చటుక్కున సీట్లు కొట్టేసే…పారాషూటర్లు

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తొండ ముదిరితే ఊసరవెల్లి’. నాయకుడు ముదిరితే ఫిరాయింపు. ఈ నాయకులు వేదికలెక్కి మాట్లాడుతుంటే… నీతీ మౌనంగా రోదిస్తుంది. నిజాయితీ భయపడుతుంది. అధికారం కోసం అప్పటిదాకా ఉన్న పార్టీని ఎలాంటి బెరుకు లేకుండా వదిలిస్తారు. నిసిగ్గుగా, నిర్భయంగా మరో పార్టీకి ‘జంప్‌’ చేసి అక్కడ నీతులు వల్లేస్తారు. ఇవన్నీ చూసి ఓటరు..”ఔరా..! రాజకీయానికి రంగు, రుచి, వాసన ఉండదు. ఉన్నదల్లా.. సంపాదనే మార్గం. ధ్యేయం.

తెరాసలో తెర: సీట్ల కోసం కారెక్కిన ఆశావాహులు ఒక్కసారిగా కంగుతిన్నారు. సీటురాని వలస నేతలకు కారు మబ్బులు కమ్మాయి. తెరాసలో చేరే ముందు వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలకు సీట్లు వస్తాయనే బలమైన నమ్మకం వారికుంది. నాడు కొందరు అధిష్ఠాన ఆశీస్సులతో ‘టికెట్‌ గ్యారంటీ’ అని భావించి చేరితే.. మరికొందరు పక్కా హావిూతోనే గులాబీ గూటికి చేరారు. కానీ, కథ అడ్డం తిరిగింది. దీంతో వాళ్ల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. సొంత పార్టీలో ఉన్నా టికెట్‌ దక్కేదేమో? అని ఇప్పుడు వాపోతున్నారు. గులాబీ పార్టీలో టికెట్‌ ఖరారు కాకపోవడంతో పలువురు నేతల్లో అంతర్మథనం మొదలైంది.

అటూ ఇటూ కాకుండా పోయామేమో? అని అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. కొందరు మాత్రం చివరి నిమిషం వరకు చూద్దామని ‘దింపుడుగల్లం’ ఆశతో ఉన్నారు. తమ నేతలకు టికెట్లు దక్కపోవడంతో ఆయా నేతల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. టికెట్‌ ఇవ్వకుంటే కండువా మారుస్తామని బహిరంగంగా చెపుతున్నారు. దీనికి తోడు తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించి, గత్యంతరం లేక గులాబీ గూటికి చేరిన వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని అక్కడక్కడా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. చేయి వదిలి కారెక్కిన దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ పై కన్నేశారు. మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డికి భవిష్యత్తు గులాబీనేత చేతుల్లో ఉంది.

చేయి పట్టుకొని..: తెరాసలో సీట్లురాని కొండాసురేఖ(పరకాల), రామేష్‌ రాథోడ్‌ (ఖానాపూర్‌) నుంచి కాంగీ టిక్కెట్లు దక్కాయి.

‘గులాబీ’ నుంచి ‘కమలం’: ఆథోల్‌ నుంచి బాబూమోహన్‌, బుడిగె శోభలకు గులాబీనేత సీట్లు ఇవ్వను పొమ్మన్నారు. అంతే వారిద్దరూ ఏంచక్కా కమలం పార్టీ పక్కన చేరారు. వారికి సీట్లు ఖరారు. హఠాత్తుగా సీనీపరిశ్రమకు చెందిన బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొని సీటు కోసం క్యూలో ఉన్నారు.

తెలుగుదేశంలో..: నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించబోతుంది. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌ భార్యే సుహాసిని. ముందుగా కళ్యాణ్‌ రామ్‌ అనుకున్నారు కానీ ఆయన అసక్తి చూపలేదు. దీంతో సుహాసిని పేరు ఖారారైంది.

ఖర్మ ఇలా కాలింది..!: మాజీ మంత్రి సుద్దాల దేవయ్య బాధ ఇది. 37 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. టికెట్‌ ‘టెప్ట్‌’ చేసింది. టీడీపీలో ఉన్న ఆయనకు కాంగ్రెస్లో చేరితే టిక్కెట్‌ ఖచ్చితంగా ఇప్పిస్తానని నమ్మించిన ప్రభాకర్‌ ప్రస్తుతం టిక్కెట్‌ రాకుండా చేశారని దేవయ్య ఆరోపిస్తున్నారు. ‘టీడీపీలో ఉండి ఉంటే.. టికెట్‌ నా ఇంటికే నడిచి వచ్చేది..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దేవయ్యను కాదని ఇటీవలే పార్టీలో చేరిన సత్యంకు టిక్కెట్‌ కేటాయించింది కాంగ్రెస్‌. దేవయ్య ఏదో పార్టీ నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.

వైరా రూటే సపరేటు: ఖమ్మంజిల్లా, వైరా నియోజకవర్గం కాంగ్రెస్‌ కంచుకోట. ఈ సీటు కూటమిలో సిపిఐకి ఖరారైంది. బాణోత్‌ విజయ బరిలోకి దిగుతోంది. ఈమె తండ్రి పేరు గుగులోతు ధర్మా సిపిఎం పార్టీకి అనుకూలం. ఈమె అత్త, మామ, భర్త కుటుంబం తెరాస పార్టీకి అనుకూలం అనే వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఇది తెరాస కోవర్టు ఆపరేషన్‌ లో భాగమని కాంగ్రెస్‌ ఆశావహులు అభిప్రాయ పడుతున్నారు. ఈమె భర్త జీవన్‌ బాబు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, తెరాసపార్టీ ఢిల్లీలో అధికారిక సలహాదారు రామచంద్రు నాయక్‌ దగ్గర పని చేశారు. వీరు మంచిర్యాలజిల్లాకు చెందినవారు. వైరా స్థానికులు కాదు. అయితే ఈమె గెలిస్తే తెరాస లోకి వెళుతుందని సిపిఐ పార్టీకి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.

కార్పోరేషన్‌ పదవులకు ఎసరు..: పౌరసరఫరాల శాఖ ఛైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి, మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, సాంస్కృతిక శాఖ ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ప్రభుత్వ పదవుల్లో కొనసాగరాదనే ఎన్నికల నియమావళి ఆంక్షలతో వీరంతా తమ పదవులు వదులుకోవల్సి వచ్చింది. నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్‌ రెడ్డి, సత్తుపల్లి నుంచి పిడమర్తి రవి, బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మానకొండూరు నుంచి రసమయి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు.

పారాచూట్‌ నేతలకు టిక్కెట్లా..?ఫైర్‌ బ్రాండ్‌ రేణుకాచౌదరి ఆగ్రహం

ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి ఎన్నికల అభ్యర్థుల జాబితాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. జాబితా రూపకల్పనలో సామాజిక వర్గాల సమతూకం పాటించలేదని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. పారాచూట్‌ నేతలకు అవకాశం కల్పించడం దారుణం. కమ్మ సామాజిక వర్గానికి ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదనీ.. పొన్నాల లక్ష్మయ్య సీటు రాద్దాంతం చేయడం బాధాకరం. ప్రకటించిన జాబితాలో మార్పులు జరుగుతాయని తాను అనుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌ గెలవాలని కోరుకుంటున్నా.. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని రేణుకా చౌదరి ‘ఆదాబ్‌ హైదరాబాద్‌ న్యూఢిల్లీ ప్రతినిధి’కి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here