ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

0

పుల్వామా సూత్రధారి హతం

పుల్వామా: పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి చేసి 49 మంది జవాన్ల మరణానికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా దాడికి కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ అబ్డుల్‌ రషీద్‌ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టింది. పుల్వామా దాడికి తెగబడిని ఉగ్రవాదుల కోసం సైన్యం విస్తృతంగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. కాగా, ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆర్మీ మేజర్‌, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు మృతిచెందారు. సంఘటనాస్థలిని భద్రతా దళాలు పూర్తిగా అదుపులోకి తీసుకున్నాయి.32 ఏళ్ల అబ్ధుల్‌ రషీద్‌ ఘాజీ జైషే అధినేత మసూద్‌ అజహర్‌కు అత్యంత నమ్మకస్తుడు. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్‌ గ్రూపులో శిక్షణ పొందాడు. ఆఫ్గన్‌ యుద్ధంలో పాల్గొన్న ఇతను ఐఈడీలు తయారు చేయడం, అమర్చడం, వాటిని పేల్చడంలో ఎక్స్‌పర్ట్‌. అయితే మసూద్‌ మేనల్లుళ్లు తాలా రషీద్‌, ఉస్మాన్‌లు భారత సైన్యం మట్టుబెట్టడంతో రగిలిపోయిన అజహర్‌… వారి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు గాను ఘాజీని రంగంలోకి దింపాడు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు దక్షిణ కశ్మీర్‌లోని యువతను రెచ్చగొట్టి వారిని భారత్‌పైకి ఊసిగొల్పడంలో ఘాజీ కీలక పాత్ర పోషించాడు. తాజాగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహం పన్ని అదిల్‌ అహ్మద్‌ దార్‌ని సూసైడ్‌ బాంబర్‌గా మార్చాడు. కొద్దిరోజుల క్రితం రతన్‌పోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తృటిలో తప్పించుకున్న రషీద్‌… ఎట్టకేలకు భారత సైన్యం చేతిలో హతమయ్యాడు.

ఎవరీ రషీద్‌ ఘాజీ

40 మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది జైషే సంస్థ కమాండర్‌ అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. వీరి సందేహంలో నిజం లేకపోలేదు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్‌ దార్‌కు శిక్షణ ఇచ్చింది ఘాజీనే. రషీద్‌ జైషే మహమ్మద్‌ (జేఈఎం) సంస్థ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌కు ప్రధాన అనుచరుడు. ఘాజీ ఐఈడీని ఉపయోగించడంలో దిట్ట. మొన్న అదిల్‌ దార్‌కు ఈ విషయంలో శిక్షణ ఇచ్చింది కూడా అతగాడే. ఇతడిని కశ్మీర్‌కు మసూద్‌ అజరే పంపాడు. 2017,2018 సంవత్సరాల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన దాడుల్లో అజర్‌ మేనల్లుళ్లను మన జవాన్లు మట్టుబెట్టారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఘాజీని అజర్‌ కశ్మీర్‌కు పంపాడు. ఈ దాడులు కూడా పుల్వామాలోనే జరగడం గమనార్హం.

ఎన్నోసార్లు తప్పించుకొని..

ఘాజీ మన జవాన్ల చేతుల్లో ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. గురువారం ఆత్మాహుతి దాడి జరగడానికి కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామాలోని రత్నిపురాలో జరిగిన ఈ ఘటనలో ఒక పౌరుడు, హెచ్‌వీ బల్‌జీత్‌ అనే జవాను మృతి చెందారు. ఆ రోజు జరిగిన ఎదురు కాల్పుల నుంచి ఘాజీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆత్మాహుతి దాడి పథకం రచించారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. దాడి అనంతరం సవిూంలోని ఇళ్లలోనే కొన్ని రోజులుగా దాక్కొని ఉన్నాడు. తాజాగా ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం కూడా సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన లెతోపొరాకు చాలా దగ్గర్లో ఉంది. ఘాజీ 2008లో జైషే సంస్థలో చేరాడు. అతగాడికి ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న తాలిబన్లు శిక్షణ ఇచ్చారు. రెండేళ్లు వాళ్ల వద్ద శిక్షణ పొందిన అనంతరం 2010లో పాకిస్థాన్‌కు ఉత్తరాన ఉన్న వజిరిస్థాన్‌లో పాగా వేశాడు. అక్కడే ఉండి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన యువకులను జైషే సంస్థకు నియమించుకునే వాడు. వాళ్లకు ఘాజీ ట్రైనర్‌గా ఉండేవాడు. అలా దక్షిణ కశ్మీర్‌ గురించి పూర్తిగా తెలుసుకుని అక్కడ పట్టు సంపాదించాడు. అదిల్‌ దార్‌ కూడా అలా రిక్రూట్‌మెంట్‌ ద్వారా జైషే సంస్థలో చేరిన వాడే.

పుల్వామా.. ఉగ్రవాదుల పుట్ట..!

లష్కరే కమాండర్‌ అబూ ఖాసీం ఎన్‌కౌంటర్‌.. జైషే కమాండర్‌ రషీద్‌ ఘాజీ ఎన్‌కౌంటర్‌.. ఇవన్నీ జరిగింది కశ్మీర్‌లోని ఒకే ప్రాంతం.. అదే పుల్వామా. ఇటీవల 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యిందీ అక్కడే. కరడు గట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ స్వస్థలమైన త్రాల్‌.. పుల్వామాకు సవిూపంలోనే ఉంది. బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ కూడా పుల్వామా సవిూపంలోని అనంతనాగ్‌ పరిధిలో జరిగింది. అలాంటి ఈ జిల్లాలో డ్యూటీ అంటే భద్రతా దళాలకు కత్తివిూద సామే. ఎప్పుడు.. ఎటు నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తారో తెలియని పరిస్థితి. దీనికి తోడు స్థానికుల నుంచి బలమైన మద్దతు.. పుల్వామాను ఉగ్రవాదుల పుట్టగా మార్చేశాయి. జమ్ము కశ్మీర్‌లో పుల్వామా జిల్లా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది. ఇక్కడ ఉగ్రవాదులకు బలమైన మద్దతుదారులు, నెట్‌వర్క్‌ ఉండటం ప్రధాన కారణం. ఫలితంగా ఇక్కడ భద్రతా దళాలకు సహాయ సహకారాలు తక్కువగా లభిస్తాయి. ఇది ఉగ్రవాదులకు అదనపు బలంగా మారింది. కశ్మీర్‌ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే వ్యూహాత్మక నేషనల్‌ హైవే పుల్వామా విూదుగా వెళుతుంది. గత రెండేళ్ల నుంచి ఇక్కడ ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోయింది. ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో స్థానిక పరిచయాలు కారణంగా వారికి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ఎన్‌కౌంటర్ల సమయంలో రాళ్లు రువ్వే ఘటనలు ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. భద్రతా దళాలపై అత్యధికంగా దాడులు జరిపే ప్రాంతాల్లో పుల్వామా ముందుంటుంది. ఉగ్రవాదులకు భయపడి ఇక్కడి రాజకీయ నాయకులు కూడా నోరుమెదపరు. కశ్మీర్‌లో లోయలో రైస్‌బౌల్‌గా పేరున్న పుల్వామాలో మొత్తం ఎనిమిది తాలూకాల్లో ఉగ్రవాదానికి భారీగా మద్దతు లభిస్తోంది. పుల్వామా, పామ్‌పొరా, రాజ్‌పొరా, కాకాపొరా, త్రాల్‌, ష¬రా, అవంతిపురా, అరిపాల్‌ ప్రాంతాలు కరడుగట్టిన ఉగ్రవాద స్థావరాలుగా మారిపోయాయి. సైన్యం కూడా ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దీంతో ఇక్కడ భారీ ఎన్‌కౌంటర్లు తరచూ చోటుచేసుకుంటాయి. లష్కరే తోయిబా కశ్మీర్‌ చీఫ్‌ అబూ ఖాసీంను దళాలు ఇక్కడే మట్టుబెట్టాయి. అప్పట్లో అల్లరి మూకలు భారీ ఎత్తున భద్రతా దళాలపై దాడులకు దిగాయి. పుల్వామా, అవంతిపురా పోలీస్‌ డివిజన్లు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా పుల్వామాలో ఉగ్రదాడులు, బ్యాంక్‌ దోపిడీలు, దళాల నుంచి ఆయుధాలు లాక్కొనే సంఘటనలు, సైనిక దళాల కాన్వాయ్‌లను, క్యాంపులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం రివాజు. ఇక్కడ సీఆర్‌పీఎఫ్‌పై భారీ దాడులు చోటుచేసుకొన్నాయి. అందుకే కమరాయ్‌ పొరా, కరీమాబాద్‌, సంబూరా, లెల్‌హార్‌, తహబ్‌, అగ్లార్‌, లిట్టర్‌, బమ్ను, కోయిల్‌ ప్రాంతాల్లో అడుగు పెట్టేందుకు భద్రతా దళాలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ముఖ్యంగా స్థానికుల నుంచి ఎదురయ్యే ప్రతి ఘటనతోనే ఇబ్బంది. ఉగ్రవాదులను భద్రతా దళాలు తేలిగ్గా ఎదుర్కొంటాయి. కానీ ఆ తర్వాత అల్లరి మూకల దాడుల కారణంగా అమాయాక ప్రజలు గాయాల పాలవుతుండడం అసలైన ఇబ్బంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here