FeaturedInterviewsరాజకీయ వార్తలు

కూటమి గెలుపు ఖాయం

తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు ఎల్‌.రమణతో ‘అదాబ్‌ హైదరాబాద్‌’ ప్రత్యేక ఇంటర్వ్యూ

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

కూటమి అభ్యర్థులతో పార్టీ సమన్వయం ఎలా ఉంది.?

మేం అనుకున్న దానికన్నా అద్భుతంగా ఉంది. స్థానిక నాయకత్వాలను సమన్వయం చేస్తున్నాం. కార్యకర్తలు విజయోత్సాహంతో పనిచేస్తున్నారు.

నామినేషన్ల సమయంలో కొన్ని ప్రాంతాలలో అలకలు, రెబల్స్‌ ఉండటం జరిగింది కదా..?

అవును. టికెట్‌ ఆశావహులు సహజంగా కొంత అసహనానికి లోనైన మాట నిజం. అందరితో మాట్లాడుతున్నాం.

టైం తక్కువగా ఉంది కదా.. అందరూ కలసి ప్రచారం చేసే అవకాశం ఉందా..?

నామినేషన్ల సమయంలో అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. ఈ స్పందనతోనే మా విజయం ఖరారైంది.

కూటమిలో సమస్యలకు పరిష్కారం ఎప్పుడు.?

అక్కడక్కడ సంస్థాగత సమస్యలున్నాయి. వచ్చే రెండుమూడు రోజులలో అవి సర్దుకుంటాయి.

కూటమితో పాటు అన్ని ప్రధాన పార్టీలలోనూ అభ్యర్థులు కోటీశ్వరులే… లాభం కోసమే రాజకీయాలా..?

గతంలో ఉన్న పరిస్థితులు వేరు. ఓ సెక్టార్‌ లో పరిమితంగా రాజకీయాలు, నాయకులు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వివిధ రంగాల ప్రముఖులు, ఆర్థిక స్థితిమంతులు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ రాజకీయ చైతన్యానికి తెలుగుదేశమే కారణం. ఇది జగమెరిగిన సత్యం.

కాంగ్రెసు వారు కూటమి నిబంధనలకు విరుద్ధంగా అదనంగా అభ్యర్థులను రంగంలోకి దించించారు కదా..?

ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఈ సమస్య వచ్చిపడింది. పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి.

ఖమ్మం సిట్టింగ్‌ సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించడం వెనుక ఎదో కథ ఉందనే ఆరోపణలు ఉన్నాయి.?

హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలలో తిరుగులేని బలం ఉంది. అయితే సవిూకరణాల రీత్యా మేం ఆరుకే పరిమితం అయ్యాము. అందులో భాగంగా ఖమ్మం సర్దుబాటు జరిగింది. అంతే తప్ప మరొకటి కాదు. అయినా పెద్దక్క రేణుకాచౌదరి ఉంది కదా.! ఆమె ఓ చుట్టు చుడితే అన్నీ పరిష్కారం అవుతాయి. భట్టి కూడా కష్టపడుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా స్టార్‌ క్యాంపెయినర్‌ గా రేణుక అక్కకు సముచితమైన స్థానం ఇచ్చింది. ఖమ్మంలో పది స్థానాలూ కూటమి వే.! అందులో సందేహం లేదు. అందరూ కలసి ముందుకు సాగుతాం.

వరంగల్‌ పరిస్థితి..?

అక్కడ కూడా పరిస్థితి చక్కదిద్దాం. స్నేహపూర్వక పోటీలు ఉండవు. కూటమి అభ్యర్థుల విజయమే అంతిమ లక్ష్యం.

కూకట్‌ పల్లి సీటు సుహాసినికి ఇవ్వడంపై అభిప్రాయం.?

అన్నగారి కుటుంబం నుంచి మరొకరు రావడం , అదీ ఓ మహిళ కావడం ఆనందంగా ఉంది. అక్కడి అభ్యర్థులు కూడా ఆమె రాకను స్వాగతించారు. ఆమె గెలుపు ముఖ్యం కాదు. తెలంగాణలో అన్న ఎన్టీఆర్‌ పై అభిమానంతో ప్రజలు ఎంత మెజారిటీతో గెలిపిస్తారోనని యావత్‌ దేశం ఎదురుచూస్తోంది.

భాజపాలో ఉన్న పురంధరేశ్వరి కూడా సుహాసిని తరపున ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి.?

అన్నగారి కుటుంబ సభ్యులంటే మాకు గౌరవం. అభిమానం. వారు ప్రచారానికి వస్తే మాకు ఆనందం. సుహాసిని అంటే పురంధేశ్వరమ్మకు ఎంతో ఇష్టం.

చంద్రబాబు ప్రచారాన్ని అడ్డుకుంటామని కొందరు చెపుతున్నారు..?

తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరవలేనిది. ఆయన తెలంగాణ అభివృద్ధి విషయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నారు. ఆయన రాహుల్‌ గాంధీతో సభలలో పాల్గొంటారు. ఆయనకు అభివృద్ధి అంటే ఎంతో ఇష్టం. రేపటి తెలంగాణ అభివృద్ధికి ఆయన మా వెన్నంటి ఉండి కృషి చేస్తారు.

కూటమి ప్రచారాలకు సినీతారలు వస్తున్నారని తెలిసింది.?

అవును. తెలుగుదేశం పార్టీ అభిమానులలో ఎంతోమంది సినీ ప్రముఖులు ఉన్నారు. వారందరూ వీలు చేసుకొని వస్తారు.

ఉమ్మడి మ్యానిఫెస్టో ఎప్పుడు.?

అంతా రెడీగా ఉంది. ఉమ్మడి లక్ష్యం ఒకటే నిరంకుశ పాలన అంతం. అదే ప్రజలు భావిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా రంగలో ఉన్న ఖైరతాబాద్‌ కాంగ్రేస్‌ క్యాండిడేట్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌. ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనానికి వచ్చారు. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సెలవుతీసుకుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close