిటి..?

దిశ నిందితుల ఎన్కౌంటర్‌ సమయంలో మృతుల శరీరంలో బుల్లెట్ల గాయాలు తప్పా ఒక్క చోట బుల్లెట్‌ కూడ లభించలేదని సమాచారం. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మృతుల శరీరాల్లో నుండి ఒక్క బుల్లెట్‌ నుండి లేదని తేలినట్టు తెలుస్తోంది. దిశపై గ్యాంగ్రేప్‌ కు పాల్పడి హత్య చేసిన నలుగురు నిందితులను ఈ నెల 6వ తేదీన చటాన్పల్లిలో పోలీసుల ఎన్కౌంటర్‌ లో మృతి చెందారు. సీన్‌ రీ కన్స్ట్రక్షన్‌ సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయినట్టుగా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రకటించారు.

ఏ-1 నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ శరీరంలో నాలుగు చోట్ల బుల్లెట్‌ గాయాలున్నట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రెండు బుల్లెట్‌ గాయాలు ఛాతీలో, ఒకటి పక్కటెముకలో దిగినట్టుగా పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం తేలుస్తోంది. మరో గాయం వీపు ప్రాంతంలో దిగిందని సమాచారం.

ఇక ఏ-2 నిందితుడు శివ శరీరంపై మూడు బుల్లెట్‌ గాయాలు ఉన్నట్టుగా ఈ రిపోర్టు చెబుతోంది. రెండు బుల్లెట్‌ గాయాలు కిడ్నీ లో, మరోటి వెనుక భాగంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

దిశ కేసులో మూడో నిందితుడు నవీన్‌ దేహంలో మూడు చోట్ల బుల్లెట్‌ గాయాలున్నాయి. ఇందులో ఒకటి తలలో నుండి వెళ్లాయి. రెండు బుల్లెట్లు చాతీలో నుండి వెళ్లినట్టుగా సమాచారం.

ఇక ఏ-4 నిందితుడు చెన్నకేశవులు శరీరంలో ఒక్క బుల్లెట్‌ గాయం మాత్రమే ఉన్నట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. చెన్నకేశవులు గొంతు నుండి ఈ బుల్లెట్‌ వెళ్లినట్టుగా తెలుస్తోంది.

నిందితులకు పోలీసులకు మధ్య అతి సమీపం నుండి కాల్పులు జరిగినట్టుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే నిందితుల శరీరం నుండి బుల్లెట్లు బయటకు వెళ్లినట్టుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దూరం నుండి కాల్పులు జరిగితే నిందితుల శరీరాల్లో బుల్లెట్లు ఉండేవనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం నిందితుల మృతదేహాలు జడ్చర్ల మెడికల్‌ కాలేజీలో భద్రపర్చారు. నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే విషయమై సోమవారం నాడు హైకోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇవ్వనుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close