Featuredస్టేట్ న్యూస్

భూలోకంలో గోవులకు నరకం

  • కొనసాగుతున్న గోవుల మరణాలు
  • సొమ్మసిల్లి పోతున్న ప్రెగ్నెంట్‌ గోవులు
  • సరైన ఆహారం, వైద్యం లేక అవస్థలు
  • గోశాల ముసుగులో ధనార్జన
  • గుట్టు రట్టు కాకుండా దొంగ మేనేజ్‌మెంట్‌
  • యాజమాన్య కమిటీ సభ్యులు ఎవరు
  • సికింద్రాబాద్‌ కవాడిగూడ గోశాల

(సొసైటీ మీడియా సర్వీస్‌ మాసపత్రిక వారి సౌజన్యంతో )

పేరుకే అది గోశాల. అక్కడ జరిగేది గోవుల రక్షణ కాదు గోవులకు శిక్ష. లక్షల్లో హుండీ ఆదాయం. అమావాస్య రోజు మూడు లక్షల వరకు హుండీ నిండుతోంది. అక్కడ ఉన్న మేనేజ్మెంట్‌ జేబులు కూడా బాగా నిండుతాయి. కానీ ఆవుల ఆకలి కడుపులు మాత్రం నిండవు. ఆహారం లేక నిత్యం గోవులు సొమ్మసిల్లి పడిపోతుంటాయి. నడుము బొక్కలు, కాళ్ల బొక్కలు విరిగి ఒక మూలన పడి వుంటాయి. వందల గోవులకు ఒకటే వాటర్‌ ట్యాంక్‌ ఉంటుంది. అది కూడా గోమయం గోమూత్రం లాంటివి కలవడంతో కలుషితం అయి ఉంటాయి. అవే నీళ్లు తాగడం వల్ల ఎన్నో చర్మవ్యాధులు మరెన్నో వ్యాధులు ఒక ఆవు నుండి మరొక ఆవుకి సంక్రమించి దాదాపు 70 శాతం ఆవులు రోగాలతో బాధపడుతున్నాయి. బొక్కలు విరిగిన ఆవులకు ఒక ప్రత్యేకమైన క్రేన్‌ సదుపాయం ఉంటుంది. అలాంటి ఆవులను పైకి ఎత్తడానికి ప్రత్యేకమైన మెషీన్లు ఉంటాయి. ఆవులను ఆ మెషీన్ల ద్వారా పైకి ఎత్తి క్రేన్‌ లో కూర్చోబెట్టి ఫిజియో థెరపి చేయాలి. కానీ ఎలాంటి మిషన్లు ఉండవు ఎలాంటి క్రేన్లు ఉండవు. జబ్బు చేసిన ఆవులు, బొక్కలు విరిగిన ఆవులను కఠినాతి కఠినంగా మనుషులే పైకి ఎత్తి ఒక మూలన పడేస్తారు. ముఖ్యంగా గోశాలకు వచ్చిన భక్తుల కంట ఇలాంటి గోవులు కనపడకుండా బిల్డింగ్‌ వెనక వైపు పడేస్తారు. ఆ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉంటాయి, ఎన్ని మరణిస్తున్నాయి అన్న రికార్డు సైతం మెయింటేన్‌ చెయ్యరు. వారానికి ఒకటి లేదా రెండు ఆవులు, దూడలు మరణిస్తాయని సమాచారం.

ఇరవై రోజుల క్రితం సొమ్మసిల్లి పడిపోయిన కడుపుతో ఉన్న ఆవు – అయినా అందని సరైన ఆహారం వైద్యం. వచ్చిన భక్తులకు ఆరోగ్యకరమైన ఆవులను చూపిస్తారు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్‌. వారిని వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయించి డబ్బులు తీసుకుని జేబులో వేసుకుంటారు. డబ్బులకు ఎలాంటి లెక్క ఇక్కడ ఉండదు. తెలుగువారు తెలంగాణ వారు తాగుబోతులని చెప్పేసి ఇక్కడ ఉన్న తెలుగు లేబర్‌ ని తీసి వేసేశాడు యజమాని కమల్‌ నారాయణ అగర్వాల్‌. బీహార్‌ నుండి కొంత మంది లేబర్‌ ని తెప్పించుకుని వారితో పని సాగిస్తున్నాడు. వారు ఆవులను కఠినాతి కఠినంగా కట్టేసి, మూతి కట్టేసి, కాళ్లు కట్టేసి సన్నటి గల్లీలో ఇరికిస్తారు. తెలంగాణ స్టేట్‌ అనిమల్‌ హస్బెండరీ డైరెక్టర్‌ సమాచారం ప్రకారం అక్కడ ఉన్న ఆవుల సంఖ్యకు అక్కడ ఉన్న స్థలం ఏ మాత్రం సరిపోదు. పైగా కొంత స్థలాన్ని వీళ్లు ఆఫీస్‌ అవసరాలకు వాడుకోవడం వల్ల గోవులకు కేటాయించిన స్థలం మరీ చిన్నదైపోయింది. వీళ్లు మాత్రం ఏసీ గదులు నిర్మించుకొని హాయిగా ఎండాకాలంలో సేదతీరుతున్నారు. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్‌ రిటైర్డ్‌ వెటర్నరీ డాక్టర్‌ గోవుల కోసం తన గళం విప్పాడు. వెంటనే అక్కడ ఉన్న మేనేజ్మెంట్‌, యాజమాన్యానికి అతనిపై కంప్లైంట్‌ ఇచ్చి గోశాల పరువు తీస్తున్నాడు అని చెప్పి అతడిని ఉద్యోగం నుండి పీకేశారు. పై అంతస్తుల్లో ఏసీ ఫంక్షన్‌ హాళ్లు నిర్మించుకున్నారు. భక్తులకు మాయమాటలు చెప్పి చందాలు వసూలు చేసి ఇలాంటి ఫంక్షన్‌ హాళ్లు నిర్మించారు అని జనుల మాట.

వీరి భాగోతం తెలియని భక్తులు గోమాతకు సేవ చేస్తున్నాము  అనే ఉద్దేశ్యంతో లక్షల్లో చందాలు ఇస్తారు. కానీ పాపం ఆవులకు ఇది గోలోకం కాదు యమలోకం. యాజమాన్యం ఒంటెద్దు పోకడల వల్ల అన్ని విపరీతమైన నిర్ణయాల్లో ఇక్కడ జరుగుతుంటాయి. ఇదివరకు ఒక గోడ కట్టారు. ఆ గోడ వల్ల ఆవులకు విపరీతమైన ఇబ్బంది కలగడంతో ప్రజలందరూ దండెత్తారు. సెక్రటేరియట్‌ నుండి అనిమల్స్‌ హస్బెండ్రీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సైతం వచ్చి మందలించడం జరిగింది. తర్వాత ఆ గోడను కూల్చి వేశారు. ఆ గోడకు అయిన ఖర్చు మొత్తం వృథా. అలా ఎన్నో వృథా ఖర్చులు ఉన్నాయి కాని గోవులకు మాత్రం గడ్డి, వైద్యం ఉండదు. ఇక్కడ గోవులకు సరైన సూర్యరశ్మి అందదు. సరైన గాలి ఆడదు.  గోశాల నడుపుతున్న వారు గోవులను కచ్చితంగా ప్రతి రోజు సాయంత్రం లేదా మరే సమయంలోనైనా ఆవులను అలా బయటికి తీసుకువచ్చి గాలికి వెలుతురికి తిప్పాలి అని తెలంగాణ స్టేట్‌ అనిమల్‌ హస్బెండరీ డైరెక్టర్‌ ఇదివరకే చెప్పారు. ఇలా చెయ్యడం కనుక కుదరకపోతే గోవులకు ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నదని కూడా అతను చెప్పారు. ఒకవేళ గోశాల నడపడం చేతకాకపోతే ప్రభుత్వం దృష్టికి కనుక తీసుకొస్తే ఆ గోవులకు సరైన పోషణ ఇస్తామని అన్నారు. కానీ ఒక గోశాలను నగరం నడిబొడ్డు నుండి నగర శివార్లకు మార్చే అధికారం ఒక్క జీ హెచ్‌ ఎం సీ కి మాత్రమే ఉన్నదని అతను చెప్పడం జరిగింది. ఈ విషయంపై జీహెచఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ మరియు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ని కలిస్తే వారు విషయం దాటవేసి ఇప్పుడు వాటి గురించి ఆలోచించే సమయం లేదు అని చెప్పడం మన దౌర్భాగ్యం. ప్రజలందరూ కలిసి గోవులకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో ఖండించి గోవులకు ఏది మంచిదో అది జరిగేట్టు చూడటం అతి పెద్ద గోసేవ. భక్తులు, ప్రజలు, జంతు ప్రేమికులు ఈ విషయాన్ని గమనించగలరు.
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close