మానవ సంబంధాలు అద్వితీయం..ఆదర్శం

0

రోమియో-జూలియట్‌, సలీం-అనార్కలీ, దేవదాసు-పార్వతీలదే ప్రేమ అనుకుంటే పొరపాటే. తాజ్‌ మహాల్‌ కడితేనే ప్రేమ ఉందనుకుంటే అది భ్రమే.! ఓ వైపు మనిషి ఏదో ఒక స్వార్థంతో మోసాలు, దారుణాలు, అమానుషాలు, అరాచకాలు చేయడం.. చివరకు బరితెగించి నడిరోడ్డుపై బంధాలను నరుకేస్తున్న ఆధునిక సాంకేతిక ప్రపంచ ఆర్థిక సామాజిక వ్యవస్థ కళ్ళముందు కనిపిస్తోంది. మరోవైపు మనుషుల్లో ఇంకా మానవత్వం ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయని అప్పుడప్పుడు భగవంతుడు… మనవ రూపంలో భూవ్మిూద నడియాడుతూ… పరోక్షంగా నిలువెత్తుగా నిరూపిస్తాడు. ఈ వారంలో జరిగిన అలాంటి సంఘటనలు ఓ కూర్పుగా ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ప్రత్యేకంగా అందిస్తోంది.

ముత్యాల్లాంటి దంపతులు:

ముత్యాల సత్యనారాయణ ఓ అగ్రవర్ణ నిరుపేద. భారతరత్న అంబేద్కర్‌ లాగానే వీధి దీపాల వెలుగులో కష్టపడి చదువుకున్నాడు. గొడ్డుకారంతో గంజిమెతుకులు తింటూ… ఎట్టకేలకు ఎమ్మార్వో కాగలిగాడు. అడుగడుగునా అవినీతి రాజ్యమేలే ఆశాఖలో ఒక్క మెమో అందుకోకుండా… నిఖార్సుగా, నిజాయితీకి మారు రూపంగా బతికాడు. ఎన్నో పేదల కుటుంబాలలో జీవన జ్యోతులు వెలిగించాడు. నిలబెట్టాడు. తప్పు చేయడం తెలియని ఆ వ్యక్తి….అలాగే నిజాయితీగా ఒరిగి జరిగిపోయాడు. ఆయన సతీమణి ఝాన్సీ ‘లక్ష్మీ బాయి’ కూడా ఆయన జీవన పయనంలో…. చూస్తుండగా పెద్ద కూతురి ఆత్మ’హత్య’ చూసింది. పైకి చెప్పుకోలేని ఎన్నో ఒడిదుడుకులు, అపవాదులు ఎదుర్కొంది. భర్తతోనే జీవితం అంటూ నిబ్బరంగా నిలబడింది. సమస్యల ‘విధి’ని తోసి రాజంటూ కుటుంబాన్ని మహారాణిలా నిలబెట్టింది. ఆనందంగా ఉందనుకుంటున్న ఆ కుటుంబం నుంచి భర్త జరిగిపోయిన వియోగం తట్టుకోలేక భర్త చిన్నకర్మ ముగియగానే.. తానూ పసుపుకుంకుమలతో భర్తతోటే జీవితం అంటూ నిశ్శబ్దంగా, సగర్వంగా, సగౌరవంగా, సవినయంగా, సంతృప్తిగా తిరిగిరాని లోకాలకు ముత్తైదువుగా తరలిపోయింది. ఇది ఉమ్మడి కుటుంబంలోని అద్వితీయమైన మానవ సంబంధాల అనుబంధాన్ని భవిష్యత్తు తరాలకు అందించే అరుదైన, అధ్భుతమైన అసాధారణ సంఘటన. కుటుంబ సభ్యులు ఈ వరస ఊహించని హఠాత్తు పరిణామాలతో ఇంకా కోలుకోలేదు.

భార్య చితాభస్మం చూసి…

ఇదో వ్యథ

సూర్యాపేట జిల్లా, నూతనకల్‌: మూడుముళ్ల బంధంతో ఒక్కటై ముప్పైయేళ్లకు మించి ముందుకు సాగిన భార్యాభర్తలు అనారోగ్యంతో భార్య మూడు రోజుల కిందట మృతి చెందగా భార్య చితి బూడిదను దగ్గరకు చేసి కులపెద్దలకు భోజనం పెట్టాక భర్త గుండెపోటుతో కన్నుమూసిన సంఘటన నూతనకల్‌ లో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్‌ గ్రామానికి చెందిన బండపల్లి మల్లమ్మ, శ్రీరాములు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు, కుమార్తెకు వివాహం చేశారు. గ్రామంలో జీవనం కష్టంగా మారడంతో ఇద్దరు కుమారులు మద్రాస్కు వలసవెళ్లారు. కుమారుల వద్దకు వెళ్లిన మల్లమ్మ, శ్రీరాములు వారి వద్దనే ఉంటున్నారు. మల్లమ్మ(48) అనారోగ్యంతో ఈనెల 2న మృతి చెందింది. మల్లమ్మ మృతదేహాన్ని నూతనకల్‌ తీసుకొచ్చి దహన సంస్కారాలు చేశారు. మూడోరోజు చితాభస్మం దగ్గరికి చేర్చి కులపెద్దలకు భోజనం అందించారు. తీవ్ర మనోవేదనకు గురైన భర్త శ్రీరాములు(52) ఒక్కసారిగా ఉద్రిక్తానికిలోనై గుండెపోటురావడంతో సోమవారం మృతిచెందాడు. అమ్మ చనిపోయిన మూడోరోజు తండ్రి చనిపోవడంతో కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యుల నోటమాట ఆగిపోయింది. కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు అందించారు. భార్య చనిపోయిన మూడోరోజు భర్తకూడా చనిపోవడందో గ్రామంలో విశాదఛాయలు అలుముకున్నాయి.

తాత మనవడు:

అనంతపురం, వజ్రకరూరు : తాతకు మనవడంటే ప్రాణం… మనవడికి కూడా తాతంటే అంతే ఇష్టం. వారిద్దరి ప్రేమ, ఆప్యాయతలే చివరకు ఇద్దరు అనంత లోకాలకు వెళ్లేలా చేశాయి. తాతతో ప్రేమగా ఉంటూ చదువుతున్న మనవడికి ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అనంతలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గతరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్లితే… మండల పరిధిలోని పీసీప్యాపిలి గ్రామానికి చెందిన అంగడి హనుమంతు కుమారుడు బాలకృష్ణ (16) నగరంలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 1న తాత రామాంజనేయులు అమరావతి సందర్శనకు వెళ్లి వస్త్తూ మార్గమధ్యలో బస్సులోనే గుండెపోటుతో మృతి చెందారు. ప్రాణప్రదమైన తాత మరణంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని బంధువులు చెబుతున్నారు. తాత మరణించిన ఐదు రోజులకే మనవడు చనిపోవడంతో తల్లి రామాంజినమ్మ, బంధువుల రోదనలు మిన్నంటాయి. కుమారుడు చనిపోయాడని తెలియగానే తండ్రి సొమ్ముసిల్లి పడిపోగా స్థానికులు అప్రమత్తమై నీరు చల్లి ఓదార్చారు. తండ్రి, కుమారుడి మరణంతో హనుమంతు విలపిస్తుండగా చూసినవారంతా.. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ కంటతడిపెట్టారు.

చివరిగా..:

అసూయ ద్వేషాలతో.. మానవ సంబంధాలు ఆర్థిక అనుబంధాలుగా చూసే వారికి ఇది కనువిప్పు కలిగించదు. కానీ.. వీరి కోసం ఖర్చులేని ఓ కన్నీటి బొట్టు రాల్చండి. ఎందుకంటే విూ మరణం తరువాత అదే కన్నీటు బొట్టు రాల్చే మానవత్వం కోసం.

అంకితం:

ప్రపంచంలోని అభ్యాగ్యులను ఆదరించండని చెప్పిన రమణ మహర్షి, మదర్‌ థెరిస్సాలకు ఈ కథనం అంకితం. జైహింద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here