Featuredస్టేట్ న్యూస్

ఓవర్‌ నైట్‌ విలీనం సాధ్యమా..?

  • ఆర్టీసీ సమ్మెపై కొనసాగిన వాదనలు
  • ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
  • విలీనం పక్కన పెట్టి మిగతా అంశాలపై చర్చించాలని సూచన
  • నేటి మధ్యాహ్నానికి విచారణ వాయిదా

హైదరాబాద్‌

ఆర్టీసీ సమ్మెపై మైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మెకారణంగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను నష్టాలను గుర్తించడం లేదన్న రీతిలో వ్యాఖ్యలుచేసింది. కార్మికుల సమ్మెపై హైకోర్టు సోమవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ అంశంపై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి విచారిస్తామని పేర్కొంది. ఎల్లుండి వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరినా.. అందుకు హైకోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక, ఆర్టీసీ సమ్మెతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరోసారి గుర్తుచేసిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైళ్ల కంటే బస్సు ప్రయాణాలే ఎక్కువ అని, ఆదిలాబాద్‌ వంటి అటవీ ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారు వరంగల్‌ లేదా హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుందని, ఇందుకు ఆర్టీసీ బస్సులపై ఆధారపడాలని, ఈ నేపథ్యంలో బస్సులు తిరగకపోవడం వల్ల ఓ చిన్నారి మరణిస్తే.. అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అని హైకోర్టు నిలదీసింది. అసలే డెంగ్యూ జ్వరాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, రూ, 46 కోట్లు లేవని సర్కార్‌ చిన్నారి చావుకు కారణమవుతుందా అని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదనీ, చర్చలు జరపకుండానే కార్మిక నేతలు బయటకు వెళ్లిపోయారని తెలిపారు. విలీనం డిమాండ్‌కు పట్టుబట్టకుండా మిగతా డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని హైకోర్టు పేర్కొంది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చించాలని కార్మిక సంఘాలకు సూచించింది. మొత్తం 45 డిమాండ్లలో ఆర్టీసీ సంస్థపై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చ జరగాలని, మొదట 21డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుందని పేర్కొంది. ప్రతిష్టంభన కొనసాగితే ఇటు కార్మికులు, అటు ప్రజలు ఇబ్బంది పడతారని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు కార్మిక సంఘాల తరఫు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చర్చల విషయంలో హైకోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని పేర్కొన్నారు. కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారని, ఇతర డిమాండ్లపై వారు చర్చించడం లేదన్నారు. చర్చల విషయంలో కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని, అన్ని డిమాండ్లపై చర్చకు అవి పట్టుబడుతాయని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు చర్చల వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేసింది. కార్మికుల 21 డిమాండ్లలో రెండు మాత్రమే తమకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, కార్మికులు అడుగుతున్న 16 డిమాండ్లు సంస్థపై ఆర్థికభారం మోపేలా ఉన్నాయని యాజమాన్యం పేర్కొంది. కార్మికులు చేస్తున్న మరో రెండు డిమాండ్లు అసుల పరిగణనలోకి కూడా తీసుకోలేనివిధంగా ఉన్నాయని ఆర్టీసీ సంస్థ తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ. 175 కోట్ల నష్టం వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీసీ వద్ద రూ. 10 కోట్ల నగదు మాత్రమే ఉందని తెలిపారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని, ఇప్పటికే కార్మికుల వేతనాలు పెంచామని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు నివేదించారు. సమ్మె చట్టవిరుద్ధమైతే కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని హైకోర్టు కోరింది. దీనికి ఏఏజీ సమాధానమిస్తూ.. గతంలో సమ్మె చేస్తే కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, రాజకీయ పార్టీలు కార్మికులను ప్రస్తుతం తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. దీంతో కార్మికుల సమస్యలపై ఆర్టీసీ వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది. కార్మికుల డిమాండ్లు సాధ్యం కావని ముందుగానే ఆర్టీసీ ఓ నిర్ణయానికి వచ్చిందా? అని ప్రశ్నించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని సూచించింది. బస్సులకు సంబంధించి టూల్స్‌, స్పేర్‌పార్ట్స్‌కు కూడా బ్జడెట్‌ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ సమయంలో వాదనలు వినిపిస్తున్న ఏఏజీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వకేట్‌ జనరల్‌ మాత్రమే ప్రభుత్వం తరఫున, ఆర్టీసీ తరఫున వాదనలు వినిపించాలని, వెంటనే ఆయనను పిలిపించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలతో అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరై వాదనలు వినిపించారు. మొదట 21డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఓవర్‌ నైట్‌ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగి.. ఇటు కార్మికులు, అటు ప్రజలు ఇబ్బంది పడతారని న్యాయస్థానం పేర్కొంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close