నేటినుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. నిమిషం నిబంధన అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 9 గంటలకే పరీక్షలు ప్రారంభం కానుండగా.. గంట ముందు నుంచి కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. తొలిరోజున ప్రథమ సంవత్సర పరీక్షలు ఉంటాయి. భవిష్యత్తుకు దిక్సూచిగా చెప్పుకునే ఇంటర్‌ పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. పరీక్షల కోసం కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. ఆ కేంద్రాల్లో విద్యార్థులకు సౌకర్యాల పరంగా ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. 8 గంటల నుంచి లోనికి అనుమతించనున్నారు. తొమ్మిది గంటల తర్వాత నిమిషం ఆలస్యమైన విద్యార్థులను లోనికి అనుమతించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సమయాని కంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్యాడు, హాల్‌టికెట్‌, పెన్నులు, పెన్సిల్లు మినహా ఇతర ఎలక్టాన్రిక్‌ పరికరాలను తీసుకరావద్దని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా, మరే సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు జిల్లా మాధ్యమిక అధికారి కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. చూచిరాతలకు ఆస్కారం ఇవ్వకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమేరాలను బిగించారు. అదేవిధంగా సిట్టింగ్‌ స్వ్కాడ్‌బృందాలతో పాటు మరో రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌లు ఆ కేంద్రాల్లో కూర్చొని చూచిరాతలకు జరగకుండా చూస్తారు. ఆకస్మిక తనిఖీలతో కేంద్రాల్లో చూచిరాతలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. విద్యార్థులు సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. 9గంటలు దాటిన తర్వాత కేంద్రంలోకి అనుమతించరనే విషయాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here