అంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఉగ్రవాదానికి అంతం ఎలా?

మంచు కొండల్లో నిప్పు రాజుకుంది.. జమ్మూ కశ్మీర్‌ లో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ పై జైషే మహ్మద్‌ ఆత్మాహుతి దాడి మన దేశానికి ముప్పేట పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియచెబుతోంది. భారత గడ్డపై కొంత కాలంగా కనిపించని ఆత్మాహుతి దాడులు మళ్లీ మొదలయ్యా యనిపిస్తోంది. భారత సరిహద్దులు మూడువైపులా ఎంత బలహీనంగా ఉన్నాయో జరుగుతున్న పరిణామాలే తెలియ చేస్తున్నాయి.. కశ్మీర్‌లో సమస్య రావణ కాష్టంలా రగులుతుండగానే తాజాగా పంజాబ్‌లో ఖలిస్తాన్‌ ఉద్యమం మళ్లీ బుసకొడుతోంది. ఇక ఈశాన్య సరిహద్దుల్లో చైనా ఎప్పటినుంచో సైలెంట్‌గా చొరబాట్లు కానిస్తూనే ఉంది. భారత్‌కు ముప్పేట ముప్పు ఏ రూపంలో ముంచుకొస్తోందో ఇప్పుడు తెలుస్తుంది.. మరీ వీటిని అరికట్టడం ఎలా..? మనం పఠించే శాంతి మంత్రం ఉగ్రమూలకు వరంగా మారుతుందా.. ఉక్కుపాదం మోపనిదే ఉగ్రవాదం అంతం ఎలా.. అసలు జమ్ముకశ్మీరు సమస్య ఏంటి..

శ్రీనగర్‌ : ఏడు దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన పాకిస్థాన్‌ కుతంత్రాలు తారస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దుల వెలుపలి నుంచి కొనసాగిన కుట్రలు ఇప్పుడు దేశంలో నుంచే పంజా విసిరాయి. గతంలో జరిగిన సర్జికల్‌ దాడులు పాకిస్థాన్‌ ను అణుమాత్రం కూడా భయపెట్టలేకపోయాయి. తాజాగా జరిగిన ఉగ్రదాడినే అందుకు నిదర్శనం. ఉగ్రవాదం భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉగ్రదాడులతో సతమతమవుతూనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం టెర్రరిస్టులకే టెర్రర్‌ గా మారాయి. ఉగ్రదాడులను ఆపలేకపోయినా….భయానక రీతిలో ప్రతీకార చర్యలు తీసుకున్నాయి. భారత్‌ లాంటి దేశాలు మాత్రం దశాబ్దాలుగా ఉగ్రదాడులపై సహనంతోనే వ్యవహరిస్తున్నాయి. ఉగ్రవాదం పెచ్చువిూరిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి భారత్‌ అందుకు సిద్ధంగా ఉందా ? పాకిస్థాన్‌ కు మరుపురాని గుణపాఠం నేర్పేందుకు వీలవుతుందా? ఉగ్రదాడులపై ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించనుందన్న అంశాలన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. పాకిస్థాన్‌ గనుక తన విధానాలను మార్చుకోకపోతే ఆ దేశం 10 ముక్కలై పోతుందని అప్పట్లో రాజ్‌ నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. పాకిస్థాన్‌ కు అవి తాటాకు చప్పుళ్ళే అయ్యాయి. అందుకే తాజా ఉగ్రదాడిలో 42 మంది జవాన్ల దేహాలు ముక్కచెక్కలుగా మారిపోయాయి. అదే నేడు భారత ప్రజానీకాన్ని ఆగ్రహావేశాల్లో ముంచెత్తుతోంది. పాకిస్థాన్‌ పై ఏదో ఒక చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ క్రమంగా ఊపందుకుంటోంది. ప్రజల ఆవేశం ఉన్న స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నది నిజమే…కాకపోతే దాన్ని భరించేందుకూ ఒక హద్దు అనేది ఉంటుంది. ప్రజల ఆవేశం ఇప్పుడు ఆ హద్దు దాటుతోంది. దాంతో ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. మరో వైపు రక్షణ బలగాలు సైతం ప్రతీకారం తీర్చుకునేందుకు తగిన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. మరి అలాంటి ఆదేశాలు ఇవ్వడంలో భారత్‌ కు ఉన్న ఇబ్బందులేంటి అన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా……లాంటి దేశాల్లోనూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అయితే ఆ దేశాలేవీ కూడా భారత్‌ తరహాలో మౌనంగా ఉండలేదు. అమెరికా అయితే ఏకంగా వేల మైళ్ళు దాటి వచ్చి పాకిస్థాన్‌ భూభాగంపై దాడి చేసి బిన్‌ లాడెన్‌ ను మట్టుబెట్టింది. ఇక ఇజ్రాయెల్‌ గురించి చెప్పనక్కర్లేదు. మానవహక్కులను, అంతర్జాతీయ నియమ నిబంధనలను సైతం పక్కనపెట్టేసింది. తమ దేశ రక్షణకే పెద్దపీట వేసింది. ఉగ్రదాడి చేయడం తరువాతి సంగతి…..అలా చేస్తారన్న అనుమానం వస్తే చాలు….వారిని కాల్చివేయడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ఇక బ్రిటన్‌ ఇతర దేశాల్లో ఉగ్రచర్యలకు పాల్పడే వారిని పెద్దగా పట్టించుకోనప్పటికీ…..తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారి పట్ల మాత్రం కఠిన వైఖరి అనుసరిస్తోంది. ఫ్రాన్స్‌ కూడా ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. చైనా విషయానికి వస్తే….ఉగ్రవాదంతో ముప్పు ఉందన్న భయంతో ఏకంగా ముస్లిం మతాన్ని అణిచివేయడం మొదలుపెట్టింది. మరి ఈ తరహా దూకుడు చర్యలు భారతదేశం ఎందుకు తీసుకోలేకపోతున్నది అనే అనుమానం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతోంది. వినే వారుంటే …..అంతా సుద్దులు చెబుతారు…ఎదిరిస్తే…అంతా నోరు మూసుకుంటారు. అమెరికా, ఇజ్రాయెల్‌ విషయంలో జరిగింది ఇదే. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఆ రెండు దేశాలు ఎంతగా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినా ఎవరూ ఏవిూ చేయలేకపోతున్నారు. భారత్‌ విషయానికి వస్తే….ఏ మాత్రం తీవ్ర చర్య తీసుకున్నా……అంతర్జాతీయ సమాజం విధించే ఆంక్షలను ఎదుర్కోనే స్థితిలో లేదు. మరో వైపు రక్షణ విభాగం పేరుకు గొప్పగా ఉన్నా లోపల ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాకిస్థాన్‌ పై తీవ్ర చర్యలు తీసుకోవడంలో భారత్‌ ముందరి కాళ్ళకు బంధాలుగా మారుతున్నాయి. అంతేగాకుండా అంతర్గతంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపనిదే బయటి శక్తులను ఎదర్కోవడం సాధ్యం కాదు.

మనం శాంతిమంత్రం…ఉగ్రమూకలకు వరంగా మారుతుందా?

నెహ్రూ హయాం నుంచి కూడా భారతదేశం శాంతి మంత్రం పఠిస్తూ వచ్చింది. చివరకు అది ప్రపంచం దృష్టిలో చేతకానితనంగా మారిపోయింది. శాంతి, సహనం మంచివే….కాకపోతే ఆత్మరక్షణలోనూ అదే ధోరణితో ఉంటే అసలుకే ఎసరు వస్తుంది. అప్పట్లో ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ ను రెండు ముక్కలు చేశారు. నేటి నాయకులు మాత్రం ఆ విషయాన్ని గుర్తు చేయడానికే పరిమితమవుతున్నారు తప్పితే అంతకు మించిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు. సర్జికల్‌ దాడుల విషయానికి వస్తే….పాకిస్థాన్‌ ను అవి పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. అందుకే ఆ దేశం అండతోనే ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. గతంతో పోలిస్తే…తాజా ఉగ్ర దాడి అనంతరం ప్రధాని మోడితో సహా మంత్రుల మాటల్లో తీవ్రత పెరిగింది. వీర జవాన్ల త్యాగాలను మరువమని నాయకులు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మరో వైపున రాహుల్‌ గాంధీ సైతం రెండు మూడు రోజులు రాజకీయాలను పక్కనబెడుతామన్నారు. ఉగ్రదాడి విషయంలో ప్రభుత్వానికి అండగా నిలబడుతామన్నారు. విపక్ష నాయకులు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే యావత్‌ దేశం స్పందించింది. పలు చోట్ల సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. ప్రతీకార దాడులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇవన్నీ కూడా ప్రజల, నాయకుల ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ ఏ దిశగా వెళ్తాయన్నది కూడా ఆందోళన కలిగించే అంశమే. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌, పాకిస్థాన్‌ లు పూర్తిస్థాయి యుద్ధానికి దిగే అవకాశం లేదు. మహా అంటే… కార్గిల్‌ తరహా పరిమిత యుద్ధాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్‌లో అలజడి రేగితే….పాకిస్థాన్‌ ముక్కచెక్కలైతే…. ఆ దేశానికి ఉన్న అణుబాంబుల భద్రత ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వంటి నాయకులు పాకిస్థాన్‌ ను నాలుగు ముక్కలు చేయాలని సూచిస్తున్నారు. అలాంటివి చెప్పేందుకు బాగానే ఉంటాయి కానీ….ఆచరణలో సాధ్యమయ్యే అంశాలు కాదు. పాకిస్థాన్‌ లోనూ వేర్పాటు వాదాలు కొనసాగుతున్నా…..అవి అంత బలంగా లేవు. పాకిస్థాన్‌ నుంచి విడిపోయే స్థితిలో ఆ ప్రాంతాలు లేవు. ఇక మిగిలిన మార్గం ఒక్కటే….అంతర్గతంగా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం….సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసుకోవడం….అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ ను ఒంటరి చేయడం. ఇవన్నీ ఒక వ్యూహం ప్రకారం జరిగితే దేశంలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదానికి కళ్ళెం వేయడం సాధ్యమే. భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌ కూడా ఉగ్రవాద బాధిత దేశంగా ఉంది. అయినా కూడా ఉగ్రవాద బాటనే ఎంచుకున్నది అంటే అందుకు ప్రధాన కారణం…పాకిస్థాన్‌ సైన్యం. ఆ దేశ రాజకీయాల్లో పాక్‌ సైన్యం ప్రమేయం తగ్గినప్పుడు మాత్రమే ఉగ్రవాదాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. అప్పటి వరకూ అటు ఆప్ఘనిస్థాన్‌ లో, ఇటు భారత్‌ లో ఉగ్రవాదం పెచ్చువిూరుతూనే ఉంటుంది. దక్షిణాసియాలో తమ ప్రాబల్యం చాటుకునేందుకు అమెరికా, చైనా లాంటి కొన్ని అగ్రరాజ్యాలు పాకిస్థాన్‌ కు తోడ్పడుతున్నాయి. వాటి తోడ్పాటు అరికట్టేందుకు భారత్‌ దౌత్యమార్గాల్లో కృషి చేయాలి. అంతర్జాతీయంగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచాలి. ఇక చివరిగా…..కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనిదే భారత్‌ ఉగ్రవాద దాడులు నిలిచిపోయే అవకాశం లేదు. ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి జరగాలి. మరో వైపున ఉగ్రవాదానికి, మతానికి మధ్య ఉండే లింక్‌ తెంచేయాలి. అలా చేయగలిగినప్పుడు మాత్రమే భారత్‌ ఉగ్రదాడులకు గురికాకుండా ఉండగలుగుతుంది.

మంచుకొండల్లో మారణ¬మం వెనుక మతలబేంటి?

మంచు కొండల్లో నిప్పు రాజుకుంది.. జమ్మూ కశ్మీర్‌ లో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ పై జైషే మహ్మద్‌ ఆత్మాహుతి దాడి మన దేశానికి ముప్పేట పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియచెబుతోంది. భారత గడ్డపై కొంత కాలంగా కనిపించని ఆత్మాహుతి దాడులు మళ్లీ మొదలయ్యా యనిపిస్తోంది. భారత సరిహద్దులు మూడువైపులా ఎంత బలహీనంగా ఉన్నాయో జరుగుతున్న పరిణామాలే తెలియ చేస్తున్నాయి.. కశ్మీర్‌లో సమస్య రావణ కాష్టంలా రగులుతుండగానే తాజాగా పంజాబ్‌ లో ఖలిస్తాన్‌ ఉద్యమం మళ్లీ బుసకొడుతోంది. ఇక ఈశాన్య సరిహద్దుల్లో చైనా ఎప్పటినుంచో సైలెంట్‌ గా చొరబాట్లు కానిస్తూనే ఉంది. భారత్‌ కు ముప్పేట ముప్పు ఏ రూపంలో ముంచుకొస్తోందో ఇప్పుడు చూద్దాం.. ముందు కశ్మీర్‌ గురించి.. కశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ అధీన రేఖను దాటి చొరబాట్లకు పాల్పడటం, కవ్వింపు కాల్పులకు పాల్పడటం కొన్నాళ్ల నుంచి మనం చూస్తున్నదే.. ఇప్పుడు ఆత్మాహుతి దళాలు కశ్మీర్‌ లోయను ఏకంగా చొరబాట్ల ప్రాంతంగా మార్చేశాయి.కశ్మీర్‌ లోయపై పట్టు కోసం ఇటు భారత్‌, అటు పాకిస్థాన్‌ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆ ఫలితమే ఇప్పుడు నిశ్శబ్దం తాండవించాల్సిన మంచుకొండల్లో ఎప్పుడూ తూటాల శబ్దాలు మార్మోగుతూనే ఉంటాయి.అల్లర్లకు బలైన కుటుంబాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, రాళ్ల దాడులు, యువత ధర్నాలు, బంద్‌ లు, రాస్తారోకోలు, మూక దాడులు..బాంబుల మోతలతో భూతల స్వర్గం కాస్తా నరకంగా మారిపోయింది. స్వాతంత్య్ర కాలంలోనూ, ఆతర్వాత 1987లో రాజీవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా ఒప్పందం కాలంలో మాత్రమే మంచుకొండల్లో ప్రశాంతత కనిపించింది . అప్పట్లో ఎన్నికలను రిగ్గింగ్‌ చేశారంటూ ఇస్లామిక్‌ పార్టీలు గోల పెట్టాయి.కశ్మీర్‌ స్వతంత్రంగా ఉండాలని కొందరు కోరుకుంటే.. మరికొన్ని వర్గాలు భారత్‌ నియంత్రణను, మరికొన్ని వర్గాలు పాకిస్థాన్‌ కంట్రోల్‌ ను కోరుకున్నాయి. ఈ క్రమంలోనే లష్కరే తోయిబా, హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ ఏ ఇస్లావిూ, హిజ్బుల్‌ ముజాహిదీన్‌, జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, జైషే మహ్మద్‌ లాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. ముస్లిం ఛాందస వాద వర్గాల జోక్యంతో ఈ ఆందోళనలు, ఆ తర్వాత కాలంలో జిహాదీ దాడులకు, ఫిదాయీ దాడులకు కారణమయ్యాయి. నిరుద్యోగ కశ్మీర్‌ యువతను ఆకర్షించిన ఉగ్రవాద ముఠాలు వారికి శిక్షణ నిచ్చి భారత భద్రతా దళాలపై రాళ్ల దాడులకు పురికొల్పాయి. చొరబాటుదార్ల మాటలను నమ్మి మతం మత్తులో మునిగిన యువత ఉగ్రవాద శిక్షణ పొంది ఇదిగో ఇలా దాడులకు పాల్పడుతోంది. గురువారం నాటి దాడులకు కారకుడైన అదిల్‌ అహ్మద్‌ దార్‌ కూడా అలాంటి వాడే..జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా లాటి సంస్థలు ఉత్తర కశ్మీర్‌ పై పట్టు సంపాదించాయి. 2016లో ఉరీ దాడులు, పఠాన్‌ కోట్‌ విమానాశ్రయంపై దాడులు అలాంటివే..

ఏంటీ కాశ్మీర్‌ సమస్య!!

ఇక ఈశాన్య భారత సరిహద్దుల్లో చైనా చెలరేగిపోతోంది. భూటాన్‌, చైనాల మధ్య డోక్లాం పాసేజ్‌ ద్వారా భారత్‌ విూదుగా ఒక రోడ్డు నిర్మాణాన్ని తలపెట్టిన చైనా ఆ నెపంతో భారత సరిహద్దుల్లోకి చొరబడుతోంది. చైనా చొరబాట్లను పసిగట్టిన భారత్‌ 270 భారత బలగాలతో , రెండు బుల్డోజర్లతో భూటాన్‌ సరిహద్దుల దాకా కవాతు జరిపి చైనాను నిలువరించింది. ఈ ప్రయత్నం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంగా మారిపోయింది.భూటాన్‌ తరపున స్పందిస్తున్నట్లు భారత్‌ చెప్పుకున్నా.. సరిహద్దు తగాదాలో ఏ దేశం వాదన దానిదే.. ఈశాన్య రాష్ట్రాలకు దారిగా చెప్పుకునే చికెన్‌ నెక్‌ మార్గాన్ని చైనా దురాక్రమించి ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రంతో సంబంధాలు లేకుండా తెంపేయాలని చూస్తోంది. ఇది చైనాతో ఒక తీరని తగవులా మారిపోయింది. డోక్లాం రోడ్డు నిర్మాణం పేరుతో చైనా రేపిన ఈ సరిహద్దు తగవు భారత్‌ కు ఆ సరిహద్దులో కంటి విూద కునుకు లేకుండా చేస్తోంది.2018 మార్చి 26న చైనా విదేశాంగ ప్రతినిధి డోక్లాం చైనాదేనంటూ ప్రకటించారు. భారత్‌ దురాక్రమణకు ప్రయత్నించిందంటూ ఎదురు దాడి చేశారు. అప్పటి నుంచి నేటి వరకూ భారత, చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్య అలా కొనసాగుతూనే ఉంది.. ఒకవైపు పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రమూకల దాడులు, మరోవైపు సరిహద్దుల్లో చైనా చొరబాట్లు మన రక్షణ దళాలకు కంటి విూద కునుకు లేకుండా చేస్తున్నాయి.పైగా శత్రువు శత్రువు మిత్రుడేనన్నట్లు పాకిస్థాన్‌, చైనా స్నేహ గీతం పాడుకుంటూ భారత్‌ ను దెబ్బ తీయడంలో ఒకరినొకరు సమర్ధించుకుంటున్నారు. ఇద్దరికీ శత్రువు మనదేశమే. పైకి మాత్రం చెరగని చిరునవ్వుతో స్నేహ హస్తం చాస్తుంటాయి. ఈ రెంటి సమస్య చాలదన్నట్లుగా కొన్ని స్వదేశీ ఉద్యమాలూ మనకి తలనొప్పులు తెచ్చాయి.. ఇంకా తెస్తున్నాయి.పంజాబ్‌ లో ఒకప్పుడు వినిపించిన ఖలిస్తాన్‌ ఉద్యమం మళ్లీ ఇప్పుడు రెక్కలు తొడుగుతోంది. తమక ప్రత్యేక దేశమే కావాలంటూ 1971లో ప్రారంభమైన ఖలిస్తాన్‌ ఉద్యమం పతాక స్థాయికి చేరి ప్రధాని ఇందిరను పొట్టన పెట్టుకుంది. ఖలిస్తాన్‌ ఉద్యమ నేత భింద్రన్‌ వాలే ను బ్లూ స్టార్‌ ఆపరేషన్‌ లో మట్టు పెట్టడంతో ఈ ఉద్యమం మరింత పెచ్చరిల్లింది. ఆ తర్వాత కనిష్క విమానం బాంబు పేలుడు 328 మందిని బలిగొంది. సిక్కు ఆందోళనాకారులు తీవ్రవాదులుగా మారి కొన్నాళ్లు పంజాబ్‌ ను అతలాకుతలం చేసినా మాజీ ప్రధాని పీవీ హయాంలో దీనిని పూర్తిగా నియంత్రించగలిగారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటూ ఖలిస్తాన్‌ ఉద్యమం కనిపించకపోయినా.. ఈ మధ్యకాలంలో కొంత కాలంగా మళ్లీ వేర్పాటు వాదం బుసలు కొడుతోంది. సోషల్‌ విూడియాలో ఖలిస్తాన్‌ ఉద్యమ వీరుల్లా కొందరు పోస్టింగులు పెడుతున్నారు.అయితే ఈ సారి ఉద్యమం రూపు, షేపు మారిపోయాయి. గతంలో లా సిక్కు గెడ్డాలు, కత్తులు లేవు.. ఇప్పటి ఖలిస్తానీ ఉద్యమ కారులు చాలా నీట్‌ గా షేవ్‌ చేసుకుని.. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగుల్లా కనిపిస్తున్నారు.అయితే వీరికి బయట దేశాల నుంచి వెన్ను, దన్ను అందుతోంది. ఖలిస్తాన్‌ ఉద్యమ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ నేటి తరం నయా మిలిటెంట్ల కుటుంబాలు వేటికీ గతంలో ఈ ఉద్యమంతో సంబంధమే లేదు.. అలాగని1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కుటుంబాలకు చెందిన వారూ కాదు.. పంజాబ్‌ లో 1980-90 మధ్య కాలంలో చెలరేగిన హింసకూ వీరికి సంబంధం కూడా లేదు. ఈ కొత్త తరం ఖలిస్తాన్‌ వేర్పాటు వాదులను కెనడాలోని కొన్ని ఉగ్రవాద సంస్థలు శిక్షణ, నిధులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నాయని ఇంటెలిజెన్స్‌ దర్యాప్తులో తేలింది. వీరి వ్యూహాలు కూడా కొత్త తరహాలోనే.. వీరు సైబర్‌ స్పేస్‌ వాడుతూ ఉద్యమాలు నడుపుతున్నారు. లూధియానాలో ఆరెస్సెస్‌ సభ్యులను, డేరా సచ్చా సౌదా అనుచరులను, ఒక క్రిస్టియన్‌ పాస్టర్‌ ను చంపిన సంఘటనతోనే ఖలిస్తాన్‌ మలిదశ ఉద్యమం వెలుగులోకి వచ్చింది. ఇలా భారత్‌ పై ముప్పేట దాడి జరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close