చంద్రశేఖర్‌ రావు అను నేను…

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. వరుసగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1.25 గంటలకు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. ‘కేసీఆర్‌ అనే నేను..’ అంటూ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్‌ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, తెరాస ఎంపీలు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు. ఎలాంటి ఆడంబరాలు, హంగు ఆర్బాటాలకు పోకుండా రాజ్‌భవన్‌లోనే కేసీఆర్‌ ప్రమాణం చేయడం విశేషం. కేసీఆర్‌తో పాటు మంత్రిగా మహమూద్‌ అలీ కూడా ఇవాళే ప్రమాణం చేయడం విశేషం. ఈ నెల చివరికల్లా కేబినెట్‌ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అధిష్టానం చెబుతోంది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. తొలుత సిఎంగా కెసిఆర్‌ ఒక్కరే ప్రమాణం చేద్దామనుకున్నా మహ్మూద్‌ అలీని కూడా ప్రయమాణం చేయించారు. దీంతో ఇద్దరితో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. తదుపరి ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్‌ ఎన్నిక తరవాత క్యాబినేట్‌ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ 2014 జూన్‌ 2న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈసారి అందుకు భిన్నంగా కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 11మంది ప్రమాణం చేసినప్పుడు కూడా వారిలో మహమూద్‌ అలీ ఉండడం గమనార్హం. ప్రమాణస్వీకారం అనంతరం సభికులకు సీఎం కేసీఆర్‌ వినమ్రంగా నమస్కారం చేశారు. ఆ తర్వాత గవర్నర్‌ నరసింహన్‌.. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

గత మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మహమూద్‌ అలీ ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడూ కేసీఆర్‌ వెన్నంటి ఉండే మహమూద్‌ అలీకి సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తుండడం గమనార్హం. ఎమ్మెల్యేగా ఎన్నిక కానప్పటికీ ఎమ్మెల్సీగా గెలిపించి ఆయన్ను ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా నియమింపజేశారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయనకు ఏయే శాఖలను కేటాయిస్తారో మరో వారం రోజుల్లో తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here