ఉమ్మడి కుటుంబంలో… సర్పంచ్‌ ఖాయం

0

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ఎన్నికలతో పల్లెల వాతావరణం వేడెక్కుతున్నాయి. అందులో ఊరిలో ఉంటున్న బంధాలు.. బంధుత్వాలు తెరపైకి వస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన తండా పంచాయతీలో 100 నుంచి 150 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇక్కడ 17 మంది ఓటర్లకు ఒకటి చొప్పున వార్డులుగా విభజించారు. ఒక వార్డుకు ముగ్గురు పోటీలో ఉంటే ఏడు ఓట్లు వస్తే చాలు విజయం సాధించినట్లే. అంటే పెద్ద కుటుంబం ఉంటే చాలు వార్డు సభ్యుడిగా విజయం సాధించవచ్చు. ఇక పంచాయతీ అంతా కలిసి 150 మంది ఓటర్లు ఉండటంతో చుట్టాలు మద్దతు ఇస్తే చాలు సర్పంచి అవ్వడం పెద్ద కష్టం కాదు. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పడిన మోక్యాతండా పంచాయతీలో 124 మందికి 20 ఓటర్లకు

ఒకటి చొప్పున ఆరు వార్డులుగా విభజించారు. ఇలాంటి పంచాయతీలు పదిహేను వందల వరకు ఉన్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుతో ఒక వైపు పాలన సులభతరం కానుంది. మరోవైపు తక్కువ ఓటర్లు ఉండే గ్రామాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. తక్కువ జనాభాతో ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో రాజకీయ సవిూకరణాలు మారనున్నాయి. దాదాపు రెండు నుంచి మూడు వేల పంచాయతీల్లో ఆసక్తికర అంశాలు చోటుచేసుకోనున్నాయి.

ఎన్నికలపై ప్రభావం… గిరిజనులు ఎక్కువగా ఉన్న పూర్వ ఖమ్మం, వరంగల్‌, మహాబూబ్‌ నగర్‌, నల్గొండ జిల్లాలకు కొత్త పంచాయతీల ఏర్పాటు కలిసొచ్చింది. ఇప్పటివరకు అనుబంధ గ్రామాలు దూరంగా ఉండడంతో ఎక్కువ జనాభా ఉన్న గ్రామ అభ్యర్థులకే సర్పంచి పదవులు వరించేవి. తెలంగాణ ప్రభుత్వం 500 జనాభా ఉన్న గిరిజన గూడెం, తండాలతో పాటు గిరిజనేతర గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చింది. దీనికితోడు పంచాయతీ కేంద్రాలకు దూరంగా ఉండి 300 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో ఆయా గ్రామాల ప్రజలకే సర్పంచి పదవులు వరించనున్నాయి. తక్కువ ఓటర్లు ఉండడంతో పంచాయతీ సమరంలో ఇది ప్రభావం చూపనుంది.

కలిసొచ్చిన నూరుశాతం: తక్కువ జనాభాతో ఆవిర్భవించిన పంచాయతీలు

ప్రతి ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 వరకు ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచులకు అంతగా పోటీ ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు గిరిజనులకు కలిసొచ్చి ంది. నూరుశాతం గిరిజన జనాభా ఉన్న పంచాయతీలను ప్రత్యేకంగా వా రికే రిజర్వ్‌ చేశారు. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న పంచాయతీలను వారికి కేటాయించి మిగతా పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించారు.

ఏకగ్రీవం: ప్రత్యేకంగా రిజర్వేషన్‌ కేటాయించిన పంచాయతీల్లో గిరిజనులే సర్పంచులు కానున్నారు. అదే విధంగా ఈ పంచాయతీల్లో బంధుత్వం బలంగా ఉన్న అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎక్కువ గిరిజన పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఖర్చు తట్టుకునేదెలా..: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు గ్రామాల్లో స్థానిక నాయకుల చేతుల విూదుగానే ఖర్చు చేయించారు. డబ్బు, మద్యం వారి ఆధ్వర్యంలోనే సాగింది. ఒక్కొక్క అభ్యర్థి రూ. కోట్లల్లో ఖర్చు చేసినట్లు అంచనా. నామినేషన్‌ మొదలు ఈ నెల 7వ తేదీ పోలింగ్‌ రోజు వరకు ప్రచార ఖర్చు, నాయకులు, కార్యకర్తలకు భోజనాలు, మద్యం, ప్రచారానికి రోజుకు రూ. 300 నుంచి రూ. 500ల వరకు కూలీ చెల్లించి జనాన్ని రప్పించడం..చివరకు ఓటర్లను, కుల, యువజన, మహిళా సంఘాల సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలు, డబ్బు పంపిణీ మొత్తం తడిసిమోపెడైంది. అభ్యర్థులే ఖర్చు భరించినా.. డబ్బు, మద్యం వెళ్లింది మాత్రం స్థానిక నాయకుల చేతుల విూదుగానే. ఆ ఖర్చు చూసే నాయకుల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇప్పుడు సర్పంచి బరిలో నిలిస్తే జనాన్ని ఓట్లు అడగాలంటే .. ఏమిస్తావని జనం అడిగే అవకాశం ఉందని ఆశావహులు

భయపడిపోతున్నారు.

పల్లెపోరులో కనీసం రూ. 5 లక్షలకుపైనే..: గ్రామ పంచాయతీ సర్పంచిగా

పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న గ్రామంలో రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ,పెద్ద గ్రామాల్లో కనీసం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆదాయం ఎక్కువగా వచ్చే ఇచ్చోడ, బోథ్‌, బేల, ఉట్నూర్‌ లాంటి పంచాయతీల్లో రూ. 20 లక్షల వరకు ఖర్చు తప్పదని ఆశావహులే చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2018 శాసన సభ ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చులే, పంచాయతీ ఆశావహులను కలవర పెడుతోంది. ఇంతకాలం పంచాయతీ పదవి కోసం ప్రజలతో మమేకమైన నాయకులు, అంతా ఖర్చు చేయడం వద్దు.. ఆ పదవి వద్దంటూ ఆశలు వదులుకున్నారు.

మహిళలే.. మహారాణులు: రిజర్వేషన్‌ ప్రకారం 50% మహిళలకు సర్పంచ్‌ పదవులు అధికారికంగా దక్కనున్నాయి. అయితే ఈ యాభై శాతం ఉన్నా… స్థానిక రాజకీయాలకు తోడు బేసి సంఖ్య ఉన్న పంచాయితీలలో మహిళలలకే అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మహిళలలకు అనుకున్న దానికన్న ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంది.

కొత్త పంచాయతీల్లో.. ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. కొత్త పంచాయతీలుగా ఏర్పడిన గిరిజన తండాలు, మారుమూల పల్లెల్లో ఎన్నికలే కొత్త.. ఖర్చు ఎలా ఉంటుందోనని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభ్యర్థుల పేరిట పెత్తనం చేసిన చేతులే ఇప్పుడు స్వయంగా ఓట్లు అడగాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే భారీ ఎత్తున ఖర్చు తప్పదని భయపడిపోతున్నారు. మరో వారం, పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటర్లకు కాసుల పండగే కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here