రఫెల్‌పై లోక్‌సభలో హంగామా

0

ప్రధాని మోడీ తీరును దుయ్యబట్టిన రాహుల్‌

ఆడియోటేపులు ప్రవేశ పెట్టేందుకు స్పీకర్‌ నిరాకరణ

రాహుల్‌ విమర్శలను తిప్పికొట్టిన జైట్లీ

వారికి దేశ రక్షణపై చిత్తశుద్దిలేదని ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ,జనవరి2(ఆర్‌ఎన్‌ఎ): రఫేల్‌ ఒప్పందంపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ సాగింది. విపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై ఎందుకు నోరు మెదపరని అన్నారు. చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధాని మోదీ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్‌పై జైట్లీ ధ్వజమెత్తారు. ఎదరుదాడితో గతంలో జరిగిన కుంభకోణాలను ప్రస్తావించారు. బోఫోర్స్‌ తదితర కేసులకు ఎవరు బాధ్యలుని ప్రస్తావించారు. కొందరు సహజంగా నిజాలను ఇష్టపడరని జైట్లీ రాహుల్‌ని ఉద్దేశించి అన్నారు. ఆయన రఫేల్‌ ఒప్పందంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన రక్షణ కుంభకోణాల్లోని కుట్రదారులు ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై వేలెత్తి చూపిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా రాహుల్‌ ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించారు. కనీసం యుద్ధ విమానం అంటే

ఏంటో తెలియని వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్‌కు అధ్యక్షత వహిస్తున్నారంటూ విమర్శలు చేశారు.

కొందరు డబ్బుకు సంబంధించిన విషయాలను బాగా అర్థం చేసుకుంటారు, కానీ జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు అర్థం చేసుకోలేరు అని జైట్లీ దుయ్యబట్టారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణాలను లేవనెత్తడంతో పాటు బోఫోర్స్‌ కుంభకోణంలో దళారిగా వ్యవహరించిన ఖత్రోకీ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రఫేల్‌ డీల్‌కు సంబంధించిన పత్రాలు గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పడక గదిలో ఉన్నాయని గోవా మంత్రి ఫోన్‌లో మాట్లాడిన టేప్‌ ఉందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై జైట్లీ మండిపడ్డారు. అందులో ఏమాత్రం నిజం లేదని, అది కల్పిత టేప్‌ అని పారికర్‌ ఇప్పటికే ఖండించారు.. అయినా రాహుల్‌ అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అని జైట్లీ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాల్సి ఉందన్నారు.రాఫేల్‌ అంశంపై గోవా మంత్రి రాణెళి ఆడియో టేపును రాహుల్‌ సభలో వినిపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో స్పీకర్‌ మహాజన్‌ మైక్‌ను రెండు సార్లు కట్‌ చేశారు. రాఫెల్‌ డీల్‌కు సంబంధించిన రహస్యా దస్తావేజులు గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ ఇంట్లో ఉన్నట్లు ఆ ఆడియో టేపులో ఉందని ఉదయమే కాంగ్రెస్‌ ఆరోపించింది. రాఫెల్‌ కథకు ఎన్నో రంథ్రాలు ఉన్నాయని, ప్రధాని కనీసం 5 నిమిషాలు కూడా రాఫెల్‌ గురించి మాట్లాడలేదని, అందుకే ప్రధాని పార్లమెంట్‌కు రావడం లేదని రాహుల్‌ అన్నారు. యావత్‌ దేశం రాఫేల్‌ అంశంపై ప్రధానిని ప్రశ్నిస్తోందని కాంగ్రెస్‌ నేత తెలిపారు.

36 యుద్ధ విమానాల కోనగోలు కోసం చేపట్టిన కొత్త డీల్‌.. అన్ని నిబంధనలను తొక్కేసిందని రాహుల్‌ విమర్శించారు. రాఫేల్‌ విమానాల ధర 526 కోట్ల నుంచి 1600 కోట్లకు ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. రాఫేల్‌ ధర పెరగడాన్ని రక్షణ మంత్రిత్వశాఖ వ్యతిరేకించిన విషయం వాస్తవం కాదా అని రాహుల్‌ అడిగారు. పైసల కోసమా లేక దేశభక్తి కోసం ఇలా చేశారా అని రాహుల్‌ విమర్శించారు. హెచ్‌ఏఎల్‌ ఎన్నో ఏళ్ల నుంచి విమానాలను తయారు చేస్తోందని, అయితే ఎందుకు ప్రధాని తన మిత్రుడికి కాంట్రాక్టు అప్పగించారని, ముడుపుల కోసం ఎందుకు మోదీ ప్రయత్నించారని అన్నారు. రాఫేల్‌ విమానాలు అత్యవసరం అని అన్నారు, కానీ ఇంత వరకు ఒక్క విమానాన్ని కూడా ఎందుకు తీసుకురాలేదన్నారు.

రాఫేల్‌ డీల్‌పై గోవా మంత్రి రాణెళి మాట్లాడిన ఫోన్‌ కాల్‌ను సభలో వినిపించేందుకు రాహుల్‌ ప్రయత్నించారు. టేపులను వినిపించేందుకు అనుమతి కావాలని కోరారు. దాన్ని స్పీకర్‌ మహాజన్‌ అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆర్థిక మంత్రి జైట్లీ జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్‌ తప్పుడు టేపులను సృష్టించిందని, ఆ రికార్డులను సభలో వినిపించలేమని జైట్లీ అన్నారు. గోవా మంత్రి రాణెళి టేపు గురించి సభలో మాట్లాడరాదని స్పీకర్‌ కోరారు. తన ప్రసంగంలో అనిల్‌ అంబానీ పేరును ప్రస్తావించరాదు అని కూడా రాహుల్‌ను స్పీకర్‌ కోరారు. రాఫేల్‌ కొనుగోలుపై జేపీసీ వద్దు అని, పార్లమెంట్‌ విచారణ అవసరం లేదని సుప్రీం వెల్లడించలేదని, ఆ డీల్‌ గురించి నిజం తెలవాలని రాహుల్‌ గాంధీ తెలిపారు. పారికర్‌ పేరును ప్రస్తావించిన సమయంలో.. ఆయన్ను గోవా సీఎం అనరాదు అని, మాజీ రక్షణ మంత్రి అని సంబోధించాలని స్పీకర్‌ తెలిపారు. తామేవిూ భయపడడం లేదని, రాఫేల్‌పై జేపీసీ వేయాలని, రాఫేల్‌ డీల్‌ను మోదీ నాశనం చేశారని, ఆ నిజం బయటకు రావాలని, దేశమంతా మోదీని నిందిస్తున్నదని రాహుల్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాఫేల్‌ ఒప్పందంపై అనేక ప్రశ్నలను సంధించిన రాహుల్‌ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సవాలు విసిరారు.

రాఫేల్‌పై తమ ప్రశ్నలను ఎదుర్కొనేందుకు పార్లమెంట్‌కు వచ్చే ధైర్యం ప్రధాని మోడీకి లేదని, అందుకే తన గదిలో దాక్కున్నారని రాహుల్‌ ఆరోపించారు. తనపైన వ్యక్తిగత ఆరోపణలు ఏవీ లేవంటూ ప్రధాని

మోడీ మంగళవారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూను ప్రస్తావిస్తూ ఇందులో వాస్తవం లేదని, యావద్దేశం ప్రధాని మోడీని నేరుగా ఒకే ప్రశ్న వేస్తోందని రాహుల్‌ అన్నారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒక ఇంటర్వూలో ఆయన(మోడీ) 90 నిమిషాలు మాట్లాడారు. కాని రాఫేల్‌ వివాదంపై ఒక్క ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. లోక్‌సభలో ఇవాళ 193వ నిబంధన ప్రకారం రాఫేల్‌ డీల్‌పై చర్చ జరిగింది. ఆ అంశంపై రాహుల్‌ మాట్లాడిన తర్వాత దానికి ఆర్థిక మంత్రి జైట్లీ కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌.. సభలో అనుచితంగా వ్యవహరించారు. పేపర్‌ విమానాలు తయారు చేసిన ఆమె.. జైట్లీ మాట్లాడున్న సమయంలో ఆయన వైపు వాటిని విసిరారు. కొందరు ఎంపీలు తమ దగ్గర ఉన్న కాగితాలతో విమానాలను చేసి.. ఎంపీ సుస్మితా దేవ్‌కు అందజేశారు. వాటిని అందుకున్న ఆమె.. జైట్లీపై గురిపెట్టి విసిరారు. అయితే ఓ పేపర్‌ విమానాన్ని విసరగానే, కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ.. ఎంపీ సుస్మితాను అడ్డుకున్నారు. ఆమె వెన్నును తట్టి.. అలా చేయకూడదన్నారు. టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ తదితరులు కూడా ఇందులో మాట్లాడారు. కేంద్రం తీరును దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here