ఆ ఇద్దరి మధ్యే..

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు రాహుల్‌, మోడీల మధ్యే జరుగుతాయని, తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీవేనని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌ విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆమె డి.కె. అరుణతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కుట్రలు జరిగాయని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికలు రాహుల్‌, మోడీ మధ్య జరిగేవే అని, ఎన్నికల్లో న్యాయం గెలుస్తుందన్నారామే. పోటీ చేయాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని విజయశాంతి చెప్పుకొచ్చారు. రైతులకు రోజుకు 17రూపాయలు ఇస్తా అని మోడీ మోసం చేస్తున్నారని విమర్శించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్‌ ఒక్క హావిూ కూడా అమలు చేయలేదని ప్రజలు మేల్కోవాలని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ హెచ్చరించారు. క్యాంపెన్‌ పై త్వరలో రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తామని విజయశాంతి వివరించారు. ప్రజా కూటమి కొంత మందికి నచ్చలేదని, టీడీపీ విూద తెలంగాణ ప్రజల్లో కోపం ఉందని ఆమె చెప్పారు. కూటమి తో వెళ్తామా.. లేదా అనేది అధిష్టానం చెప్తుందని వివరించారు. ఈవిఎంల బదులు బ్యాలెట్‌ పేపర్‌ కావాలని అడుగుతున్నా..ఎన్నికల కమిషన్‌ ఎందుకు ముందుకు రావడం లేదో అర్ధం కావడం లేదని విజయశాంతి అన్నారు. అనంతరం మాజీ మంత్రి డి.కె. అరుణ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అడ్డదారిన అధికారంలోకి వచ్చిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ధోరణిలో టీఆర్‌ఎస్‌ ఉందన్నారు. అసాధ్యం అనుకున్న తెలంగాణను కాంగ్రెస్‌ ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ కేంద్రంలో బీజేపీకి టీఆర్‌ఎస్‌ వత్తాసు పలుకుతోందని అలాంటిది… ఇప్పుడు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామంటూ మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. విభజన హావిూలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని డీకే అరుణ అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరుగుతుంటే, ఇక్కడ బ్యాలెట్‌ పెట్టడానికి అభ్యంతరాలు ఏంటని డీకే అరుణ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here