నెలాఖరుకు హైటెక్‌ సిటీి మెట్రో?

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైదరాబాద్‌కే తలమానికంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టు ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో మెట్రో రైలును ఈ నెలాఖరు నుంచి నడపనున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ట్రయల్‌ రన్‌ చివరి దశకు చేరుకోవడంతో ఇక భద్రతా పరమైన తనిఖీలు చేపట్టాలని కమిషనర్‌ ఆప్‌ రైల్వే సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్‌)ని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఎల్బీ నగర్‌- మియాపూర్‌, నాగోల్‌-అమీర్‌పేట మార్గాలతో పోలిస్తే హైటెక్‌ సిటీ మార్గం క్లిష్టమైనది కావడంతో సీఎంఆర్‌ఎస్‌ మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని భావిస్తోంది.

అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో నవంబరు 29 నుంచి రాత్రిపూట ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. చివరి స్టేషన్‌ అయిన హైటెక్‌ సిటీలో రివర్సల్‌ లేకపోవడంతో ట్విన్‌ సింగిల్‌ విధానంలో రైళ్లు నడుపుతున్నారు. అనుకున్న ప్రకారం ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించినప్పటికీ ప్రారంభోత్సవం వరకు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. సాధారణంగా మెట్రో రైళ్లు ఒక ట్రాక్‌లో వెళితే.. మరో ట్రాక్‌లో తిరుగు పయనం అవుతాయి. అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో ప్రస్తుతానికి ఇది సాధ్యపడదు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్‌ సమీపంలో రివర్సల్‌ ఉండటంతో ఇక్కడి వరకు ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత నాలుగు స్టేషన్లు పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గం చెరువు, హైటెక్‌ సిటీ వరకు మాత్రం ట్విన్‌ సింగిల్‌ లైన్‌లోనే రైళ్లు వెళతాయి. అంటే వెళ్లిన లైన్‌లోనే తిరిగి చెక్‌పోస్టు వరకు వెనక్కి వస్తాయి. నాలుగు స్టేషన్లే కాబట్టి మెట్రో వేళల్లోనూ పెద్ద జాప్యమేమి ఉండదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 7 నిమిషాలకో మెట్రో నడుస్తోంది. ఇదే మెట్రో హైటెక్‌ సిటీ వరకు వెళుతుంది.

మెట్రోకు సంక్రాంతి జోష్‌

సంక్రాంతి పండగకు ఊరెళ్లే ప్రయాణికులతో మెట్రోలో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. శుక్రవారం సాయంత్రం నుంచి ఎల్‌బీనగర్‌ వైపు వెళ్లే మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించడం, ఓవైపు ఐటీ కార్యాలయాలకు వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో నగరవాసులు కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు బయలుదేరారు. దూర ప్రాంతం బస్సులు బయలుదేరే ఎమ్‌జీబీఎస్‌, ఎల్‌బీనగర్‌లకు త్వరగా చేరుకునేందుకు మెట్రో ఎక్కడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. మెట్రో రైలు నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఫేస్‌బుక్‌ పేజీ నిర్వహిస్తోంది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు ఇక్కడ పోస్టు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది మెట్రో సంస్థ.శుక్రవారం నాటికి ఫేస్‌బుక్‌ పేజీని అనుసరిస్తున్న వారి సంఖ్య లక్ష దాటిందని ఎల్‌ అండ్‌టీ మెట్రో ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here