పంచాయతీలో వినూత్నం..

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)

మూడెంచెల పంచాయతీ ఎన్నికల్లో తెరాస బలపర్చిన అభ్యర్థులు మెజారిటీ స్థాయిలో గెలుపొందారు. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ ఎన్నికల్లో కారుతో పాటు ఇతర పార్టీలకు దక్కని అరుదైన విజయాలను మాత్రం ఎలాంటి సత్తా లేని లోక్ సత్తా, సైన్యం లేని జనసేన గెలుపొందాయి. జయప్రకాష్ నారాయణ, పవన్ కళ్యాణ్ ల ప్రమేయం లేకుండా అవి విజయకేతనం ఎగురవేశాయి. ఎలా అంటారా…? ఈ కథనం చదవండి.

ఇదీ నిబంధనలు:
పల్లెపోరులో రాజకీయాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాలని, ఆ యా ఎన్నికల పార్టీల గుర్తులు సైతం ఉండకూడదని ఎన్నికల కమిషన్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు కూడా లెక్క ప్రకారం ఆపార్టీ అధికార అభ్యర్థులు కారు.మొదటి విడతలో 4,135, రెండో విడతలో మొత్తం 4,135 పంచాయతీలకు, మూడో విడతలో మొత్తం 3,529 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 7,731 సర్పంచి స్థానాల్లో తెరాస మద్దతుదారుల గెలుపు
61 శాతం పంచాయతీల్లో వారిదే ఏలుబడి.
22 శాతం స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ వర్గీయులు. మిగిలినవి ఎర్రపార్టీలు, కాషాయదళం, స్వతంత్రులు గెలుపొందారు.

లోక్ సత్తా, జనసేనలు ఎలా గెలిచాయి..?:
లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, జనసేన పవన్ కల్యాణ్ చేయలేని, సాధించలేని విజయాలు ఎట్టకేలకు ఆ పార్టీకి కేటాయించిన ‘ఫ్రీ’ సింబల్స్ సాధించాయి. ఈ విషయం ఆ పార్టీలు ఇప్పటికీ గుర్తించలేదు. ఫ్రీ సింబల్స్ లో లోక్ సత్తా విజిల్ (ఈల), జనసేన కు ఇటీవలే ఎన్నికల కమిషన్ కేటాయించిన గాజు గ్లాస్ గుర్తులను తెలంగాణ ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ గా గుర్తించి కేటాయించింది. అంటే గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా ఈ ‘ఫ్రీ’ సింబల్స్ ఎన్నుకోవలసి వచ్చింది. మెజారిటీ అభ్యర్థులు ఈ గుర్తులపై గెలవడం విశేషం.
తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన లోక్ సత్తా, జనసేనలకు ఆ యా పార్టీల ‘గుర్తు’ గెలుపు ఓ విధంగా… త్రిశంకు విజయం ఆవిరి లాంటి ఆనందం.

పంచాయతీరాజ్‌ నూతన చట్టంలో అంశాలివీ..

నూతన పంచాయతీరాజ్‌ చట్టం గ్రామ పాలనపై నిర్దిష్ట బాధ్యతలను రూపొందించింది. ప్రజలతో ఎన్నుకొన్న పాలకులు ఏం చేయాలి? వారి విధులేమిటి? ఆదాయ మార్గాలు, గ్రామ కార్యదర్శి బాధ్యతలేమిటి? పాలకవర్గానికి ఏ విధంగా సహకారం అందించాలి? గ్రామ పాలనలో ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన విధులేమిటి? గ్రామస్థాయి ప్రణాళికలో ఎన్ని దశలుంటాయి? గ్రామసభ ఉద్దేశం ఏమిటి? సభ విజయవంతం కావాలంటే ఏం చేయాలి? కో ఆప్షన్‌ సభ్యుల నియామకం ఎలా ఉంటుంది? విధులేమిటి? గ్రామ పంచాయతీలో మొత్తం ఎన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయి? వంటి వాటిని ఈ చట్టం తెలియజేస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీలో గెలిచిన వారికి అవగాహన కల్పించే ప్రయత్నమిదీ..

కో ఆప్షన్‌ సభ్యుల నియామకం ఎలా?:
గ్రామ సభలో ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులు ఉండవచ్చు. విశ్రాంత ఉద్యోగి లేదా సీనియర్‌ సిటిజన్‌/ మహిళా సంఘం అధ్యక్షులు/ ఎన్‌ఆర్‌ఐ తదితర దాతలు(గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చే వారు) ఉండాలి. కోఆప్షన్‌ సభ్యులకు ఓటుహక్కు ఉండదు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వడానికే పరిమితం. 
ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్‌ లైన్‌ 
ఇంటి నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్మాణానికి సంబంధించిన కొలతలు ఇస్తే చాలు ఇంటి పన్నును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లెక్కిస్తుంది. దాని ఆధారంగా ఇంటి పన్ను ఉంటుంది. ఇంటి పన్ను, నల్లా పన్ను వంటివి వసూలు చేసిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ఉప ఖజానా కార్యాలయంలో నగదు జమ చేయాలి. 

గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు ఏమిటీ?:

గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామసభల తీర్మానాల చట్టబద్దత పరిశీలన, అమలు, రికార్డుల భద్రత. ఇంటి పన్ను మదింపు, వసూలు, ఉప ఖజానాలో జమ, ప్రకటనల పన్నులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, నిబంధనల మేరకు ఖర్చు, రిజిస్టర్‌ లలో నమోదు చేయడం, రిజిస్టర్‌ల పరిశీలన నిమిత్తం అందుబాటులో ఉంచడం, లబ్ధిదారుల అర్హతలను గ్రామసభ దృష్టికి తీసుకురావడం, అమలు, సమీక్ష. గ్రామ పంచాయతీ బాగోగులు చూడటం, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందజేత. 85 శాతం మొక్కలు కాపాడాల్సిన బాధ్యత. సామాజిక అడవులను కాపాడటం, ఆడిట్‌ నిర్వహించుకోవాల్సిన బాధ్యత, జనన, మరణాల నమోదు, ఇతర కార్యనిర్వాహక విధులు. 
సిబ్బందిని నియమించుకోవచ్చా? 
సిబ్బంది ఖాళీ ఏర్పడినపుడు జిల్లా పంచాయతీ కార్యాలయానికి సిబ్బంది ఖాళీ ఏర్పడిందన్న సమాచారం ఇవ్వాలి. గ్రామ పంచాయతీకి సిబ్బందిని నియమించుకొనే అధికారం లేదు. కలెక్టర్‌, డీపీవో ఆదేశాల మేరకు నడుచుకోవాలి. సిబ్బంది నియామకం ఆలస్యం అవుతుందని భావిస్తే కూలీ పద్దతిలో ఇతరులను తీసుకోవచ్చు. కానీ ఈ సమాచారం జిల్లా పంచాయతీ కార్యాలయానికి తెలియజేయాలి. 
గ్రామ సభ విజయవంతం కావాలంటే.. 
* సమావేశ తేదీలను ముందుగానే నిర్ణయించడం 
* నోటీసులను ముద్రించి విస్తృతంగా పంపిణీ చేయడం 
* సమావేశాలకు ప్రజలను ఎక్కువగా సమీకరించేలా లేదా పాల్గొనేలా ప్రోత్సహించడం 
* సమావేశాలను విజయవంతం చేయడానికి స్వయం సహాయక బృందాల సభ్యుల్ని వినియోగించడం 
* చర్చల కోసం గ్రామ సభలను చిన్న బృందాలుగా ఏర్పర్చడం 
గ్రామానికో నర్సరీ 
ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేయాలి. నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో ఈ మార్పులు చేశారు. గ్రామానికి అవసరమైన మొక్కల సంఖ్యకు ప్రజల కోరిక మేరకు నర్సరీలో మొక్కలు పెంచుకోవచ్చు. వీటిని ఉచితంగా పంపిణీ చేయాలి. మొక్కలు పొందిన వారు నాటడమే కాకుండా విధిగా సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. ఇంటికి ఆరు మొక్కల చొప్పున పెంచాలన్నది నిబంధన. గ్రామ కార్యదర్శి పర్యవేక్షణ చేయాలి. 
వీటిపై స్పష్టత రావాలి 
చెక్‌పవర్‌… 
సర్పంచి, ఉప సర్పంచికి కలిపి జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. 
ప్రోత్సాహకం 
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకం రూ.10 లక్షలు గతంలో ఇచ్చారు. ప్రస్తుతం అంతే ఇస్తారా? పెంచుతారా? అన్న విషయం తేలాల్చి ఉంది. 

ఎన్నికల తర్వాత కొత్తచట్టంపై శిక్షణ:
తెలంగాణ ప్రభుత్వం 2018 నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకువచ్చింది. శాసన సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు అంశాలను ఇదే చట్టంలో చేర్చినప్పటికీ కొన్ని సెక్షన్లు, నిబంధనలలో మార్పులు చేశారు. నూతన చట్టం పూర్తిస్థాయిలో అవగాహన కావాల్సి ఉంది. ఈ ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతోపాటు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు.

ఉప సర్పంచికి బాధ్యతలు ఎపుడు అప్పగిస్తారు?:
సర్పంచి వరుసగా 15 రోజులు అందుబాటులో ఉండటం లేదని చెప్పినపుడు ఆటోమిటిక్‌గా బాధ్యతలు ఉపసర్పంచికి బదిలీ అవుతాయి. మళ్లీ సర్పంచి వచ్చే వరకు ఉప సర్పంచి పూర్తిస్థాయి సర్పంచి బాధ్యతల్లో ఉంటాడు. విదేశాలకు వెళ్లినపుడు, ఇతర సందర్భాల్లో 15 రోజుల కంటే ఎక్కువ అందుబాటులో ఉండని పక్షంలో జిల్లా పంచాయతీ అధికారి సూచనల మేరకు ఉప సర్పంచికి బాధ్యతల బదలాయింపు అవుతుంది. ఆ సమయంలో చెక్‌ పవర్‌కు సంబంధించి డీపీవో ప్రత్యేక ఉత్తర్వు (స్పెషల్‌ ఆర్డర్‌) జారీ చేస్తారు. 
గ్రామ పంచాయతీలో ఎవరేం చేస్తారు? 
గ్రామ పంచాయతీ సర్పంచి వార్డు సభ్యులు  పరిపాలన సంబంధమైన అధికారాలు పాలన నియంత్రణ అధికారం సమావేశంలో ప్రశ్నించే లేదా తీర్మానించే అధికారం వనరుల సమీకరణ  పరిశీలన, తనిఖీ, సమీక్ష  నూతన ఆదాయ వనరుల ప్రతిపాదన, ఆదాయ వ్యయాల పరిశీలన గ్రామ పంచాయతీ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కార్యకలాపాల ఆర్థిక పరిశీలన, దుబారా నివారణ, అజమాయిషీ చర్య, ఆడిట్‌ నివేదిక పరిశీలన  పౌరసదుపాయాల కల్పిన (తాగునీరు, పారిశుద్ధ్యం, అజమాయిషీ, పర్యవేక్షణ, తనిఖీ సేవల నాణ్యత పరిశీలన, సూచనలు, తీర్మానాలు ఆరోగ్యం, వీధిదీపాలు వంటివి)  అభివృద్ధి కార్యక్రమాలు  గ్రామసభ ఎంపిక చేసిన లబ్ధిదారుల అభ్యంతరాలు చర్చించడం, పరిష్కరించడం. 
నివేదిక పర్యవేక్షణ, సమీక్ష

గ్రామ పంచాయతీల పరిధిలో 29 శాఖలు:

గ్రామ పంచాయతీ పరిధిలో 29 ప్రభుత్వ శాఖలు ఉంటాయి. ఈ శాఖలపై పాలకవర్గం అజమాయిషీ కలిగి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌ ప్రకారం 29 రకాల ప్రభుత్వ శాఖలను పంచాయతీరాజ్‌ సంస్థలకు కేటాయించాల్సి ఉంది. ఈ శాఖలు గ్రామ స్థాయిలో పంచాయతీలు, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్‌ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ సంస్థలకు ప్రభుత్వ శాఖలను బదలాయించలేదు. కాగితాల్లో మాత్రమే నిబంధనలు నలిగిపోతున్నాయి. భౌతికంగా పంచాయతీరాజ్‌ సంస్థల పరిధిలోకి రావాల్సిన ప్రభుత్వ శాఖలు వేరుగానే పనిచేస్తున్నాయి. కేవలం జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ సమావేశాల్లో మాత్రమే ఆయా శాఖల అధికారులు కనిపించి ప్రగతి నివేదికలు వినిపిస్తుంటారు. 
29 రకాల కార్యకలాపాలు ఇవే.. 

 1. వ్యవసాయం- వ్యవసాయ విస్తరణ 
 2. భూమి అభివృద్ధి- భూ సంస్కరణలు అమలు, భూముల ఏకీకరణ, భూసార రక్షణ 
 3. చిన్నతరహా నీటిపారుదల, నీటి నిర్వహణ, నీటి వాలు అభివృద్ధి 
 4. పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ 
 5. మత్స్య పరిశ్రమ 
 6. సామాజిక అడవులు-చేలల్లో చెట్లు పెంపకం 
 7. చిల్లర అటవీ ఉత్పత్తులు 
 8. లఘు పరిశ్రమలు, ఆహార పదార్థాలు శుభ్రపరచుట 
 9. ఖాదీ మరియు గ్రామీణ కుటీర పరిశ్రమలు 
 10. గ్రామీణ గృహ నిర్మాణం 
 11. మంచినీటి సరఫరా 
 12. ఇంధనం-పశుగ్రాసం 
 13. రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, కాల్వలు, జలమార్గాలు, ఇతర కమ్యూనికేషన్‌ విధానాలు 
 14. గ్రామీణ విద్యుద్దీకరణ-పంపిణీ 
 15. సంప్రదాయేతర ఇంధన వనరులు 
 16. దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాలు 
 17. విద్య-ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలతో సహా 
 18. సాంకేతిక శిక్షణ-వృత్తి పరమైన విద్య 
 19. వయోజన విద్య-అనియత విద్య 
 20. గ్రంథాలయాలు 
 21. సాంస్కృతిక కార్యక్రమాలు 
 22. మార్కెట్లు-సేవలు 
 23. ఆసుపత్రులు-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం 
 24. కుటుంబ సంక్షేమం 
 25. మహిళా-శిశు అభ్యుదయం 
 26. సాంఘిక సంక్షేమం 
 27. బలహీన వర్గాల సంక్షేమం-ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీలు సహా 
 28. ప్రజా పంపిణీ వ్యవస్థ 
 29. సామాజిక ఆస్తుల నిర్వహణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here