సమస్యలపై పోరాడతా..

0

తెలంగాణా ప్రజల ఆడబిడ్డ..వృత్తిరీత్యా హైకోర్టు న్యాయవాది. ప్రవృత్తి రీత్యా సామాజిక వేత్త, మనసును చదివే సైకాలజిస్టు. ఆడవాళ్ళ సమస్యలపై ఉద్యమించి పోరాటం చేసే ఉద్యమకారిణి. తెలుగుబిసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఆమెపేరు గుండ్రాతి శారదాగౌడ్‌. కుటుంబ నేపథ్యంలో రాజకీయం ఉంది. ఆమె మీద తండ్రి ప్రభావం ఉంది. మహిళలు బైటికి చెప్పుకోడానికి ఇబ్బందిపడే సమస్యలపైనా బహిరంగ పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఆమె ఇప్పుడు భాజపా సీనియర్‌ కిషన్‌రెడ్డిపై పోటీ చేయాలని బలంగా కోరుకుంటోంది. అందుకు తెరాస పార్టీ టికెట్‌ ఇచ్చి ఆశీర్వదించాలని ఆశపడుతోంది. పనిచేయాలన్న తపన, సమస్యలపై పోరాడాలన్న సమరోత్సాహం గల గుండ్రాతి శారదా గౌడ్‌తో ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. ఎన్నికలలో నిలబడి గెలిచి ఏం చేయాలనుకుంటున్నారో ఆమెనే అడిగి ఆమె మాటలలోనే తెలుసుకుందాం.

హైకోర్టున్యాయవాది, సామాజికవేత్త, సైకాలజిస్టు గుండ్రాతి శారదతో

ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ..

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌):

ఎన్నికలలో పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు.?

బహిరంగంగా మాట్లాడలేని అనేక మహిళా సమస్యలపై నేను పోరాటం చేశాను. వీధిపోరాటాలు, బహిరంగ పోరాటాల కన్నా అసెంబ్లీ వేదిక అయితే సమస్యలను సమర్థంగా పరిష్కరించడానికి నా రాష్ట్రాన్ని ఆ కోణంలో ఆలోచింప చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నాను.

ఎన్నికలంటే మాటలు కాదు మూటలు కావాలి. మరి విూ దగ్గర ఎంత డబ్బు ఉంది.?

నా దగ్గర డబ్బు లేదు. కాని ప్రజలందరికీ అందించేందుకు అవసరమైన అమ్మ ప్రేమ ఉంది. అదే పంచుతాను.

మీరు ఆశించే సీటు భాజపాలోని బలమైన నాయకుడిదని తెలుసు కదా..!

అవును తెలుసు. కిషన్‌ రెడ్డిగారిని ఓడించడం

కోసమే రంగంలోకి దిగుతున్నా. ఆయన మహిళాపక్షపాతి. ఆయనను కలసి ఓటు అడిగితే కాదనడు..ఆయన ఓటు నాకే వేస్తారు.

బహుజన జాగృతి సంఘాన్ని దేని కోసం ప్రారంభించారు? ఏం సాధించాలని ఆశిస్తున్నారు?

? పేద, మధ్య తరగతి కుటుంబాలలోని బాలికలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి బహుజన జాగృతి సంఘాన్ని ప్రారంభించాను. ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ స్వయంగా అభినందించారు.

మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు?

నియోజక వర్గ ప్రజలను అమ్మలా కడుపులో పెట్టుకుంటాను. అక్కగా, చెల్లిగా అండగా ఉంటాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను.

నియోజక వర్గంలో మీరు గమనించిన సమస్యలేమిటి?

నియోజకవర్గంలో హిందూ ముస్లింలకు స్మశానవాటికలు విడివిడిగా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఇల్లులేని బలహీన వర్గాల ప్రజలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పించాలి. ఇందుకు కవితగారి సహకారం తీసుకుంటాను. సామాన్యులకు అందుబాటులో లేకుండా పెరిగిపోతున్న స్కూలు ఫీజులను, కాలేజీ ఫీజులను నియంత్రించడానికి నా వంతు కృషి చేస్తాను. నియోజకవర్గానికి ఒక రైతుబజార్‌ కావాలి. మహిళాపోలీస్‌ స్టేషన్‌ కావాలి. మహిళా బ్యాంకు కావాలి. మహిళల సమస్యలు చర్చించుకుని పరిష్కరించుకోడానికి ఒక మహిళా బోర్డు కావాలి. నియోజకవర్గంలో రోడ్లు ఘోరంగా ఉన్నాయి. వాటిని యుద్ధప్రాతిపదికమీద బాగుచేయించాలి. మురుగుకాల్వగా మారిన మూసీనదిని సుందరీకరించాలి. గోల్నాక నుంచి కమ్మెల వరకు ప్రక్షాళన చేయించాలి. ఫైవోవర్‌ నిర్మాణ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. బస్సు సదుపాయం లేని కాలనీలకు బస్సులు వేయించాలి. పిల్లలు, యువతకు పార్కులు ఏర్పాటుచేయించాలి. వాటిలో జిమ్‌ ఏర్పాటుచేయించాలి. అర్హులైన వారి ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు చేరవేయాలి. పట్టణ యాదవులకు బర్రెలు ఇవ్వాలి. పాల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయించాలి. మత్స్యకారులకు, చేతివృత్తుల వారికి, గౌడన్నలకు, కులవృత్తుల వారికి, మైనార్టీలకు తోడునీడగా ఉండి వారి ఇబ్బందులు పరిష్కరిస్తా. మహిళా సంఘ సభ్యులకు షరతులులేని రుణాలు ఇప్పించేందుకు కృషిచేస్తా. యువశక్తిని, మహిళాశక్తిని, ఆర్థిక, సామాజిక సుస్థిర శక్తులుగా మార్చేందుకు అనుక్షణం పాటుపడతా.

తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా..?

తప్పకుండా కేసీఆర్‌ చెప్పిన 105 సీట్ల టార్గెట్‌ రీచ్‌ అవుతాం. మాదే ప్రభుత్వం.

రైట్‌ అని ముగింపు పలికి మీ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఫలించాలని కోరుతూ శారదకు ఆదాబ్‌ హైదరాబాద్‌ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పి సెలవు తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here