Featuredరాజకీయ వార్తలు

లోక్‌సభ స్థానాలపై టిఆర్‌ఎస్‌లో ఆసక్తి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

కొందరు ఎంపిలు ఇప్పుడు ఎంపిలుగా ఎన్నికయ్యారు. మరికొందరు రాష్ట్రం వైపు ఆసక్తిగా ఉన్నారు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. దీంతో అక్కడా పోటీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. తాజాగా టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎంపీల్లో ఇద్దరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆ రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. మేడ్చెల్‌ ఎంపి మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నియ్యారు. అలాగే ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన ముగ్గురు ఎంపీలకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల పరిస్థితులకు అనుగుణంగా పలు స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 2, 3 మార్పులు చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ లోక్‌సభ స్థానాల్లో కొత్త వారిని బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లోక్‌సభ స్థానంలో తుమ్మల నాగేశ్వర్‌రావుకు అవకాశం ఇచ్చే విషయాన్ని టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. నల్లగొండ ఎంపీ సుఖేందర్‌రెడ్డికి ఇప్పటికే రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర స్థాయిలో మరేదైనా బాధ్యత అప్పగిస్తే ఈ సెగ్మెంట్‌లోనూ మార్పు ఉండనుంది. ఆయనకూడా ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి పదవి చేపట్టాలని చూస్తున్నారు. అదే జరిగితే పమాజీ వ్యవసాయ శాఖ మంత్రికి రైతు సమన్వయ సమితి బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ ఎంపీగా గెలిచిన బాల్క సుమన్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు స్థానం నుంచి గెలవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేకానందకు టీఆర్‌ఎస్‌ అవకాశం ఇవ్వాలని కెసిఆర్‌ భావిస్తున్నారు. ఆయన కోసమే సుమన్‌ను అసెంబ్లీకి ఎంపిక చేశారని సమాచారం. చేవేళ్లలో టీఆర్‌ఎస్‌ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఈ స్థానంలో గెలుపును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ సీటుపై గట్టి పట్టున్న మాజీ మంత్రి, తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన పట్నం మహేందర్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌కు గెలుపు దక్కడంలేదు. 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేసిన ఆరు లోక్‌సభ స్థానాల్లో ఐదు చోట్ల గెలిచింది. సాంకేతిక కారణాలతో పార్టీ గుర్తు రాకపోవడంతో నాగర్‌కర్నూల్‌లో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లోనూ నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మాజీ మంత్రి పి. రాములు, మాజీ ఎంపీ మందా జగన్నాథంలో ఒకరికి టీఆర్‌ఎస్‌ అవకాశం ఇవ్వనుంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఈసారి కచ్చితంగా గెలవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఆరు చోట్ల, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యం నిలుపుకున్నాయి. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థిని బరిలో నిలిపితే గెలుపు కచ్చితంగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున తూమ్‌ భీంసేన్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఎవరో ప్రజలకు పెద్దగా తెలియకపోవడంతో అలా జిరగిందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు దండె విఠల్‌, బొంతు శ్రీదేవి యాదవ్‌, తలసాని సాయి యాదవ్‌ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మల్లారెడ్డి గెలిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవలే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మల్కాజిగిరి ఎంపీ సీటును ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా కొన్నిచోట్ల మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. కడియం శ్రీహరిని మళ్లీ లోక్‌సభకు పంపే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తోంది. ఆదిలాబాద్‌లో గోడం నగేశ్‌ పోటీ చేస్తారా లేదా అన్నది చూడాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close