Featuredజాతీయ వార్తలు

ఈశాన్య భారతంలో భారీ వర్షాలు

వరదతాకిడికి 1800 గ్రామాలు

  • జనజీవనం అస్తవ్యస్తం

ఈశాన్య భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ వర్షాలతో వరద బీభత్సం చోటు చేసుకుంటోంది. అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు బ్రహ్మపుత్రానది పొంగి ప్రవహిస్తోంది. బ్రహ్మపుత్రా నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరదల కారణంగా మోరిగావ్‌ జిల్లా తెంగగురి ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాల భవనం అందరూ చూస్తుండగానే బ్రహ్మపుత్ర నదిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సుమారు 1800 గ్రామాలు వరదతాకిడికి గురయ్యాయి. తాజాగా అసోంలో నలుగురు మృతి చెందడంతో.. ఆ రాష్ట్రంలో భారీ వరదల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. 25 జిల్లాల్లోని 15 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. వరదల ధాటికి మోరిగావ్‌ జిల్లాలో రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సదుపాయం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు కొందరు నీటిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మరి కొందరు వరద నీటిలోనే పడవలపై ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా అసోంలోని ప్రఖ్యాత కజిరంగ జాతీయ పార్కునూ వరద జలాలు ముంచెత్తాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ పలుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరోపక్క బీహార్‌లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యానాలోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి సైతం వరద నీరురావడంతో జనజీవనం స్తంభించిపోయింది. ముంచెత్తిన వరదలతో చాలా గ్రామాలు జలమయమైనాయి. చెట్లు విరిగి వరదల్లో కొట్టుకుపోతున్నాయి. అరారియా ప్రాంతంలో వివాహ శుభకార్యం జరగుతుండగా గ్రామం ముంపుకు గురైంది. వధువరులను పడవలో సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చిన దృశ్యాలు వరదల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ధర్భంగా, మధుబాని ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు నీటిలో కొట్టుకుపోయాయి. వరదముంపుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరదబాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లోని వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవల సహకారంతో జనాలను తరలిస్తున్నారు. హార్‌లో అయిదు నదులు ప్రమాద సూచికను దాటి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరదల్ని అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని కోరారు. ఖాట్మండు ప్రాంతం నుంచి వస్తున్న బాగ్మతి నది ధేంగ్‌, సోనాఖాన్‌, డుబ్బాదర్‌,కటౌంజా ప్రాంతాల్లో ప్రమాద సూచికను దాటింది. ఇప్పటి వరకు బీహార్‌, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు వర్షాలు, వరదల కారణంగా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్ళను రద్దు చేశామని, మరి కొన్నింటిని మళ్లించామని రైల్వే శాఖ ఉన్నతాధికారి తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close