స్టేట్ న్యూస్

పార్టీ మారి మాపైనే విమర్శలా?

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన జీవన్‌రెడ్డిని గాంధీభవన్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ లోపం ఉందంటే తాము ఒప్పుకోమన్నారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎలా విలీనం అవుతుందని ఉత్తమ్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, అసెంబ్లీ, మండలిని ప్రగతి భవన్‌లో పెట్టుకోవాలని ధ్వజమెత్తారు. యానో, భయానో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను జనాలు ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. బ్యాలెట్‌ ద్వారా పెట్టిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. జీవన్‌ రెడ్డి గెలిచి పార్టీకి నూతన ఉత్తేజం తెచ్చారని కొనియాడారు. వ్యక్తిగత ఇమేజ్‌తోనే జీవన్‌ రెడ్డి గెలిచారని ప్రశంసలు కురిపించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది – భట్టి విక్రమార్క

కాంగ్రెస్‌ పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెయ్యి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు నాయకత్వంపై నమ్మకం లేదని చెప్పడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. తాము ప్రజల కోసం పోరాడుతాము తప్ప.. అమ్ముడు పోమని అన్నారు. ప్రతిపక్షం ఉండాలనే ప్రజలు జీవన్‌ రెడ్డిని గెలిపించారని పేర్కొన్నారు. జీవన్‌ రెడ్డిని గెలిపించినట్లు రానున్న ఎన్నికల్లో జనాలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పుడు పార్టీ మారిన నేతల బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరాకులా మారుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం బాగాలేదు అనడానికి సిగ్గుండాలన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీపైనా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.ఎమ్మెల్యేలను కొనడానికి వాడుతున్న అవినీతి సొమ్మును బయటకు కక్కిస్తామన్నారు. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఎలా విలీనం అవుతుందని భట్టి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేష్టల పట్ల ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు. 
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close