స్పోర్ట్స్

నేనే స్వయంగా నిన్ను సైక్రియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్తా.. రా!

న్యూఢిల్లీ: మాటకు మాట.. పంచ్‌కు పంచ్‌ ఇది గౌతం గంభీర్‌ స్వభావం. క్రికెట్‌లోనే కాదు.. రిటైరైన తర్వాత సోషల్‌ మీడియాలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఢిల్లీలో గంభీర్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గంభీర్‌పై తాజాగా విడుదలైన ఆత్మకథలో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదీ ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు చేశాడు. ఈ విమర్శలకు దీటుగా స్పందించిన గంభీర్‌.. ‘ఆఫ్రిదీ నువ్వు చాలా సరదా మనిషివి. మెడికల్‌ టూరిజంలో భాగంగా మేం ఇప్పటికీ పాకిస్థానీలకు వీసాలు ఇస్తున్నాం. నేనే స్వయంగా నిన్ను సైక్రియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్తాలే..’ అంటూ బదులిచ్చారు. క్రికెట్‌ ఆడుతున్న సమయంలో మైదానంలోనూ, బయట ఆఫ్రిదికి, గంభీర్‌కు మధ్య అంత సఖ్యత లేని విషయం తెలిసిందే. గంభీర్‌ గురించి తన ఆత్మకథ ‘గేమ్‌ చేంజర్‌’లో ప్రస్తావిస్తూ.. డాన్‌ బ్రాడ్‌మన్‌, జేమ్స్‌ బాండ్‌కు మధ్యరకంలా గంభీర్‌ ప్రవర్తిస్తూ ఉంటాడని, ఆటలో అతనికి పెద్ద రికార్డులు లేకపోయినా.. అటిట్యూడ్‌ మాత్రం చాలా ఎక్కువ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘కొన్ని శత్రుత్వాలు వ్యక్తిగతమైనవి. కొన్ని వ త్తిపరమైనవి. గంభీర్‌ విషయానికొస్తే.. ఓహ్‌ పూర్‌ గౌతం. అతను, అతని అటిట్యూడ్‌ ప్రాబ్లం గురించి చెప్పాలి. అతనికి పెద్దగా వ్యక్తిత్వం లేదు. గొప్ప క్రికెట్‌ ఆటలో అతనొక క్యారేక్టర్‌ మాత్రమే. అతనికి పెద్ద రికార్డులు లేకున్నా అటిట్యూడ్‌ మాత్రం చాలా ఉంది’ అని ఆఫ్రిది రాసుకొచ్చాడు. 2007లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌ వన్డేలో తనకు, గంభీర్‌కు మధ్య జరిగిన గొడవను ఆఫ్రిది ప్రస్తావించాడు. అయితే, ఈ గొడవ ఆసియా కప్‌లో జరిగిందని తప్పుగా పేర్కొన్నాడు. ‘2007 ఆసియా కప్‌లో గంభీర్‌తో గొడవ నాకు గుర్తుంది. సింగిల్‌ రన్‌ను కంప్లీట్‌ చేసిన వెంటనే అతను నేరుగా నా మీదకు వచ్చాడు. ఎంపైర్లు ఈ గొడవ సద్దుమణిగేలా చేశారు. లేకుంటే నేనే చేసేవాడిని. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ సందర్భంగా మా మహిళా బంధువుల గురించి మేం ద్వైపాక్షిక చర్చకు దిగాం’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close