ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం..

0

  • గ్లోబరీనాతో పాటు మరో స్వతంత్ర ఏజెన్సీ

హైదరాబాద్‌ : ఇంటర్‌ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న తీవ్ర గందరగోళం నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం నిర్ణయం తీసుకుంది. గ్లోబరీనా సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో సమాధాన పత్రాల రీ-వెరిఫికేషన్‌, ఫలితాల ప్రాసెసింగ్‌ ప్రక్రియను గ్లోబరీనాతో పాటు సమాతరంగా మరో స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం మరో ఏజెన్సీని ఎంపిక చేసే బాధ్యతను తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్టీఎస్‌)కు అప్పగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. త్రిసభ్య కమిటీ సూచనల మేరకు మరో ఏజెన్సీని కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. మరోసారి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టిన విద్యాశాఖ రెండు సంస్థలు కలిసి రీవాల్యుయేషన్‌ ప్రాసెస్‌ చేసేలా నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన సుమారు మూడున్నర లక్షల మంది విద్యార్థులకు చెందిన దాదాపు ఎనిమిది లక్షల జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల వెల్లడికి అవసరమైన సాంకేతిక ప్రాసెసింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే గ్లోబరీనా సాఫ్ట్‌వేర్‌లో లోపాల వల్ల మళ్లీ తప్పులు జరిగే అవకాశముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్లోబరీనాతో పాటు మరో స్వతంత్ర ఏజెన్సీకి అప్పగించాలని త్రిసభ్య కమిటీ కూడా సూచించడంతో ఇంటర్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here