Featuredప్రాంతీయ వార్తలు

– ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం

జులై 15లోగా పనులు పూర్తికావాలి

  • రేయింబవళ్లు కష్టపడి లక్ష్యం సాధించాలి
  • అధికారులకు, వర్క్‌ ఏజెన్సీలకు ఆదేశాలు
  • నీళ్లకోసం రైతులు కోటి ఆశలు
  • రాంపూర్‌ వద్ద పంప్‌హౌస్‌ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీని రెండు వ్యారాల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించడం ఇది రెండోసారి. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోన్న ప్రభుత్వం పనులను పరుగులు పెట్టిస్తోంది. కాళేశ్వరం పూర్తయితే 13 జిల్లాలు, 80 నియోజకవర్గాల్లో సాగు-తాగునీరు అందుబాటులోకి వచ్చి తెలంగాణ సస్యశ్యామలం కానుంది. ఈ ఏడాదే కాళేశ్వరాన్ని కంప్లీట్‌ చేసి దాదాపు 40లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రెండు వారాల వ్యవధిలో రెండోసారి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్టోబర్‌ నాటికి నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా రాంపూర్‌లో ఎస్సారెస్పీ పంప్‌ హౌస్‌ను పరిశీలించిన కేసీఆర్‌ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జులై 15లోగా మొత్తం మోటార్లు బిగించి, అక్టోబర్‌ నాటికి రెండు పంటలకు నీళ్లివ్వాలని, అదే సమయంలో ఎస్సారెస్పీని నింపాలని ఆదేశించారు.

జగిత్యాల :

జులై 15వ తేదీ లోగా రాంపూర్‌ పంప్‌హౌస్‌ పనులు పూర్తికావాలని, ఆమేరకు అధికారులు వర్క్‌ ఏజెన్సీలు రేయింబవళ్లు పనిచేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సూచించారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్‌ వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్‌హౌస్‌ పనులను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మోటర్ల బిగింపు పనుల పురోగతిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జులై 15వ తేదీ లోగా పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. రెండు రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఆదేశించారు. ప్రారంభోత్సవానికి వస్తానని సీఎం ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాది శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నింపుతామని, జులై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరుకు, ఎస్సారెస్పీకి నీటి పంపింగ్‌ జరగాలన్నారు. దీనికి అవసరమైన విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లు చూసుకోవాలని, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు రెండో పంటకు ఈ ఏడాది నుంచే నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్‌ అన్నారు. సిబ్బందిని ఎక్కువ మందిని పెట్టుకుని రేయింబవళ్లు పనిచేసి లక్ష్యం సాధించాలని వర్క్‌ ఏజెన్సీలకు కేసీఆర్‌ సూచించారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. దశాబ్దాల తరబడి అనుభవించిన సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో ఉన్నారని సీఎం పేర్కొన్నారు. రైతులకు సాగునీరందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని కేసీఆర్‌ తెలిపారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తపోతల పథకాలను నిర్మిస్తుందన్నారు. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని, దాదాపు 80శాతం జిల్లాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టు ఇదన్నారు. ఒక్కసారి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, అందుకే ప్రభుత్వం ఎక్కడా నిధుల కొరత రాకుండా, భూసేకరణ సమస్య లేకుండా, విధాన నిర్ణయాల్లో జాప్యం జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు సీఎం కేసీఆర్‌ తెలిపారు. దాని ఫలితంగానే ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని తెలిపారు. కాళేశ్వరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 15-20 ఏళ్లు పడుతుందని, కానీ, తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల అతి తక్కువ సమయంలోనే ప్రధానమైన బ్యారేజీలు పంపుహౌజ్‌ లు నిర్మించి గోదావరి నీటిని ఎత్తి పంట పొలాలకు తరలించనుందన్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమన్నారు. వచ్చేనెల నుండే నీటి పంపింగ్‌ ప్రారంభించాల్సి ఉన్నందున అధికారులు, ఇంజనీర్లు, వర్క్‌ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో గ్రహించి అధికారులు, వర్క్‌ఏజెన్సీలు కూడా ప్రాణం పెట్టిపనిచేయాలన్నారు. చివరి దశలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ అధికారులను, వర్క్‌ ఏజెన్సీలను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, జెడ్పీ చైర్మన్‌ తుల ఉమ, సీఎంవో స్మితా సబర్వాల్‌ ఉన్నారు.

గోదావరిలో నాణాలు వేసిన సిఎం కెసిఆర్‌

మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పరిశీలన అనంతరం సీఎం బురద నేలలో కాలినడకన తిరుగుతూ గోదావరి జలాల్లోకి ప్రవేశించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సీఎం వెంట ఉన్నారు. నీళ్లలోకి ప్రవేశించిన అనంతరం సీఎం తన వెంట ఉన్నవారికి నాణెళిలను పంచి ఇచ్చారు. అందరూ కలిసి గోదావరి పుణ్యజలాల్లో నాణెలను వదిలి గోదావరి మాతకు నమస్కరించుకున్నారు. గోదావరిలో నాణాలు వదలి నమస్కరించడం ఆచారాంగా వస్తోంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close