Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

అధినేత ప్రసంగంపైనే ఆశలు..

  • నేడే కెసిఆర్‌ ఎన్నికల ప్రచారం..
  • పెరుగుతున్న ఆర్టీసీ సెగ..
  • హుజూర్‌నగర్‌లో వ్యూహం ఫలించేనా..
  • అధికార పార్టీ అభ్యర్థి గెలిచేనా….

తెలంగాణలో గత పది, పదిహేను రోజుల నుంచి పాలన పరిస్థితులు అదుపు తప్పినట్టే కనిపిస్తున్నాయి. నిరవధికంగా, అలుపు లేకుండా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్‌లో పోటాపోటీగా సాగుతున్న ఉప ఎన్నికల ప్రచారంతో నాయకగణమంతా బిజీబిజీగా మారిపోయారు. ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్న టిఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు మాత్రం నిద్రలేకుండా చేస్తున్నట్లు తెలిసిపోతుంది. ఉప ఎన్నికనే కదా అని ఈజీగా తీసుకున్న తెలంగాణ అధినేత కెసిఆర్‌ అక్కడి పరిస్థితులను చూసి తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడని అర్థమైపోతుంది. ఉప ఎన్నికల ప్రచారానికి టిఆర్‌ఎస్‌ ఆగ్రనేత కెసిఆర్‌ వస్తున్నారని టిఆర్‌ఎస్‌ నాయకత్వమంతా అధినేత ప్రచారానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అధినేత చేసే ప్రసంగం మీదనే పార్టీ శ్రేణులు అక్కడ గెలుపుపై కోటి ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. పార్టీ అధినేత కెసిఆర్‌ ఎన్నికల ప్రచారంలో ఉప ఎన్నికల గురించే ప్రస్తావిస్తారా లేదా రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై కూడా మాట్లాడుతారా అనేది తెలియాల్సి ఉంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి) :

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ తీరుకు నిరసనగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలన్నీ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నాయి. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై సవిూక్షలు, పత్రికా ప్రకటనలు మినహాయిస్తే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ నేరుగా కామెంట్‌ చేసిన సందర్భాలు లేవు. సమ్మెపై ప్రభుత్వం వైఖరిని అధికారులకు వివరిస్తున్న సీఎం కేసీఆర్‌. తొలిసారి ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఉప ఎన్నికలు జరగబోయే హుజూర్‌ నగర్‌ ఇందుకు వేదిక కానుందని సమాచారం. ఎల్లుండి హుజూర్‌ నగర్‌లో జరగనున్న బహిరంగ సభలో పాల్గననున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఓటు వేయాలని హుజూర్‌ నగర్‌ ప్రజలను కోరనున్నారు. అయితే హుజూర్‌ నగర్‌లో కేసీఆర్‌ ఏం మాట్లాడతారనే అంశంపై అక్కడి ప్రజలతో పాటు మొత్తం తెలంగాణ వాసులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మిక సంఘాలు పట్టువీడకపోవడంతో… ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దీంతో అసలు ఆర్టీసీ విషయంలో కేసీఆర్‌ ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ? ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు హుజూర్‌ నగర్‌ వేదికగా తన వాదన వినిపిస్తారా ? అన్నది ఆసక్తి రేపుతోంది. హుజూర్‌ నగర్‌లో సీఎం కేసీఆర్‌ కేవలం నియోజకవర్గ సమస్యలకు మాత్రమే పరిమితమయ్యేలా మాట్లాడితే అది టీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం లాభించదనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే తీవ్ర ప్రతికూలతలను సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్టగా పేరున్న కేసీఆర్‌… హుజూర్‌ నగర్‌ వేదికగా ఏం చేస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.

హోరాహోరీగా ఎన్నికల ప్రచారం.. :

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారం ¬రా¬రీగా సాగుతోంది. పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నాయి. తమకు కంచుకోట లాంటి హుజూర్‌నగర్‌ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల బరిలో ఉత్సాహంగా దూకే టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనా ఉత్తమ్‌ ఫ్యామిలీకి చెక్‌ పెట్టడం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ప్రచారానికి తుది గడువు దగ్గర పడుతున్న తరుణంలో గురువారం సీఎం కేసీఆర్‌తో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం టీఆర్‌ఎస్‌ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే ఈ సభను ట్రెండ్‌ సెట్టింగ్‌ సభ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటేస్తారన్నారు. హుజూర్‌నగర్లో గెలిచి తీరుతామని టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్‌ కేడర్‌ బలంగా ఉన్నప్పటికీఎన్నికల ముందు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు గులాబీ గూటికి చేరారు. ఇది తమకు కలిసొస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ సంఖ్యలో నేతలను మోహరించింది. ముందుగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలతో మద్దతు ఉపసంహరించుకుంది. కానీ ఈ ప్రభావం తమ మీద ఉండబోదని పైగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఈ ఎన్నికలో బరిలో దిగుతుండటం తమకు కలిసొస్తుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. హుజూర్‌నగర్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించిన తర్వాత కారు టాప్‌ గేర్‌లో దూసుకెళ్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయనేది చూడాల్సిందే అంటున్నారు సీనియర్‌ నాయకులు..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close