రాజకీయ సన్యాసానికి నేను సిద్ధం

0

కేటీఆర్‌..! నీ మాటేంటి..!

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

కొడంగల్‌లో తాను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు రేవంత్‌ చెప్పారు. కేటీఆర్‌ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, కొడంగల్‌లో తప్పకుండా గెలుస్తానన్నారు. కొడంగల్‌లో తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. గెలిస్తే కేటీఆర్‌ రాజకీయ సన్యాసంతో పాటు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ కోరాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. 2009 ఇదే రోజున (డిసెంబర్‌ 9) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన చేసిందని చెప్పారు. తెలంగాణలో రెండో ప్రభుత్వాన్ని ప్రజాకూటమి ఏర్పాటు చేయబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. డిసెంబర్‌ 7న ప్రజలు తీర్పును ఇవ్వడం ద్వారా సోనియాగాంధీకి ముందస్తుగానే ప్రజలు జన్మదిన బహుమతిని ఇచ్చారన్నారు. రాష్ట్ర ఏర్పాటులో సంపూర్ణ మద్దతు ఇవ్వడం ద్వారా స్వయం పాలన, సామాజిక న్యాయాన్ని నెరవేర్చేందుకు సోనియా సహకరించారని.. నాలుగుకోట్ల ప్రజల తరఫున ఆమెకు సంపూర్ణ క తజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. బూత్‌ల వారీగా 50 నుంచి 200 ఓట్లు తొలగించారు… ఓటుహక్కు ఇవ్వకపోవడం ద్వారా లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరిగిందని రేవంత్‌ అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ మాట్లాడుతూ తమను క్షమించాలని కోరారని.. అయితే మంత్రి కేటీఆర్‌ మాత్రం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారని ఎన్నికల అధికారులకు అభినందనలు తెలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పదేపదే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా కోర్టు తలుపులు కూడా తట్టారని రేవంత్‌ గుర్తు చేశారు. అన్ని సమస్యలను అధిగమించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు చెప్పిందన్నారు. అయినప్పటికీ కొద్ది మంది చేసిన తప్పిదాలతో ప్రజలకు తీరని నష్టం జరిగిందన్నారు. కక్షపూరిత విధానంతో తెరాసకు వ్యతిరేకంగా ఓట్లు వేసే వాళ్ల వివరాలను బూత్‌ల వారీగా గుర్తించి 50 నుంచి 200 ఓట్లు తొలగించారని రేవంత్‌ ఆరోపించారు. ఓటమిని తప్పించుకోవడానికి తెరాస ఇలా చాలా ప్రయత్నాలు చేసిందన్నారు. తప్పిదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షలకు పైగా అర్హులైన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలి… సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల తన ఓటును నమోదు చేసుకున్నారని, అర్హులైన వారి ఓట్లను తప్పించడమే ఓ పెద్ద తప్పిదమైతే..ఒకే వ్యక్తికి ఎన్నికల అధికారులు రెండు చోట్ల అవకాశం కల్పించారని రేవంత్‌ దుయ్యబట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక, గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో కేసీఆర్‌ ఓటు నమోదు చేయించుకున్నారన్నారు. రెండుచోట్ల ఓటు నమోదు చేయించుకున్నందున కేసీఆర్‌పై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తక్షణమే అధికారులు దీనిపై స్పందించాలని కోరారు. కేసీఆర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు కల్పించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here