నేటి నుంచి నిరవధిక దీక్ష

0
  • అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ నిరహార దీక్ష
  • తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై బీజేపీ కీలక నిర్ణయం..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫలితాల ఇప్పుడు రాజకీయంగా దూమారం రేపుతోంది. ప్రతిక్షపార్టీ కాంగ్రెస్‌ పార్టీ ఇంటర్‌ వ్యవహారంపై, తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో ధర్నాలు నిర్వహించింది. ఈ నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కూడా ఇప్పుడు ఇంటర్‌ ఫలితాల విషయంలో తెలంగాణ సర్కార్‌ పై పెద్దఎత్తున్న పోరాటానికి సిద్దం అయింది. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ నేటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ రాష్ట్ర కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు తెలిపారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ దీక్ష కొనసాగుందని అన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో లోపాల కారణంగా 23 మంది చనిపోయారని, ఇలా ఎన్నడూ జరగలేదని అన్నారు. విద్యార్ధుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డులో ప్రతి ప్రక్రియలో లోపాలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం ఎందుకు దోషులను కాపాడాలని చూస్తోందని ప్రశ్నించారు. ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై ఏర్పడిన సమస్యలపై బీజేపీ చివరి వరకు పోరాడుతుందని ఆయన అన్నారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు, ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారిని ప్రభుత్వం రక్షిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే త్రిసభ్య కమిటీ నివేదిక పేరు చెప్పి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అయితే, దీనిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఇటు ఇంటర్‌ బోర్డు వైఫల్యాలతో సుమారు 23 మంది విద్యార్థులు చనిపోవడం దారుణమన్నారు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఇంటర్‌ విద్య ఒక దందాగా మారిందని విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌ రెడ్డి ఇచ్చిన నివేదిక సంతృప్తిగా లేదన్న ఆయన గ్లోబరీనా వెనుక ఎవరున్నారో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఈ నెల 29న అంటే ఈ రోజు ఇంటర్‌ బోర్దు వద్ద ధర్నా చేయనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here