Featuredస్టేట్ న్యూస్

ఉచ్చు బిగుస్తుందా..?

  • తప్పని తెలితే కఠినచర్యలు…
  • ఎన్‌హెచ్‌ఆర్సీ రహస్య విచారణ..
  • నేడో, రేపో నివేదికతో ఢిల్లీ పయనం..
  • చర్యలు తప్పేలా లేవంటున్న నిపుణులు..

తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి.. కాని శిక్ష ఏలా ఉండాలంటే మళ్లీ తప్పు చేయాలంటే భయపడాలి, నిందితుడికి పడ్డ శిక్షను చూసినవారికి తప్పు చేయాలనే ఆలోచన వారి మనసులోకి రావద్దు.. అంతా కఠినంగా శిక్షలు ఉన్నప్పుడే అత్యంత దారుణమైనా నేరాలు, ఘోరాలు తగ్గుతాయి.. పసిపిల్లల నుంచి పండుముసలి వరకు మృగాళ్ల కామానికి బలైపోతూనే ఉన్నారు. ఎంతోమంది అమ్మాయిలు జీవితంలో రాలిపోతూనే ఉన్నాయి. కాని మన దగ్గర ఉన్న చట్టాలు వేరు.. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియదు.. అన్యాయానికి గురైనవారు న్యాయం కోసం చూసి చూసి వారి కళ్లు కాయలు కాచే పరిస్థితి వస్తోంది. చట్టాలు, న్యాయాలు అంత బలహీనంగా ఉన్నాయా, బలంగా ఉన్నాయా అంటే అదీ తెలియదు కాని మన దేశంలో మాత్రం బాధితుడికి సరియైనా సమయంలో న్యాయం అందనే అందదు. సత్వరం న్యాయం దక్కాలని ఆందోళనకారులు ఎంత నిరసనలు తెలిపినా పట్టించుకునే వారు కరువయ్యారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ నగరంలో జరిగినా దిశ అమానుష సంఘటన దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని కదిలించింది. రాష్ట్రరాజధానిలో రాత్రి తొమ్మిదిగంటలకు అత్యంత దారుణంగా ఒక అమ్మాయిని పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన యావత్తు ప్రజానీకమే తల్లడిల్లిపోయింది. ఆడపిల్లను ఇంకెలా పెంచాలో తెలియక సతమతమయ్యారు. కామాంధులు రాబందుల్లా ఎలా వస్తారో, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి.. అందుకే ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడ్డవారికి కఠిన శిక్షలు ఉండాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌ చేశారు. తప్పుచేసినా నిందితుడికి కోర్టులు, చట్టాలంటూ నెలల తరబడి జైలులో ఉంచి మేపడం కంటే బాధితురాలు ఏలా అమానుషంగా బలైపోయిందో, నిందితులు కూడా అలాగే మరణించాలని దిశ కేసులో నలుగురు నిందితులను తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్చివేశారు. కాని ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు తక్షణమే స్పందించని కొన్ని చట్టాలు, సంఘాలు ఇప్పుడు మాత్రం హత్యకు హత్య ప్రతికారం కాదంటున్నాయి. ఏ ఆధారంగా నిందితులు పారిపోయారో తెలపాలంటూ, అసలు ఎన్‌కౌంటర్‌ తీరుపై రహస్య విచారణ చేపడుతూ వివరాలను సేకరిస్తోంది హెచ్‌ఆర్సీ.. నిందితులకు సరియైనా శిక్ష పడిందని యావత్తు సమాజం ఆనందిస్తుంటే, ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేసినా పోలీసులపై చర్యలు తీసుకునేందుకు హెచ్‌ఆర్సీ సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. ఎంతమంది పోలీసులపై చర్యలు తీసుకుంటారో అనేది ఇప్పుడు అంతుపట్టడమే లేదు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

అన్యాయం జరిగిన ఆడపిల్లకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సంవత్సరాల నుంచి వేచిచూసినందుకు నిజంగా న్యాయం దక్కతుందా, లేదా దక్కేది న్యాయమా అన్యాయమా అనేది అర్ధమే కావడం లేదు. అందుకే సత్వర న్యాయం, తక్షణ శిక్షలు అనేది మన దేశంలో ఎప్పుడో కనుమరుగైపోయాయి. అందుకే కామాంధులు రెచ్చిపోతున్నారు. గంటగంటకు లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అడపిల్లల విషయంలో ప్రభుత్వాలు కఠిన చట్టాలను రూపొందించాల్సిందిపోయి సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావుడీ చేసి నాలుగురోజులు అయ్యాక అంతా మరిచిపోతూనే ఉన్నారు. అందుకే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. అమ్మాయిలపై జరిగినా దారుణమైనా అమానుషాలను తట్టుకోలేని కొంతమంది అధికారులు నిందితులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నప్పుడు ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేస్తున్నారు. పోలీసులు చేసిన చర్యలకు ప్రజల నుంచి పెద్దఎత్తున అభినందనలు వస్తున్నాయి కాని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ మాత్రం ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీసులు నిందితులను తరలిస్తున్నప్పుడు ఏలా తప్పించుకుంటున్నారని పోలీసుల దగ్గర ఆయుధాలున్నా కూడా నిందితులు తప్పించుకుంటున్నారంటే అది నమ్మదగిన విషయమే కాదంటున్నారు. పోలీసులు కావాలనే ఎన్‌కౌంటర్‌ చేసి చంపేస్తే కట్టుకథలు అల్లుతున్నారని సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్సీ ఇలాంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. అందుకే సంఘటన ఏలా జరిగిందో అందులో ఎంతమంది పాల్గంటున్నారనే విషయాలపై సుదీర్ఘంగా విచారణ జరుపుతోంది. నిజనిజాలు తెలిసిన తర్వాత అందుకు కారకులైనా పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ వెనుకాడడమే లేదు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటనపై కూడా బాధ్యులైనా పోలీసు అధికారులపై చర్యలు తప్పేలా కనబడడం లేదు.

ఎన్‌హెచ్‌ఆర్సీ రహస్య విచారణ..

దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై లోతైన విచారణ చేయాలని ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యులు నిర్ణయించారు. అందుకు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు హైదరాబాద్‌లోనే ఉంటూ ప్రతి అంశాన్ని వివరంగా, విశదీకరంగా పరిశీలించిన నివేదికను తయారు చేస్తున్నారు. అందుకు సంబంధించిన సమగ్ర విచారణ చేయనున్నారు. శనివారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురి మృతదేహలను పరిశీలించారు. పోస్టుమార్టం చేసిన వైద్యులతో మూడున్నర గంటలపాటు భేటీ అయ్యి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఫోరెన్సిక్‌ నిపుణులను పిలిపించి మరీ పోస్టుమార్టంపై లోలైన విచారణ చేశారు. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేశారు. ఆ తర్వాత షాద్‌నగర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగినా చటాన్‌పల్లి స్థలాన్ని పరిశీలించారు. అదివారం మృతుల తల్లిదండ్రులతో సమావేశం అయ్యారు. సోమవారం రాష్ట్రపోలీస్‌ ఉన్నతాధికారులు ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. విచారణ పూర్తయ్యాక సోమవారం లేదా మంగళవారం ఉదయం తిరిగి తయారు చేసిన నివేదికతో డిల్లీకి వెళ్లనున్నారు. ఎన్‌కౌంటర్‌పై నిజనిజాలను తెలుసుకునేందుకు మానవ హక్కుల సంఘం ప్రతినిధులు రహస్యంగా విచారణ జరపడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. వైద్యులు పోలీసు ఉన్నతాధికారులు తప్ప ఎవరిని లోపలికి అనుమతించలేదు. మీడియాతోనూ మాట్లాడలేదు. వీరి విచారణలో ఎన్‌కౌంటర్‌ బూటకమా, నిజమా అనేది త్వరలో తేలనుంది. ఒక వేళ బూటకమని తెలితే ఎంతమంది పోలీసు అధికారులపై చర్యలు ఉంటాయో అర్థం కావడం లేదు. ప్రజల నుంచే కాకుండా దేశంలోనే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ పోలీసులు చేసిన చర్యను సమర్థిస్తున్నారు. కాని ఉన్నత న్యాయస్థానం, ఎన్‌హెచ్‌ఆర్సీ మాత్రం ఇలాంటి వాటిని సమర్థించే ప్రసక్తే లేదంటుంది. వీటిని ఇలాగే వదిలేస్తే పోలీసులు మరింత రెచ్చిపోతారని ఎన్‌కౌంటర్‌ ఆబద్దమని జాతీయ మానవ హక్కుల నివేదికలో రుజువైతే అందుకు బాధ్యులైన పోలీసులపై మాత్రం కఠిన చర్యలు తప్పవన్నట్టుగానే సంకేతాలు కనబడుతున్నాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close