మూగబోయిన హాజీపూర్‌…

0

  • శ్రీనివాస్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌
  • ఉన్మాది ఘాతుకంతో శోకసంద్రమైన గ్రామం
  • వరంగల్‌ జైలుకు తరలింపు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వారం కింద పల్లె పలకరింపులతో కళకళలాడిన హాజీపూర్‌ ఇప్పుడు మూగబోయింది. ఉన్మాది ఘాతుకం వెలుగు చూడటంతో ఊరూ ఊరంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు చిన్నారులు అభం శుభం తెలియని ఆడపిల్లలు తమకు తెలియకుండానే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిన ఘటనలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ పోలీసుల విచారణలో వెల్లడైన వాస్తవాలను తలుచుకుంటున్నారు. ఏ గడపలో చూసిన విషాదమే ఏ ఇంట చూసిన కన్నీటి రోదనే ఇది ప్రస్తుతం హాజీపూర్‌లో పరిస్థితి. చిన్నప్పుడు తమ పిల్లలకు అ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని చెప్పిన తల్లిదండ్రులు ఇప్పుడు కొత్త అర్ధాలు వెతుక్కంటున్నారు. అ అంటే అంతులేని ఆ అంటే ఆవేదనలో తమ జీవితాలు కూరుకుపోయాయంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తాము అంతంత మాత్రమే చదువుకున్నా పిల్లలను ఉన్నత విద్యావంతులుగా చేయాలని కలలు గన్నామని శ్రీనివాసరెడ్డి ఉన్మాదంతో తమ కలలు కల్లలుగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారని విషయం తెలిసినప్పటి నుంచి హాజీపూర్‌లో పొయ్యి వెలగలేదు. జరిగిన విషాదాన్ని తలుచుకుంటూ ఉన్మాది శిక్షించాలనే కసి తప్ప మరేమి కనిపించడం లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాడేందుకు హాజీపూర్‌ గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఉన్మాదికి ఉరి శిక్ష విధించే వరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. తాము అంతంత మాత్రమే చదువుకున్నా పిల్లలను ఉన్నత విద్యావంతులుగా చేయాలని కలలు గన్నామని శ్రీనివాసరెడ్డి ఉన్మాదంతో తమ కలలు కల్లలుగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

హజీపూర్‌ లో ముగ్గురు బాలికల హత్య కేసులో కీలక నిందితుడు, సీరియల్‌ కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌ రెడ్డిని భువనగిరి మున్సిఫ్‌ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది కోర్టు. రిమాండ్‌ అనంతరం నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డికి భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు అనంతరం నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డిని వరంగల్‌ జైలుకు తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే పోలీసులు కస్టడీ పిటీషన్‌ వెయ్యాలని కూడా ప్రయత్నిస్తున్నారు. గురువారం మర్రి శ్రీనివాస్‌ రెడ్డిని కస్టడీ కోరుతూ కస్టడీ పిటీషన్‌ వెయ్యనున్నారు పోలీసులు. బొమ్మలరామారం పీఎస్‌ పరిధిలో మిస్సింగ్‌ కేసులుపై విచారించనున్న నేపథ్యంలో కస్టడీ పిటీషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే సునీతను నిలదీసిన హజీపూర్‌ గ్రామస్థులు… ఆలేరు ఎమ్మెల్యే గొంగినీడి సునీతకు చేదు అనుభవం ఎదురైంది. వరుస హత్యల జరిగిన హజీపూర్‌ గ్రామాన్ని సందర్శించేందుకు ఎమ్మెల్యే సునీత చేరుకున్నారు. ముగ్గురు బలయ్యారు ఇంకెంతమంది చావాలి ఇప్పుడు వస్తారా అంటూ మహిళలు నిలదీశారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి చెప్పాలని నిలదీశారు. మె?దటి హత్య జరిగిననాడు చర్యలు తీసుకుంటే ఇలాంటి దారుణాలు జరగవు కదా అంటూ నిలదీశారు. శ్రావణి హత్య జరిగి నాలుగురోజులు కావస్తోంది అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నాం ఇప్పుడు గుర్తుకు వచ్చామా అంటూ నిలదీశారు. పోనీ ఈ హత్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన మానవ మృగం మర్రి శ్రీనివాస్‌ రెడ్డికి మరణ శిక్ష విధించేలా చూసి పుణ్యం కట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు ఎమ్మెల్యే సునీత తాను ఆలస్యంగా స్పందించానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శ్రావణి హత్యకు గురైన రోజే తాను ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించానని తెలిపారు. గ్రామంలోకి వెళ్లి పరామర్శిద్దామని భావించానని అయితే గ్రామస్థులు ఆగ్రహంగా ఉండటంతో వెళ్లొద్దని పోలీసులు సూచించినట్లు తెలిపారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డి ఇంటిని తగులబెట్టేశారని ఇప్పుడు గ్రామానికి వెళ్తే లేనిపోని సమస్యలు వస్తాయని ఇన్విస్టిగేషన్‌ కు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పారని అందువల్లే రాలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇకపోతే బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తరపున కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీత హావిూ ఇచ్చారు.

శ్రీనివాస్‌ రెడ్డి చరిత్ర ఇదీ… హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్ధినులను హత్య చేసిన శ్రీనివాస్‌ రెడ్డి ఒంటరిగా అడవుల్లో తిరిగేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. చిన్నతనం నుండే శ్రీనివాస్‌ రెడ్డికి దొంగతనాలు చేసే అలవాటు ఉందని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు. అయితే దొంగతనాలు చేసిన సమయంలో కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ రెడ్డిని వారిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తక్కువగా శ్రీనివాస్‌ రెడ్డి ఉండేవాడని గ్రామస్థులు అంటున్నారు. కీసరలో మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌ రెడ్డి రాత్రి పూట ఇంటికి వచ్చి ఉదయం పూట వెళ్లేవాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. గ్రామంలో ఎప్పుడైనా ఉంటే మాత్రం ఒంటరిగా ఆయన సంచరించేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. నిర్జన ప్రదేశాల్లో, అడవుల్లో శ్రీనివాస్‌ రెడ్డి ఒక్కడే తిరిగే అలవాటు ఉందని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు. శ్రావణి, మనీషా మృతదేహాలు దొరికిన వ్యవసాయ బావుల వద్ద కూడ అప్పుడప్పుడూ శ్రీనివాస్‌ రెడ్డి సంచరించేవాడని గ్రామస్తులు అంటున్నారు.ఇటీవలనే శ్రీనివాస్‌ రెడ్డి కుటుంబసభ్యులు భూమిని విక్రయించారు. దీనికి సంబంధించిన డబ్బు కూడ రావడంతో జల్సాలు చేసేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. డ్రగ్స్‌ కూడ శ్రీనివాస్‌ రెడ్డి అలవాటు పడ్డాడని కొందరు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here