Featuredస్టేట్ న్యూస్

ఆసక్తికరంగా ఐదో విడత పోరు

  • అమేఠీలో నువ్వా.. నేనా!
  • ఆరో విడత అభ్యర్ధుల్లో సగం నేరచరితులే..
  • ఒకరు మాజీ ఐఏఎస్‌.. మరొకరు మాజీ ఐపీఎస్‌

దేశవ్యాప్తంగా ‘సార్వత్రిక’ సమరం చివరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో 373 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. చివరి మూడు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సోమవారం ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌ 12, మధ్యప్రదేశ్‌ 7, పశ్చిమ బెంగాల్‌ 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌ 4, జమ్ముకశ్మీర్‌లో 2 చోట్ల సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఈ 51 లోక్‌సభ స్థానాల్లో కొన్ని చోట్ల ¬రా¬రీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ దశలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌, జయంత్‌ సిన్హా, నిరంజన్‌ జ్యోతితో పాటు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర ప్రముఖుల భవితవ్యం తేలనుంది. ఆయా నేతలు పోటీ చేసే స్థానాలు.. అక్కడి పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): లోక్‌సభ ఐదో దశ ఎన్నికలకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు, రాజస్తాన్‌లో 12, పశ్చిమబెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, కశ్మీర్‌లోని 2 స్థానాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. మొత్తం 51 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 6వ తేదీన జరగనున్న పోలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే వారిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌, స్మృతి ఇరానీ, జయంత్‌ సిన్హా, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ తదితరులున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారంపై ఫొని తుపాను ప్రభావం పడింది. వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని పొరుగునే ఉన్న ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇలా ఉండగా, బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా భూమిపై హక్కు కోసం వీరోచితంగా పోరాడిన, గిరిజనులు దైవంగా భావించే బిర్సా ముండా జన్మించిన జార్ఖండ్‌లో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్ర రాజధాని రాంచీకి 50 కిలోవిూటర్ల దూరంలోని మావోయిస్టుల ప్రభావిత ఖుంతి జిల్లాలో 100కు పైగా గిరిజన గ్రామ పంచాయతీల ప్రజలు ఈ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తామే పాలకులమనీ, తమ గ్రామాల్లోకి ఎవరినీ అనుమతించబోమంటూ తీర్మానించారు. తమను గురించి కనీసం పట్టించుకోని నేతలతో పని లేదని వీరు వాదిస్తున్నారు.

రాజ్‌నాథ్‌పై శతృఘ్న సతీమణి పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీలక నియోజకవర్గాల్లో లఖ్‌నవూ ఒకటి. 1991 నుంచి మాజీ ప్రధాని, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. 2004 ఎన్నికల వరకూ వరుసగా ఐదుసార్లు ఆయనే గెలుపొందారు. అనంతరం అనారోగ్య కారణాలతో వాజ్‌పేయీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా లాల్జీ టాండన్‌ అక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో ప్రస్తుత కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బరిలోకి దిగి గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై ఆయన 2.8లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2009లో ఘజియాబాద్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన రాజ్‌నాథ్‌.. తాజా ఎన్నికల్లో మళ్లీ లఖ్‌నవూ నుంచే పోటీ చేస్తున్నారు. బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్డీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ఎస్పీ దక్కించుకుంది. ఇటీవలే పార్టీలో చేరిన పూనమ్‌ సిన్హా (శతృఘ్న సిన్హా సతీమణి)కు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) టికెట్‌ కేటాయించింది. లఖ్‌నవూ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో కాయస్థ, సింధీ ఓటర్లు ఉన్నారు. పూనం సింధీ సామాజిక వర్గానికి.. ఆమె భర్త శతృఘ్నసిన్హా కాయస్థ సామాజిక వర్గానికి చెందిన వారు. లఖ్‌నవూలో 4 లక్షలకు పైగా కాయస్థలు, 1.30 లక్షల సింధీ ఓటర్లు ఉన్నారు. వీరికి తోడు 3.5 లక్షల ఓటు బ్యాంకు ఉన్న ముస్లింలు కూడా తమకే మద్దతు తెలుపుతారని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా సంభల్‌ కల్కీ పీఠం అధిపతి ప్రమోద్‌ కృష్ణం పోటీకి దిగారు. అయితే ప్రధాన ప్రత్యర్థులు పూనమ్‌ సిన్హా, ప్రమోద్‌ కృష్ణం ఇద్దరూ స్థానికేతరులు కావడంతో విజయం తమదేనని భాజపా శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

రాయబరేలీలో సోనియా విజయం లాంఛనమేనా!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. 1999 ఎన్నికల నుంచి యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి వరకు సోనియా కుటుంబానికి విధేయుడిగా ఉన్న దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ను ఇక్కడ భాజపా తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న దినేశ్‌.. ప్రియాంకా గాంధీకి సలహాదారుడిగానూ పనిచేశారు. అలాంటి వ్యక్తిని భాజపా తమ వైపు ఆకర్షించడంలో సఫలీకృతమైంది. గత ఏడాదే ఆయన కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరారు. ఈ క్రమంలోనే ఆయన్ను సోనియాపై అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం రాయబరేలీలో చేసిన అభివృద్ధిపైనే భాజపా ఆశలు పెట్టుకుంది. అనారోగ్య కారణాలతో సోనియా తన సొంత నియోజకవర్గానికి రాకపోవడంపై స్థానికుల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ యూపీఏ హయాంలో చేసిన అభివృద్ధి తమను సునాయాసంగా విజయతీరాలకు చేరుస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. 1999 నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తుండటం తదితర కారణాలతో సోనియా విజయం లాంఛనమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకరు మాజీ ఐఏఎస్‌.. మరొకరు మాజీ ఐపీఎస్‌

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఆసక్తికర పోరు జరుగుతోంది. సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ భాజపా అభ్యర్థిగా మరోసారి బరిలో ఉండగా.. అతనికి వరుసకు సోదరుడైన మదన్‌గోపాల్‌ మేఘ్వాల్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరూ అఖిల భారత సర్వీసులకు చెందిన మాజీ అధికారులు కావడం విశేషం. అర్జున్‌రామ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కాగా.. మదన్‌ గోపాల్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో ఇక్కడ భారీగా ఓట్లు చీలే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇతర వర్గాల వారు వేసే ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. దీంతో పాటు అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌కు సీనియర్‌ నేత, ఏడుసార్లు ఎమ్మెల్యేగా దేవీ సింగ్‌ బాటి రూపంలో మరో ప్రతిబంధకం ఎదురవుతోంది. స్థానికంగా జరిగిన పరిణామాలతో ఆయన భాజపా నుంచి వైదొలిగి అర్జున్‌రామ్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ప్రజల్లో కులతత్వాన్ని రెచ్చగొట్టి విభజించు పాలించు అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈస్థానంలో సీపీఐ నుంచి షోపత్‌రామ్‌ బరిలో నిలిచినా ప్రధాన పొటీ మాత్రం భాజపా-కాంగ్రెస్‌ మధ్యే జరగనుంది.

అమేఠీలో నువ్వా.. నేనా!

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన నియోజకవర్గాల్లో అమేఠీ ఒకటి. యూపీలోని ఈ నియోజకవర్గం ఎప్పటి నుంచో కాంగ్రెస్‌కు కంచుకోట. 2004 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆయనే బరిలో ఉండగా.. రెండోసారి ఆయనకు ప్రత్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆ పార్టీ అభ్యర్థిగా భాజపా నిలబెట్టింది. గత ఎన్నికల్లో స్మృతి ఓటమి పాలయినప్పటికీ ఈసారి పోరు నువ్వా-నేనా అన్నట్టు సాగే అవకాశముంది. ఇన్నేళ్లలో రాహుల్‌ సొంత నియోజకవర్గానికి చేసిందేవిూ లేదంటూ స్మృతి తన ప్రచారంలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయిదేళ్ల క్రితం నుంచే కమలనాథులు ఒక వ్యూహం ప్రకారం అక్కడ పావులు కదుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులూ అమేఠీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరోవైపు అమేఠీకి, కాంగ్రెస్‌కు మధ్య నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి రెండుసార్లు మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులే అక్కడ నెగ్గుతూ వచ్చారు. గతసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కనిపించినా కాంగ్రెస్‌ మాత్రం ఈ కోటను నిలబెట్టుకోగలిగింది. అక్కడి నుంచి ఎంపీలైనవారిలో గాంధీల కుటుంబం నుంచి సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఉన్నారు. రాహుల్‌ వరుసగా మూడుసార్లు నెగ్గారు. గత ఎన్నికల్లో (2014) ఆయనకు వచ్చిన ఓట్లు, ఆధిక్యం కూడా తగ్గడాన్ని భాజపా గుర్తు చేస్తూ దానినే స్ఫూర్తిగా తీసుకుని మరోసారి స్మృతి ఇరానీనే బరిలో దించింది. గతసారి ఓడిపోయిన తర్వాతా ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఎలాగైనా రాహుల్‌ను ఓడించాలనే కృతనిశ్చయంతో భాజపా ఉండగా.. యూపీఏ హయాంలో అమేఠీలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది.

కోడెర్మాలో పట్టం కట్టేదెవరికి?

ఝార్ఖండ్‌లోని కోడెర్మా స్థానంలో పోరు ఉత్కంఠగా సాగే అవకాశముంది. భాజపాను గద్దె దింపాలనే లక్ష్యంతో ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌-జేఎంఎం-జేవీఎం కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ కూటమి నుంచి మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా(జేవీఎం) అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రవీంద్రకుమార్‌ రాయ్‌కు భాజపా ఈసారి టికెట్‌ నిరాకరించింది. ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి అన్నపూర్ణాదేవిని పోటీకి దించింది. గతంలో రవీంద్రకుమార్‌ రాయ్‌పై ఓటమిపాలైన రాజ్‌కుమార్‌ యాదవ్‌ సీపీఐ తరఫున మళ్లీ పోటీ చేస్తున్నారు. 2006 వరకు భాజపాలో ఉన్న బాబూలాల్‌ మరాండీ ఆ తర్వాత వైదొలిగి కొత్త పార్టీ స్థాపించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో జేవీఎం పార్టీ తరఫున బరిలో దిగి గెలుపొందగా.. 2014లో మాత్రం ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయం కోసం శ్రమించారు.

హజారీబాగ్‌ మళ్లీ జయంత్‌దేనా!

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున కేంద్రమంత్రి జయంత్‌సిన్హా మరోసారి బరిలో నిలిచారు. ఆయన 2014లో తొలిసారి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సౌరభ్‌ నారాయణ్‌ సింగ్‌ను భారీ మెజారిటీతో ఓడించారు. కాంగ్రెస్‌ కొత్త అభ్యర్థి గోపాల్‌ సాహూను పోటీకి దించింది. 2009లో భాజపా తరఫున జయంత్‌ తండ్రి యశ్వంత్‌ సిన్హా ఇక్కడ నుంచి గెలిచారు. సీపీఐ భువనేశ్వర్‌ ప్రసాద్‌ మెహతాను పోటీకి నిలిపింది. ప్రధాని మోదీ నాయకత్వంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని జయంత్‌ ధీమాగా చెబుతున్నారు.

ఒలింపియన్ల పోరు.. ప్రజల తీర్పు ఎటువైపో!

రాజస్థాన్‌లోని జైపూర్‌ రూరల్‌లో పోటీ ఆసక్తిరేపుతోంది. ఇక్కడ ఇద్దరు ఒలింపియన్ల మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. భాజపా నుంచి కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌ బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కృష్ణ పూనియా పోటీలో ఉన్నారు. రాజ్యవర్ధన్‌ 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2002 మాంచెస్టర్‌లో, 2006 మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకాల్ని గెలిచారు. ఈయనపై పోటీకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ పూనియా… భారత మహిళా ట్రాక్‌, ఫీల్డ్‌ అథ్లెట్‌. 36 ఏళ్ల పూనియా 2010 దిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకాన్ని పొందారు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2004, 2008, 2012 ఒలింపిక్‌ క్రీడల్లో ఆమె భారత్‌ తరఫున పాల్గొన్నారు. 2013లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. అదే ఏడాది జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున చురు జిల్లా సదుల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు. ఈ నేపథ్యంలో రాజ్యవర్ధన్‌కు దీటైన ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. కృష్ణ పూనియాను ఆయనపై పోటీకి దించింది. పునియాకు జాట్‌, మాలి, ముస్లిం, యాదవుల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో పునియా గెలుపుపై కాంగ్రెస్‌ నేతల్లో ధీమా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఫతేపుర్‌లో బీఎస్పీ అంచనాలు నిజమవుతాయా?

యూపీలోని ఫతేపుర్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి నిరంజన్‌జ్యోతి భాజపా తరఫున వరసగా రెండోసారి బరిలో నిలిచారు. ఎస్పీ-బీఎస్పీ- ఆర్‌ఎల్డీ కూటమి అభ్యర్థిగా బీఎస్పీ అభ్యర్థి సుఖ్‌దేవ్‌ ప్రసాద్‌ తలపడుతున్నారు. ఎస్పీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన రాకేష్‌ సచన్‌ చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి హస్తం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ నుంచి మహేశ్‌ చంద్ర సాహు బరిలో ఉన్నారు. నిరంజన్‌ జ్యోతి గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ సిద్దిఖీపై లక్షా 87వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న మైనార్టీలు (2.60 లక్షలు), ఎస్సీలు (4 లక్షలు) తమకు అండగా నిలుస్తారని బీఎస్పీ భావిస్తోంది.

ఆరో విడత అభ్యర్ధుల్లో సగం నేరచరితులే..

లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ బరిలో ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో దాదాపు సగం మంది అభ్యర్ధులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల్లో బీజేపీ 48 శాతం మంది నేర చరితులకు టికెట్లు ఇవ్వగా, కాంగ్రెస్‌ 44 శాతం మంది క్రిమినల్‌ కేసులు నమోదైన వారిని అభ్యర్ధులుగా బరిలో దింపింది. ఇక ఆరో? విడత పోలింగ్‌ బరిలో నిలిచిన 967 మంది అభ్యర్ధుల్లో 20 శాతం మంది అభ్యర్ధులపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) విశ్లేషణలో వెల్లడైంది. ఇక 54 మంది బీజేపీ అభ్యర్ధుల్లో 26 మందిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉండగా, 46 మంది కాంగ్రెస్‌ అభ్యర్ధుల్లో 20 మంది నేరచరితులే కావడం గమనార్హం. బీఎస్పీ తరపున బరిలో ఉన్న 49 మంది అభ్యర్ధుల్లో 19 మందిపై, 307 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్ధుల్లో 34 మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ప్రకటించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close