అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు

0

లక్షల ఓట్లను తొలగించారు: బిజెపి

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు అవకతవకలు జరిగాయన్న బీజేపీ ఆరోపిస్తోంది. ఈసీ టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆపార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో జరిగిన తప్పులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తొలగించిందని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవిధంగానే ఈ పక్రియ జరిగిందని ఫిర్యాదు చేశారు. మజ్లిస్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పెరిగిందని, అదే బీజేపీ ప్రాబల్యమున్న చోట్ల ఓట్లసంఖ్య తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల తొలగింపు విషయంలో పొరపాట్లు దొర్లాయని, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అంగీకరిస్తూ.. రాష్ట్ర ఎన్నికల అధికారి క్షమాపణలు కూడా కోరారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల జాబితా విషయమై జరిగిన అక్రమాలకు ఇదే నిదర్శనమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తమ దృష్టికి వచ్చిన అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. తాము లేవనెత్తిన అంశాలను పరిశీలించి.. తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్‌ తమకు హావిూ ఇచ్చినట్టు లక్ష్మణ్‌ తెలిపారు. అనంతరం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల ఓటర్ల నమోదు, తొలగింపు అంశంలో జరుగుతున్న అవకతవకలను బీజేపీ ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే వచ్చిందని అన్నారు. సాంకేతికత విషయంలో ఎదురయ్యే లోపాలను సరి చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here