పన్నులు బాదుడే బాదుడు…

0

  • ఏటేటా పెరుగుతున్న ఆదాయం..
  • పథకాలకోసమేనంటున్న పాలకులు..
  • సామాన్యుడికి తెలియకుండా వాతలు..

వేల కోట్లరూపాయలు కావాలి.. ప్రభుత్వాన్ని నడిపాలంటే తమాషాలు అనుకుంటున్నారా.. ఎన్ని ఉంటాయి.. ఎంతమందికి సర్దిచెప్పాలి.. ఎంతమందిని సముదాయించాలి.. ఉద్యోగులందరికి జీతాలతో పాటు, ప్రజలకు పనికొచ్చే పథకాలు కూడా కోట్లాది రూపాయల నిధులు కావాలి.. ప్రజలకు పన్నుభారం పడకుండా వారినెంతగా కాపాడుతున్నామో తెలుసా మీకు, ఎన్నోరకాలుగా వారిని ఆదుకుంటున్నాము.. అంటూ ప్రతి ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుంది. ప్రజలకోసం నిత్యం ఆలోచిస్తూ, పనిచేస్తూ జీవితాన్నే త్యాగం చేస్తామంటున్నారు మన పాలకులు.. కాని వీరంతా పైకి చెప్పే మాటలకటి, లోలోపల చేసే పనులోకటిగా తెలిసిపోతుంది. నిత్యం సామాన్యుడి అవసరాలు, అభివృద్దికోసం మేమున్నామని చెపుతున్న ప్రభుత్వాలు వారికి తెలియకుండా పన్నుల మీద పన్నులు వేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఒక పక్క కోట్లాది రూపాయలు పన్నుల రూపేణా దండుకుంటూ మరొపక్క పథకాలకు కోట్లాది రూపాయలను విదుల్చుతున్నామని చెపుతున్నారు మన పాలకులు… తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులైన పెట్రోల్‌, డిజిల్‌తో పాటు, మద్యంపై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. సామాన్యుడికి తెలియకుండా సన్నగా వాతపెడుతూ రాష్ట్ర ఖజానా మాత్రం నింపుతున్నారు…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పాలన నడపాలంటే ప్రజలను మచ్చిక చేసుకోవాలి.. ఎన్నికల్లో గెలవాలంటే అదే ఓటర్లను మాటలతో ఆకట్టుకోవాలి.. హమీలతో వారిని మైమరిపించాలి. గెలిచాక అధికారంలోకి వస్తే అప్పుడు ఇచ్చిన హమీలలో అమలయ్యేవి ఎన్నో, అమలు కానివి ఎన్నో తెలిసిపోతుంది. దేశంలోనే కాకుండా రాష్ట్రాలలో కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్ని అదే పనిగా ప్రకటిస్తూ ప్రజలకోసం ఎన్నో చేశాం. ఇంకెన్నో చేయబోతున్నామని ప్రకటిస్తారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మేము ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా వారికి నిత్యం అవసరమయ్యే పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెపుతూనే ఉంటారు. వీరికి ఇంత చేశాం. వారికి అంత చేశామని గొప్పలకు చెప్పే పాలకులకు కొదువే ఉండదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలీస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న వైనం ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లినా, బహిరంగసభలలో పాల్గన్న ప్రతిసారి వారి ఇష్టానుసారంగా కొత్త కొత్త పథకాలను కోట్లరూపాయలతో ప్రవేశపెడుతూనే ఉంటారు. రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలకు కోట్ల రూపాయలే, క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించినా కాని కోట్ల రూపాయలే ప్రకటిస్తారు. ఆ పథకం, ఈ పథకమంటూ ఏదేదో పనులకు వారికి నచ్చినంతగా వరాలు జల్లు కురిపించే నాయకులకు మనదేశంలో కాని, రాష్ట్రాలలో కాని కొదువే లేదు. మరీ ఇంతగా ఇష్టానుసారంగా ప్రవేశపెడుతున్న పథకాలకు అయ్యే కోట్లాది రూపాయల ఖర్చులకు సంబంధించిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందీ అంటే మాత్రం సామాన్యులెవరి దగ్గర సమాధానం లేని ప్రశ్నలే.. ఇన్ని నిధులు నిల్వ ఉన్నాయో, అప్పులు తెస్తున్నారా లేదా ప్రజల దగ్గరి నుంచి పన్నుల రూపేణా వసూలు చేసి మళ్లీ వారికే చెల్లిస్తున్నారా అనేది ప్రధాన అంశంగా మారిపోయింది. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి రాష్ట్రంలోని ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులే. ఏ రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తారన్న విషయం లోతులకు వెళితే మాత్రం పలు ఆసక్తికరమైన ఆంశాలే కనిపిస్తున్నాయి.. తెలంగాణలో రోజురోజుకు ఆదాయం పెరుగుతూనే ఉందన్న విషయం కొన్ని పరిణామాలను, ప్రభుత్వ శాఖలు బట్టి చూస్తే తెలుస్తోంది. సామాన్యుడు నిత్యం వాడే వస్తువులకు తెలియకుండా అధిక పన్నుల భారం మోపుతూ కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఖజానా నింపతున్నారని తెలుస్తోంది..

ఎక్కువ ఆదాయం పెట్రోలు, మద్యమే..

సామాన్యుడు నుంచి సంపన్నుడి వరకు ప్రతిరోజు చిన్నా, చితకా పనుల నుంచి ఆఫీసుకు వెళ్లాలన్నా కారో, బైకో వాడుతారు. అవీ నడవాలంటే పెట్రోల్‌, డిజిల్‌ వినియోగించని వారు అంటూ ఎవరూ ఉండరు. అలాంటి నిత్యావసర వస్తువు మీద ప్రభుత్వం విధించే పన్నులు పోటు దేశంలోనే మరెక్కడా లేనంతగా ఎక్కువగా తెలంగాణలో విపరీతంగా బాదుతున్నారని తెలుస్తోంది. తాజాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వానికి డిజిల్‌, పెట్రోల్‌ ద్వారా వస్తున్న ఆదాయం లెక్కలు వింటే మాత్రం నోరెళ్లపెట్టాల్సిందే. సామాన్యుడి అవసరాన్ని మన ప్రభుత్వాలు అవకాశంగా మార్చుకుంటూ ఉన్నాయి. ప్రతి మనిషి తమ అవసరం కోసం వాహనం వాడకతప్పదు. వాహనం వాడాలంటే ఇంధనం కావాల్సిందే. ఎవరికి తెలియకుండా ఎవరి నెత్తి మీద వారి చెయ్యి పెట్టించడం మన పాలకులకే చెల్లుతుందీ. ఎందుకంటే పెట్రోల్‌, డిజీల్‌ అమ్మకాలపై విధించిన పన్నులద్వారా 2017.18 ఆర్థిక సంవత్సరానికి రూ. 9176 కోట్ల ఆదాయం వచ్చింది. అదే 2018.19 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా ఆదాయం రూ. 10142 కోట్ల రూపాయల ఆదాయంతో కొండలా పెరిగిపోయింది. రోజురోజుకు జనాభా పెరుగుదలతో పాటు వాహనాలు కూడా పెరగడం, నిత్యం ఇంధనం వాడటం కూడా ఆర్థిక పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నిత్యం పన్ను బాదుడు బాదేస్తూ ఆ వచ్చిన మొత్తాన్ని సంక్షేమ పథకాలకు మళ్లించటం ఏంటో మాత్రం అర్థమే కావడం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇదిలా ఉంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాన్ని ఆర్జించే విషయంలో ముందడుగు పడినట్లుగా చెపుతున్నారు. ప్రతి శాఖ నిర్థేశిత లక్ష్యాల్ని అధిగమించి నూట ఒక శాతం మేర పన్నులు వసూలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పెద్ద రాష్ట్రాల కంటే వృద్ది రేటులో తెలంగాణ పురోగతి సాధించిందని చెపుతున్నారు.

తెలంగాణ ఆదాయానికి ఢోకానే లేదు..

గడిచిన ఆర్థిక సంవత్సరానికి పెట్రోల్‌, డిజిల్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 10142 కోట్లు రాగా, మద్యంపై వేసే పన్నులతో రూ. 9473 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. ఇక వస్తు సేవల పన్ను జిఎస్టీ పేరుతో గత ఆర్థికసంవత్సరంలో ఏకంగా రూ. 25764 కోట్ల ఆదాయం రావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇతర పన్నుల ద్వారా మరో రూ.1592 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి ఆదాయం రాకమాత్రం బాగానే ఉందని తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులైన పెట్రోల్‌, డిజిల్‌, మద్యంపై రోజురోజుకు ఆదాయం పెరిగిపోతూనే ఉంది. ప్రభుత్వం పెట్టుకున్న అంచనాలను కూడా దాటిపోతుండడంతో ఆదాయానికి ఢోకానే లేదు. సామాన్యులకు తెలియకుండా పన్నులు రూపేణా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గుంజుతున్న ప్రభుత్వం ప్రజల అభివృద్ది, సంక్షేమ పథకాలను మాత్రం మధ్యలోనే వదిలేసింది. రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలు నిధులు లేక మధ్యలోనే అగిపోయాయి. ఆదాయం రాక బాగానే ఉన్నా కాని ఖర్చు విషయంలో ఒక కట్టుబాటు లేనట్లుగా ఉందన్న అభిప్రాయం ఇప్పుడు ఆర్థిక నిపుణులతో పాటు ప్రజల్లో వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here