తెలంగాణ తెదేపా అధ్యక్షుడు రమణతో ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ

0

నిరంకుశ పాలన అంతం.!
★ సంకెళ్లు తెగుతాయి
★ యూనివర్సిటీలలో కాలుపెట్టలేని దుస్థితిలో కేసీఆర్
★ ప్రజల కోసమే కూటమి

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)

“బలిదానాలతో వచ్చిన తెలంగాణకు భవిష్యత్తు లేకుండా కేసిఆర్ నాశనం చేసిండు. ధనిక రాష్ట్రాన్ని అప్పులతో కోలుకోకుండా ఆగమాగం చేసిండు. కుటుంబం కోసం బరితెగించి భ్రష్టు పట్టించిండు… తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేసిండి.” అంటూ కేసీఆర్ పై తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు ఎల్.రమణ నిప్పులు చెరిగారు. ఆయనతో ఆదాబ్ హైదరాబాద్ జరిపిన ముఖాముఖి.

◆ ఆత్మగౌరవంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జతకట్టడంపై మీ అభిప్రాయం.?

● తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజా విలువలకే, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతుంది. కాంగ్రెసును నాడు వ్యతిరేకించినా, నేడు ముందుకు సాగుతున్నా.. మా లక్ష్యం ఒక్కటే ప్రజాశ్రేయస్సు.

◆ ముందస్తు ఎన్నికల సంసిద్ధత ఎలా ఉంది.?

● ప్రభుత్వం నడపడం చేతగాక అసెంబ్లీ రద్దు చేశాడు. నాలుగేళ్ళకే చేతులు ఎత్తేశాడు. కాడి పడేసిండు. కూటమిలో ఉన్న వారంతా ఐదేళ్ళు నడపగలిగే సత్తా ఉన్నవాళ్ళే. తెలంగాణలో కొనసాగిన నిర్భంధాలకు, అక్రమ అరెస్టులకు కాలం చెల్లింది. యాభై రోజుల్లో వంద సభలన్నాడు. నాలుగు సభలతో పరిస్థితి అర్థమైంది. ఊళ్ళల్లో వాళ్ళ అభ్యర్థులకు ఎదురౌవుతున్న నిలదీతలతో నీరసించాడు కేసీఆర్. గెలుపు ప్రజలు మెచ్చిన కూటమిదే.

◆ కూటమి గెలిస్తే… పదవుల పంపకాల గురించి చర్చించారా..?

● అలాంటిదే లేదు. మాకు సీట్లు, పదవులు ముఖ్యం కాదు. ప్రజలు వ్యతిరేకిస్తున్న కుటుంబాన్ని దించి సురిక్షిత పాలన అందిచటమే లక్ష్యంగా అందరం కలసి పనిచేస్తున్నాం.

◆ చాలాకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఏం సంపాదించినట్లు లేదు.
● విద్యార్థి జీవితం నుంచి రాజకీయాల్లో ఉన్నా. నిస్వార్థంగా ఉండటంతో తెలంగాణ అధ్యక్షత పదవి వచ్చింది. ఇకముందు కూడా అలాగే ఉంటా.

◆ నాడు ‘నాదెండ్ల పోటు’కు సహకరించిన
కాంగ్రెస్ తో… ఇప్పుడు ఎలా ముందుకు..? ముక్కుసూటిగా చెప్పండి.

● అప్పుడు.. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడింది. నాడే విజేతగా నిలిచింది. నేడు విజేతగా నిలబడబోతోంది.

◆ ప్రజల్లో ‘తెరాస’పై అంత వ్యతిరేకత వచ్చిందని ఎలా నిర్థారణకు వచ్చారు.?

● ‘నేరడ’ చూడండి. ఖమ్మంలో రైతులకు సంకెళ్ళు, నల్గొండలో జర్నలిస్టుల అక్ర అరెస్టులు.. నిర్భంధాలు, ప్రజలు నోరు విప్పితే ఏం జరుగుతోందని అంతర్గత భయాందోళనలు, ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, అంత ఎందుకు అన్నా.. ఏ విద్యార్థుల ఆత్మ త్యాగాలతో తెలంగాణ వచ్చిందో… ఆ విద్యార్థులకు దక్కిందేమిటి..? ఉద్దరించానని చెపుతూ.. హెలికాఫ్టర్ లలో చక్కెర్లు కొడుతున్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఏ యూనివర్సిటీలో నైనా అడుగు పెట్టారా.? ఏం మొఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరకు ఎలతారు. వాళ్ళ ఉసురు తగిలి ముందస్తుకు వచ్చి బొక్కబోర్లా పడ్డాడు.

◆ చాడా, కోదండరాం, రచనారెడ్డి ల పరిస్థితి ఏమిటి.?

● వారికి ముందే చెప్పాం. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకున్నా వారి పెద్దరికాన్ని గౌరవిస్తాం. సముచిత స్థానం అందిస్తాం.

◆ దక్షిణ భారతంలో కమ్యూనిస్టులు ఎక్కడా ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాలేదు కదా..?

● అవును అది నిజమే.. అయితే జాతీయ రాజకీయాలలోనూ.. ప్రభుత్వం ఏర్పాటులో వారి పాత్ర మరువలేనిది.

◆ కౌలు రైతులకు ఏదైనా..?

● తప్పకుండా అన్నా.. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వారందరికీ… అంటే బడుగు, బలహీన, విద్యార్థి, ఉద్యోగుల, రైతులు , కౌలు రైతుల, గిట్టుబాటు ధరలపై ప్రత్యేక కసరత్తు తుది దశలో ఉంది.

◆ ఈ ప్రభుత్వం గుట్టుగా వేలాది జీఓలు విడుదల చేసిందనే దానిపై మీ అభిప్రాయం..?

● ఇదో కనిపించని కుంభకోణం. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా భూసేకరణ విషయాలలో తెలుగుదేశం, దాని భాగస్వామ్య పక్షాలు పోరాడాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని విషయాలను ప్రజల ముందు పెడతాం.

◆ మీ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ముందుగా ‘తెరాస’ పొత్తులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఒకవేళ మీరు ‘తెరాస’తో ఎన్నికల బరిలోకి వెళితే .. పైన చేసిన విమర్శలు బహిరంగ సభలలో చేసే వారా..?

● గతంలోనూ… ఇప్పుడూ.. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం ఎవరితో కలసినా ఉమ్మడి కార్యక్రమంలో అన్ని విషయాలు చర్చిస్తాం. తప్పులు సరిద్దుకున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తే.. తెలుగుదేశం వారితో కలవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంతిమంగా ప్రజలు ఉంటారు కదా..!

◆ చివరిగా… (ఆఫ్ ద రికార్డు) అన్నా… కూటమి గెలిస్తే.. మీకు ఎలాంటి పదవి..?
( ప్రశ్న పూర్తి కాకుండానే
కట్ చేస్తూ…)

● ఆఫ్ ది రికార్డు.. ఆన్ ద రికార్డు అంటూ ఏం లేదు. ఉన్నది ఒకటే లక్ష్యం. ప్రజాస్వామ్యంలో
గడీల పాలనను పాతరేయేడమే.

రమణతో సెలవు తీసుకుంటుండగా… అన్నా.. “ఈరోజు మా అమ్మ సంవత్సరికం. కొంచెం అన్నం తిని పోండి. మా ఇంటోళ్ళు ఎదురు చూస్తున్నారు..” అంటూ.. కార్యకర్తలు, అక్కడి నాయకులను భోజనాలకు తీసుకెళ్ళారు. అనంతరం ‘ఆదాబ్ హైదరాబాద్’ సెలవు తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here