కోట్లుపెట్టినా.. పడని ఓట్లు…

0

అక్కడ పంక్షన్‌ అవుతుందా… ఐతే పద వెళ్లి కలుద్దాం… మీరంతా మన వాళ్లేనంటూ, మీ ఓట్లు మాకేనంటూ పదిరకాల మాటలు చెప్పి, పది ఓట్లు రాబట్టుకుందాం.. కాబోయే పెద్ద నాయకులం..ఒట్టిచేతులతో పోతే విలువ పోతుంది. చేతిలో గట్టితే విలువైనదే మంచి బహుమతి కొనాలి.. ఓట్లు వచ్చాక, గెలిచాక మళ్లీ ఏలాగోలా రాబట్టు కోవచ్చని కొంతమంది ఇండిపెండెట్లు కూడా ఖర్చుకు వెనుకాడకుండా అప్పులు తెచ్చి మరీ కోట్లు ఖర్చు చేశారు. తీరా వారికొచ్చిన ఓట్లు చూస్తే కళ్లుతిరిగి కిందపడిపోయారు. రాజకీయం ఇంత వ్యాపారమా అంటూ నోరెళ్లపెట్టడం అంతా చేసేదేమి లేక మౌనంగా ఉంటున్నారు.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…తెలంగాణ శాసనసభల ఎన్నికల్లో ఏలాగైనా గెలవాలి.. మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. ఎలాగూ అధికారంలో ఉన్నపార్టీకి అంతా వ్యతిరేకతే ఉంది. కాంగ్రెస్‌ సీట్ల కోసం ఇంకా కొట్లాడుతూనే ఉంది. ప్రజల్లో తిరుగుతూ ఏలాగైనా వారిని బతిమాలాడే, కాళ్లు పట్టుకొనే శాసనసభ్యుడిగా గెలుపొందాలనే ఆలోచనతో చాలామంది అనేక నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. వారు పోటీ చేసిన నియోజకవర్గంలో ఏ చిన్న పంక్షన్‌ జరిగినా, సమావేశం జరిగినా, పిల్లలు పిచ్చాపాటిగా మాట్లాడుకునే ప్రతి కార్యక్రమానికి అందరికంటే ముందే వాలిపోయిన స్వతంత్ర అభ్యర్థులు వందల్లో ఉన్నారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న కొంతమంది మాత్రం వారి దగ్గర ఉన్న డబ్బుకన్నా అధికంగా మరీ మరీ అప్పులు తెచ్చి ప్రచారాన్ని ఉరకలెత్తించారు. అధికారంలో ఉన్న నాయకులకన్నా ముందే ప్రతి చిన్న కార్యక్రమానికి వెళ్లి విలువైన బహుమతులు అందజేసి కాళ్లూ వేళ్లూ పట్టుకొని బతిమాలాడారు. మీ ఓట్లు నాకే అంటూ మాట కూడా తీసుకున్నవారు ఉన్నారు. మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు డబ్బులు లేవు. మద్యం లేదు. ఓటు వేయండి. పనిచేయించుకొండి అంటూ ప్రచారం చేస్తే వెళ్లారు. కాని ఓటర్లు మాత్రం అందరికి తలూపి తనకు నచ్చినవారికే మనసులో ఉన్నవారికే ఓటువేశారు. డబ్బులేకుండా మామూలుగా ప్రచారం చేసినవారు నియోజకవర్గంలో అంతో, ఇంతో పేరు సంపాదించుకున్నారు కాని అప్పులు తెచ్చి కష్టాలు ఉన్న ఇండిపెండెట్లు మాత్రం బోరుబోరున రోదిస్తున్నారు.

రాజకీయమంటేనే వ్యాపారం.. రాజకీయమంటే సేవ అనే మాట ఎప్పుడో మరిచిపోయారు అటు ఓటర్లు, ఇటు నాయకులు. నువ్వు ఇండిపెండెంట్‌వైనా, అధికారపార్టీవైనా మాకెంత ఇస్తారు, మీకెన్ని ఓట్లు కావాలనే ఆలోచనతోనే ఉన్నారు. మంచి అభ్యర్థి, మనవాడు, మనకు పనిచేస్తాడనే ఆలోచన ఏ ఒక్కరి దగ్గర లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున పోటీచేసే అభ్యర్థులు కనీసం దాదాపుగా పది కోట్లదాకా ఖర్చు పెట్టేశారని ఆరోఫణలున్నాయి. ఇక రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకుండా ఉండి ఏదైనా పార్టీ తరపును పోటీ చేయాలంటే ఖర్చు మరింత పెరుగుతుంది. అధికారంలో ఉన్ననాళ్లు సంపాదించినా సొమ్ముతో అడ్డూ అదుపూ లేకుండా ఇష్టానుసారంగా ఖర్చుపెడుతారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, ప్రజలకు సేవచేయాలనే ఆలోచన వారు కూడా ఏ పార్టీ నుంచి అవకాశం రాకపోయేసరికి చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఆసక్తికోసం కొంతమంది నామినేషన్‌ వేసి వదిలేసినా మరికొంతమంది మాత్రం డబ్బు ఉందని బరిలో నిలబడటం ఇక్కడ ప్రత్యేకంగా చెపుకొవచ్చు. అధికారం పార్టీ, ప్రతిపక్షపార్టీ నాయకులు మీకు వచ్చే ఓట్లు కొద్దోగొప్పో కావచ్చు కాని మా గెలుపుకు మీరు అడ్డుగా మారతారని ఎంతబతిమాలిడినా వినకుండా బరిలో ఉన్నవారే ఎక్కువ. ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నవారు కూడా పార్టీ నాయకులకు ఏ మాత్రం తీసిపోకుండా కొంతమంది విపరీతంగా ఖర్చుపెట్టేసరికి ప్రత్యర్థుల స్థానంలో ఉన్న చాలామందికి వణుకు మొలయ్యింది. అసలు గెలిచే అవకాశాలే లేవనుకున్న వాళ్లు సైతం ముందు వెనుక చూడకుండా ఖర్చు పెట్టెసారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డ వారిలో ఇలాంటి అభ్యర్థులు చాలా మందే ఉన్నారు. అందులో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఖర్చు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి…

ఖర్చు 2కోట్లు… ఓట్లు… 1284… ఉత్తర తెలంగాణలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న ఒక అభ్యర్థి ఖర్చు అక్షరాలా రెండుకోట్ల రూపాయలు.. తాను పోటీ చేసినా నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏ ప్రైవేట్‌ పంక్షన్‌ జరిగినా అక్కడ ఆయన వాలిపోయేది. ప్రచారంతోపాటు ప్రతి పంక్షన్‌లో భారీగా బహుమతులు కూడా ఇచ్చాడంట. లక్షల విలువైన బహుమతులతో పాటు స్థానికంగా ఉండే యువతకు గ్రామాగ్రామాన క్రికెట్లు కిట్లు పంచడం, తన నియోజకవర్గంలో ఎవరైనా టూర్లకు వెళ్లినా తనే సహాయ చేయడం, పెద్ద ఎత్తున పార్టీలు ఏర్పాటు చేయడం, ఇలా చాలా నానా హంగామా చేశాడు. ఇలా ఆయన ఎన్నికల ఖర్చు రెండు కోట్లకు చేరిందని తన సన్నిహితులు అంటున్నారు. ఇంతా రభస రభస చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు కేవలం 1284 మాత్రమే. తన దగ్గర వేలమంది అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందారు కానీ, వాళ్లందరూ ఆయనకు ఓటు వేయలేదనే తేలిపోయింది. తన తాయిలాలు, తన బహుమతులు తీసుకునేముందు అన్న తనవాడేనని చెప్పినా ఓటర్లు, యువకులు అంతా మోసం చేశారనే ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఇండిపెండెంట్‌గా పోటీచేసినా అభ్యర్థి రెండు కోట్లు ఖర్చుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. తన దగ్గర ఉన్నవి లేనివి అన్ని అమ్మి, ప్రజల్లో వస్తున్న మార్పును చూసి అప్పులు సైతం చేసినట్లు తెలుస్తోంది. నమ్మిన వాళ్లు నట్టేటముంచారని ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని తనవాళ్లు ముందు గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం..

ప్రచారంలో ముందు… ఫలితాలే చివర.. పెద్దపెద్ద చదువులు చదివాడు.. సమాజం కోసం ఏదైనా చెయ్యాలి.. అవినీతిని మార్చాలి.. అందుకు రాజకీయాలే సరియైన వేదికగా భావించి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగాడు వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల నుంచి ఒక అభ్యర్థి.. చదువుకున్నోడు తన మండలంలోనే కాక చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా అంతో ఇంతో పేరుంది. తన స్నేహితులు, తనకు సన్నిహితులు అందరూ ఎన్నికల్లో పోటి చేయ్యాలని చెప్పేసరికి తన మనసులో ఉన్న ప్రధాన కోరిక కావడంతో వెనుకాముందు ఆలోచించుకుండా బరిలో దిగేందుకు సిద్దమయ్యాడు. ఎంత మంచి స్నేహితులైనా, ఎంత దగ్గరివాళ్లైనా కనీస ప్రచారానికి ఖర్చుకావాలి అని తనకు లేకున్నా కొద్దొగొప్పో అప్పుతెచ్చి మరీ ప్రచారంలో దూసుకుపోయాడు. తన వాళ్లు కూడా అంతో కొంత మద్దతు తెలపడంతో అప్పుకు కూడా వెనకాడలేదు. ఇంటింటికి తిరుగుతూ ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వండని పదేపదే చెప్పినా జనాలు ఓకే అన్నట్టే చెప్పేసరికి మనసులో ఎక్కడో గెలుపు అనుమానాలు బలపడ్డాయి. గెలవకున్నా మూడు, నాలుగు స్థానాల్లో ఉంటాననుకున్న అభ్యర్థి చివరి నుంచి మొదటిస్థానంలో ఉన్నాడు. ఫలితాలు చూసేసరికి దిమ్మతిరిగిపోయింది. తనవాళ్లే తనను మోసం చేశారనే బాధతో పాటు అప్పులు చేతికోచ్చాయి.

నిలబడుతున్నారు.. ఓటేయడం మరిచారు.. మన జిల్లాలో మంచిపేరుంది నీకు.. రాజకీయపార్టీల నిన్ను గుర్తుపెట్టుకున్నా,పెట్టుకోకపోయినా ఫర్వాలేదు కాని నువ్వు ఇండిపెండెంట్‌గా నిలబడాల్సిందేనని పట్టుపట్టారు. మిత్రులు మాటలు, మద్దతు విపరీతంగా ఉందని భావించినా అభ్యర్థి పోటీకి సిద్దమయ్యాడు. నామినేషన్‌కే పదివేల రూపాయలు అప్పుతెచ్చి మరీ వేశాడు. చిన్నచితకా ఖర్చులకు వారూ, వీరూ సహాయం చేయడంతో ప్రచారాన్ని ముందుకు కొనసాగింది. తన దగ్గర కూడా ఎంతో కొంత డబ్బులు ఉండాలని తనకున్న ఇరవై,ముప్పైగుంటల వ్యవసాయ పోలాన్ని అమ్మేశాడు. ఏమో అధికారంలో ఉన్న నాయకుల వ్యతిరేకత, తనకున్న పేరు గెలుస్తామోననుకున్నాడు. గడపగడపకు తిరిగాడు. నెలరోజులు తిండి ఉన్నా, లేకున్నా రేయింబవళ్లు తిరుగుతూ ప్రచారం చేశాడు. తీరా ఫలితాలోచ్చాక చూస్తే ఆయనకు వచ్చిన ఓట్లు రెండువందల ఓట్లు. తనవాళ్లే, తన నియోజకవర్గంలో వందల్లో, వేలల్లో ఉంటే తనకు ఈ రెండు వందల ఓట్లు రావడమేమిటని ఆశ్చర్యపోవడం అభ్యర్థివంతయింది. తిండిపెట్టే ఉన్న పోలం పోవడంతో ఇంటినుంచి తిట్లే మిగిలాయి.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన చాలామంది ఇండిపెండెంట్‌ అభ్యర్థుల భవిష్యత్తు ఫలితాలు వెలువడాక ఆగమ్యగోచరంగా మారిపోయింది. ముందు ఊహంచినది ఒకటైతే, ఫలితాలు వచ్చాక మరోకటి ఉండడంతో తలపట్టుకోవడమే తప్ప ఇంకా చేసేదేమి లేక, వారి బాధను ఎవరికి చెప్పుకోలేక మౌనముద్రలోకి వెళ్లిపోతున్నారు. రాజకీయం అంటే ఇంత వ్యాపారమయి పోయిందని, తన వెంట ఉంటూ, తన తిండి తింటూ, తనకే ఓటు వేయలేదని బాధతో కుమిలిపోవడం తప్ప ఇంకేమి చేయలేమని మదనపడుతున్నారు. నీతిగా, నిజాయితీగా పనిచేస్తామంటే ఒక్కరంటే ఒక్కరూ కూడా నమ్మడం లేదని స్వతంత్ర అభ్యర్థులు అంటున్నారు. డబ్బులు తీస్కో, నచ్చిన వాడికి ఓటేస్కో అనే సిద్దాంతాన్ని ఓటర్లు ఫాలో అయిపోయినట్లున్నారు. డబ్బులు పెట్టి ఓట్లు కొనెయోచ్చని నమ్మేవాళ్లకు ఈ ఫలితం చెంపపెట్టు లాంటి సమాధానం అనడంలో ఏలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here