రాములోరి ఇలాకా భద్రాద్రిలో… 11 వందల ఎకరాల భూకబ్జా…

0
  • నేతల ముసుగులో 1,108.03 హాం ఫట్‌
  • చట్టాల ఉల్లంఘన
  • వచ్చేది ఏటా పాతిక లక్షలే
  • రావల్సింది రూ.200 కోట్లు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఏడాదికి ఒకరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులంతా భద్రాచలం సీతారాముల కల్యాణ వైభోగం కనులారా చూస్తుంది. తరిస్తోంది. అయితే ఆ భద్రాద్రి ఎందుకు అభివృద్ధి చెందటం లేదు. అక్కడేం జరుగుతుంది. అంతా బహిరంగ రహస్యం. మాట్లాడాలంటే భయం. అంతటి భయానక వాతావరణం ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొని ఉంది. ఎక్కడైనా కబ్జాలు జరుగుతాయి. దేవుడి మాన్యాలు అంటే మరీ అలుసు. ఎందుకంటే కలియుగంలో దేవుడు మాట్లాడలేడు. అందులో ఈ దేవుడు ఎవరినీ బాధపెట్టడు. అస్సల్లే చాలా మంచోడు. అందులోనూ మన భద్రాద్రి రాముడు మరీ.. ఎందుకంటే పాపం ఆయన అమాయకులైన ఆదివాసీలు, చెంచులు, గుత్తికోయలుండే చోట ఉంటాడు కాబట్టి. అరే ఈ దేవుడు భలే అమాకుడనుకున్నాడు.. మనిషి. అంతే ఒక్కసారిగా భద్రాద్రి రాములోరి భూములపై కన్నేశాడు. కాజేశాడు. అంతా ఇంతా కాదు.. అక్షరాలా 1వేయి 149 ఎకరాల 70 సెంట్లు. శ్రీరామనవమి సందర్భంగా ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న సంచలన కథనం.

నేతల గుప్పిట్లో ఆలయ భూములు: తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల దేవాలయ భూములను నాయకులు భోంచేశారు. భగవంతుని కైంకర్యాలకు భక్తులు, నాటి జమిందారులు ఇచ్చిన మాన్యాలను గుట్టుగా.. గుంభనంగా ఎంచక్కా మాయం చేసేశారు. కబ్జాలకు గురై, ఆక్రమణల్లో చిక్కుకుని, అన్యాక్రాంతమై పోయిన ఆలయ భూములకు లెక్కే లేదు. ఇందులో అన్ని పార్టీల నాయకులు, ఉద్దండ పిండాలు ఉన్నాయి.

కబ్జా చేశారు.. పాపం జాలిపడి వదిలేశారు: మొత్తం కబ్జా చేసే వాళ్ళే…ఎందుకో వారికీ మనుసుందని నిరూపించుకోవలని అనుకున్నారు. అందుకే ఓ పదకొండు వందల ఎకరాలు కబ్జా చేసి.. జాలిపడి ఓ 41 ఎకరాలు వదిలేశారు. భద్రాచలం ఆలయ పరిధిలో సీతారాముల పేరుతో మొత్తం ఉన్నది 1149.70 ఎకరాలు. అయితే అందులో రాములోరికి ఈ భూకబ్జాదారులు 41.67 ఎకరాలు మాత్రం జాలిపడి వదిలేశారు. అంటే.. 1,108.03 ఎకరాలను అడిగేనాథుడు లేడనే ధైర్యంతో ఏకంగా భూ బకాసురులు ఎంచక్కా మింగేశారు.

వచ్చేది పాతిక లోపే: మెరక 18.32 ఎకరాలు, మెట్ట 1328.95 ఎకరాలు కలిపి మొత్తం 1347.27 ఉంది. కానీ కౌలు రూపంలో వచ్చేది మాత్రం పాతిక లక్షల లోపే కావడం విశేషం. అయ్యో రామా..! ఏమిటయ్యా ఈ వైనం.

ఎలా మింగేశారు..?: ఈ ఆలయ భూముల పరిధిలో 1/70 ఆక్ట్‌ ఉంది. అంటే గిరిజన ప్రజలకు మాత్రమే భూ మార్పిడి చట్టం. ఈ చట్టాన్ని అవహేళన చేస్తూ.. భూ బకాసురులు రకరకాల ఎత్తుగడలతో కబ్జాలు నిరంతరాయంగా కొనసాగించారు. అధికారంలో నాయకులతే మరీ ఎక్కువ. ఇక్కడ ఒక ఐపిఎస్‌ అధికారి (గురించి ఈ పవిత్ర సందర్భంలో ఆ దౌర్భాగ్య పేరు ప్రస్థావన ఎందుకు..? తర్వాత తప్పక చూద్దాం.) ఏకంగా ఓ సెటిల్‌ మెంట్‌ లో పెద్ద భవంతిని నొక్కేశారనే వదంతులు ఉన్నాయి. తప్పుడు డాక్యుమెంట్లు, గిరిజనుల పేరుతో బినావిూల పేర్లతో ఈ తతంగం నిర్మానుష్యంగా జరిగిపోయింది.

అక్కడా…నొక్కుడే..: మన భద్రాద్రి రాముడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న భూములు కూడా కబ్జాలకు గురయ్యాయి.భద్రాచల సీతారాముల ఆలయానికి సంబంధించిన భూములపైనా ‘బడా బాబు’ల కన్ను పడింది. భద్రాచల ఆలయానికి మాన్యంగా ఉన్న భూముల్లో ఎక్కువశాతం ఆంధ్రప్రదేశ్‌ లోనే ఉన్నాయి. ఆ భూములను కొందరు రైతులు కౌలు చేసుకుని, కౌలు సొమ్మును ఆలయానికి జమ కడుతున్నారు. ఈ దేవాదాయ భూముల్లో కొందరు నేతల ప్రోద్బంలతో చేపల చెరువులు తవ్వారు. ఆలయ భూముల్లో వ్యవసాయం తప్ప మరే ఇతర వ్యాపారాలూ చేయకూడదని చట్టం ఉంది. దాన్ని తుంగలో తొక్కి వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాదు అక్రమ ఇసుకను దాచడానికి ఈ ఆలయ భూములను ఉపయోగిస్తున్నారు. భద్రాచలం పరిధిలోని దేవాలయ భూముల్లో అక్రమంగా తరలించే ఇసుకను నిల్వ చేయడం, ఆ భూముల్లోని ఇసుకను కొల్లగొట్టి అమ్ముకోవడం వంటివి చేస్తున్నారు.

ఏం చేయాలి..?: భద్రాద్రి అభివృద్ధి చెందాలంటే… చట్టాలను ఉల్లఘించిన అక్రమార్కుల జాబితాను రూపొందించాలి. వారి ఫోటోలతో సహా బహిరంగ ప్రకటనల ద్వారా ప్రజలకు నిజాలు చెప్పాలి. ఈ విధంగా జరిగితే.. భద్రాద్రి రాముడి ఆదాయం ఏటా పాతిక లక్షల రూపాయల నుంచి 200 కోట్లకు పెరుగుతుంది.

చివరిగా..: తప్పు చేయని రామదాసు జైలు జీవితం అనుభవించిన విషయం తెలిసిందే. భద్రాచలం రాముల వారికోసం రామదాసుగా చెప్పుకునే కంచెర్ల గోపన్న అష్టకష్టాలు పడి గుడి కట్టించారు. జైలుకు వెళ్ళారు. తప్పు చేసిన కబ్జా భూ బకాసురులు మాత్రం జల్సాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. పాలకులారా విూరు యజ్ఞాలు, యాగాలు చేయండి. భద్రాచలం సీతారాముల కోసం చేయాల్సిందల్లా నిస్వార్థంగా కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాములోరిని కోటీశ్వరుడిని చేయండి.

శ్రీరస్తు.. శుభమస్తు… కళ్యాణమస్తు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here