మూడు రాష్ట్రాల్లో.. అకాల వర్ష భీభత్సం

0
  • వర్షాలు, పిడుగుపాటులతో 32మంది మృతి
  • పెద్ద ఎత్తున దెబ్బతిన్న పంటలు
  • మృతుల కుటుంబాలకు రూ.2లక్షల
  • పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఓపక్క దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొనగా.. మరోపక్క మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అకాల వర్షం, ఇసుక తుఫాను ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈమూడు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా అకాలవర్షం, ఇసుక తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వర్షాలు, పిడుగుపాటుతో ఇప్పటికే 32మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున పంట నష్టం కూడా జరిగింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌, శ్రీగంగానగర్‌, అజ్మేర్‌, కోట, పిలానీ ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఇసుక తుపాను సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడ్డట్లు అధికారులు తెలిపారు. ఇక గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. గుజరాత్‌లోని సబర్కంతా జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కోసం వేసిన టెంట్లు తుపాను కారణంగా కూలిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 16, గుజరాత్‌లో 10. రాజస్థాన్‌లో ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వర్షాలపై ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా స్పందించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, తుపాను ప్రభావిత ప్రజలకు అన్నివిధాల సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అకాల వర్షంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మోదీ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here