ఈసీ అనుమతి తీసుకోవాలా..?

0

ఉత్తర్‌ప్రదేశ్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విమర్శల్లో మరింత పదును పెంచారు. ఉగ్రవాదులపై కాల్పులు జరపడానికి కూడా జవాన్లు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన ఘటనని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా.. సైనికులు ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. సుస్థిర, అవినీతిరహిత ప్రభుత్వానికే ప్రజలు ఓటు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా యూపీలోని మహాకూటమిపై కూడా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కాశ్మీర్‌ లో ప్రతి రెండు, మూడు రోజులకూ టెర్రరిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతూనే ఉంటోంది. అలాటప్పుడు ఆ ప్రక్రియ కోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని ప్రధాని పేర్కొన్నారు. దేశమంతా కమలం వికసిస్తోందని ఈ సందర్బంగా అయన వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని, బలమైన నాయకత్వం దేశానికి అవసరమని వారు గుర్తించారని చెప్పారు. మళ్లీ బిజెపి అధికారం లోకి వస్తుందన్న సంకేతాలతో మహమిలావత్‌ గ్రూప్‌ తట్టుకోలేకపోతోందని విమర్శించారు. అందుకనే ఇష్టం వఛ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. అయితే, బీజేపీ జాతీయత, దేశ భద్రత అంశాలను తన ఎన్నికల ప్రచారం లో వాడుకొంటోంది. దీనిపై విపక్షాలు కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పట్లేదు. కానీ, మోడీ నా సైన్యం అంటూ భారత దేశ సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలకు మాత్రం మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ కంటే తాను ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశానని కానీ తనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. రాజస్థాన్‌లో సామూహిక అత్యాచారానికి గురైన మహిళపై మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బాధిత కుటుంబం పట్ల నిజంగా ఆవేదన ఉన్నట్లయితే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఎందుకు ఉపసంహరించుకోవడం లేదని నిలదీశారు. ఓ దళిత మహిళ అత్యాచారానికి గురైతే కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని దాచిపెట్టాలని చూసిందని ఆరోపించారు. చివరకి దీనిపై కూడా కాంగ్రెస్‌ ‘జరిగిందేదో జరిగిపోయింది’ వైఖరిని ప్రదర్శిస్తోందని పరోక్షంగా ఇటీవల సిక్కుల ఊచకోతపై ఆ పార్టీ నేత శ్యామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here