ఉత్తర తెలంగాణలో పెరిగిన చలితీవ్రత

0

ఆదిలాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

పెథాయ్‌ తుఫాన్‌ ప్రభావం తుడిచి పెట్టుకుని పోయినా ఉత్తర తెలం గాణలో చలి పంజా విసురుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్‌ పూర్వపు జిల్లాలోని ప్రాంతాలు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ పూర్వపు జిల్లా ల్లో వాతావరణం చల్లగా మారింది. రాత్రి ఉష్టోగ్రతలు బాగా పడిపోతు న్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలనివైద్యులు హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో అతి తక్కువ స్థాయికి పడిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా చలిలోనూ అదేఒరవడిని కలిగి ఉంటుంది. ఎత్తయిన గుట్టలు, కొండలు, లోయ ప్రాంతాలతో చూడముచ్చటైన మనోహర దృశ్యాలతో కనువిందు చేస్తోంది. వాటిమాటునూ చలివాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోనైతే గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గతంలో ఎన్నడు లేనివిధంగా రోజు రోజుకు వాతావరణంలో భారీ మార్పులతో కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలిపులి పంజా విసురుతోంది. అలాగే హైదరాబాద్‌లో పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోగా ఇప్పుడు సాధారణ స్తాయికి వస్తోంది. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లోనే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. పొట్టకూటి కోసం కూలినాలి చేసుకొనే కష్టజీవులపై తీవప్రభావం పడింది. ఉదయం పూటపనిచేసే కార్మికులు, కర్షకులు వెతలు ఎదుర్కొంటున్నారు. గత వారంరోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొని చలి పెరిగిపోతోంది. సాయంత్రం ఐదు గంటలు దాటిందంటే చీకటితోపాటు చల్లనిగాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున నుంచే మంచు కప్పుకుంటోంది. గాలిలో తేమ అధికంగా ఉండడంతో చలికాలం వచ్చిందంటే చాలు కుగ్రామాల నుంచి మొదలుకొని గూడాలు, తండాలే కాదు మండల, పట్టణ కేంద్రాల్లో సైతం చలితీవ్రత అధికంగా ఉంటుంది.ఏజెన్సీలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూరు, జైనూరు, సిర్పూరు(యు),కెరమెరి, తిర్యాణి, ఇచ్చోడ, బోథ్‌, గుడిహత్నూర్‌, బజార్‌హత్నూర్‌, నేరడిగొండ, ఆసిఫాబాద్‌ చలితో అతలాకుతలమవుతోంది. చలి తీవ్రతను తట్టుకోలేక అడవిబిడ్డలు వ్యాధుల బారినపడుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ఈసారి ఉదయం ఎనిమిది గంటలు గడవనిదే ఏ పని చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here